రాకాసి అలలు.. ఎన్నో కుటుంబాల్లో మరణ శాసనం రాసి సముద్రమంత దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. ఆరాటంగా వచ్చే కెరటాలను ఆప్యాయంగా హత్తుకునేలోపు పర్యాటకుల జీవితాల్లో తీరం విషాదాన్ని నింపుతున్నాయి. గజ ఈతగాళ్లు ఉన్నా.. మునిగిపోతున్నవారిని చేరేలోపే మృత్యు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ చెప్పేందుకు విశాఖ వాసులు సరికొత్త డ్రోన్‌ను ఆవిష్కరించారు. సైఫ్‌సీస్ పేరుతో రూపొందించిన ఈ పరికరం మృత్యు అలలను ఎదిరించి మునిగిపోతున్న వారి ప్రాణాలు కాపాడగలదు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రయల్ రన్‌ను పర్యాటక శాఖ నిర్వహించింది.
సాక్షి, విశాఖపట్నం: సముద్ర తీరంలో ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఎవరికైనా ఈత కొట్టాలనిపిస్తుంటుంది. కానీ రాకాసి అలలు మింగేస్తాయని భయం అందరిలోనూ ఆందోళన రేకెత్తించినా.. అక్కడి పరిస్థితులు వాటిని లెక్కచెయ్యనీయవు. ఫలితంగా ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. పుష్కర కాలంలో సుమారు 600 మంది అలలకు బలయ్యారు. ఇందులో 60 శాతం మంది 15 నుంచి 30 ఏళ్లలోపువారే ఉండటం బాధాకరమైన విషయం.
నగర పరిధిలోని అన్ని బీచ్‌పాయింట్లలో ఉండే లైఫ్‌గార్డులు సముద్రంలో మునిగిపోతున్న చాలా మందిని ప్రాణాలతో కాపాడారు. అయితే అలల ఉధృతికి లోపలకు కొట్టుకుపోతున్న వారి వద్దకు లైఫ్‌గార్డులు వెళ్లేలోపే కొందరు మృత్యువాతపడుతున్నారు. ఇటువంటి వారిని కాపాడేందుకు విశాఖకు చెందిన ఓ బృందం సైఫ్‌సీస్ పేరుతో డ్రోన్‌ను తయారు చేసింది.
దగ్గరలోనే లోతు.. వదులుగా ఇసుక మిగిలిన సముద్ర తీరాలతో పోలిస్తే విశాఖ తీరం రూపురేఖలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు మచిలీపట్నం దగ్గర సముద్రంలో చాలా దూరం వెళ్తే గానీ లోతుండదు.
గోవా దగ్గర సముద్రంలో దాదాపు కిలోమీటర్ దూరం వరకూ నడిచి వెళ్లొచ్చు. కానీ విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద పది మీటర్ల ముందుకెళ్తే చాలు లోతు ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఆర్‌కే బీచ్‌కు దక్షిణ, ఉత్తరం వైపు రెండు నుంచి మూడు మీటర్ల లోతుంటుంది. కొన్నాళ్లుగా కోత ప్రభావంతో ఈ లోతు మరింతగా పెరుగుతూ వస్తోంది. ఆర్‌కే బీచ్‌తో పాటు భీమిలి, రుషికొండ, తొట్లకొండ, సాగర్‌నగర్ దగ్గర లోతుతో పాటు ఇసుక ఎక్కువ వదులుగా ఉంటుంది. కెరటం వచ్చి వెనక్కు వెళ్లే సమయంలో ఇసుక ఎక్కువగా జారిపోతుంటుంది. దీన్ని అంచనా వెయ్యలేక పోవడంతో కాళ్లు పట్టుకోల్పోయి లోతులోకి జారిపోయి గల్లంతయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సముద్రంలో ప్రమాదాల్లో ఉన్న వారిని కాపాడేందుకు ఈ సైఫ్‌సీస్ డ్రోన్లు ఉపయోగపడతాయి.
సైఫ్ సీస్.. ఇలా రక్షిస్తుంది..
సాధారణంగా లైఫ్‌గార్డ్ సెకనుకు మీటరు నుంచి మీటరున్నర దూరం ఈదుతూ వెళ్లగలరు. 30 మీటర్ల దూరంలో పర్యాటకుడు మునిగిపోతుంటే.. అక్కడికి చేరుకోవడానికి కనీసం 25 సెకన్ల సమయం లైఫ్‌గార్డుకు పడుతుంది. కానీ.. గజఈతగాడి కంటే ఐదు రెట్లు వేగంగా ఈ మానవ రహిత డ్రోన్‌లు దూసుకెళ్తుంది. 30 మీటర్ల దూరాన్ని కేవలం 5 నుంచి 6 సెకన్ల వ్యవధిలోనే చేరుకొని బాధితుడిని రక్షించగలదు.
- అంటే లైఫ్‌గార్డు కంటే 7 రెట్లు వేగంగా స్పందిస్తుంది.
- లైఫ్‌గార్డు ఒకసారి ఒక వ్యక్తిని మాత్రమే రక్షించగలరు. కానీ.. సైఫ్‌సీస్ 200 కిలోల బరువు వరకూ ఎంత మంది ఉంటే అందర్ని ఒడ్డుకు తీసుకురాగలదు.
- గంటకు 15 కిలో మీటర్ల వేగంతో అలలను చీల్చుకుంటూ ముందుకు వెళ్లగల సామర్థ్యం దీని సొంతం.
- పూర్తిగా రిమోట్ ద్వారా ఒడ్డున నిలబడే ఆపరేట్ చేస్తూ.. మునిగిపోతున్న వారి వద్దకు ఈ డ్రోన్లను క్షణాల్లో పంపించవచ్చు.
- దాదాపు 3 కిలోమీటర్ల వరకూ దీన్ని పంపించవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీలు 90 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ అవుతుంది. ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే గంట పాటు పనిచేస్తాయి. స్టాండ్ బై మోడ్ 5 నుంచి 6 గంటల వరకూ ఉంటుంది.
- 22 కేజీల బరువుండే ఈ డ్రోన్‌ను పట్టుకుంటే మళ్లీ జారిపోకుండా గ్రిప్ ఉంటుంది.
- ఒక్కో డ్రోన్ ఖరీదు రూ.6 లక్షల వరకూ ఉంటుంది.
- 3 కిలోమీటర్ల దూరం వరకూ దీనిని కంట్రోల్డ్‌గా ఆపరేట్ చెయ్యవచ్చు.
భారత ప్రభుత్వ ప్రశంసలు
విశాఖ బృందం చేసిన ఈ సైఫ్‌సీస్ డ్రోన్‌కు అన్ని రాష్ట్రాల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డిఫెన్స్ ఎక్స్‌పోలో సైఫ్‌సీస్‌ని ప్రదర్శించారు. ప్రధాని మోదీ దీని పనితీరుని తెలుసుకొని బృంద సభ్యులను అభినందించారు. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పర్యాటక అవసరాల కోసం వీటిని కొనుగోలు చేసుకున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ.. కొద్ది నెలల క్రితం సైఫ్‌సీస్ డ్రోన్ ట్రయల్ రన్‌ను నిర్వహించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర పర్యాటక శాఖ ఉన్నతాధికారులకు పంపించినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రోత్సహిస్తే.. ప్రాణాలు కాపాడతాం..
మూడేళ్ల పాటు శ్రమించి సైఫ్‌సీస్ డ్రోన్‌ని ఇండియన్ నేవీ స్పెసిఫికేషన్స్‌తో తయారు చేశాం. సైఫ్‌సీస్‌ని డీఆర్‌డీవో–ఎన్‌ఎస్‌టీఎల్ అప్రూవ్ డిజైన్‌తో రూపుదిద్దుకుంది. లైఫ్‌గార్డుల కంటే వేగంగా చేరుకోవడం వల్ల సముద్రంలో మునిగిపోతున్న వారిని కాపాడగలం. 100 శాతం ఆటోమేటిక్‌గా రోబోటిక్ ప్రోబ్స్‌తో దీన్ని తయారు చేశాం. పలు రాష్ట్రాల్లో చాలా మంది ప్రాణాలను కాపాడుతోంది. ఏపీలో ప్రోత్సహిస్తే వైజాగ్ బీచ్‌లో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడగలమన్న విశ్వాసం మాకు ఉంది.
– అలీఅస్‌గర్ కలకత్తావాలా, సైఫ్‌సీస్ కో–ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment