ఓరుగల్లు, కరీంనగర్‌లకు సీ ప్లేన్‌లో
♦ భాగ్యనగరం నుంచి పర్యాటక విమానాలు
♦ పెద్ద చెరువులుంటే చాలు.. ఎయిర్‌పోర్టులు అవసరంలేదు
♦ రెండు సంస్థలతో ప్రభుత్వం చర్చలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి వరంగల్‌కు విమానంలో వెళ్లాలనుందా.. కొద్ది రోజుల్లో ఆ అవకాశం అందుబాటులోకి రావచ్చు.. ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి.. అదేంటి.. అసలు వరంగల్ విమానాశ్రయం శిథిలావస్థలో ఉంటే విమానం ఎలా వెళ్తుందని ఆశ్చర్యపోతున్నారా... ఈ విమానానికి ఎయిర్‌పోర్టు అవసరం లేదు.. ఎంచక్కా అక్కడి భద్రకాళి చెరువులోనో, వడ్డేపల్లి చెరువులోనో దిగుతుంది. హైదరాబాద్‌లోనేమో హుస్సేన్‌సాగర్ నుంచి రివ్వున ఎగిరిపోతుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీన్ని కార్యరూపంలోకి తెచ్చే ప్రయత్నాలైతే సాగుతున్నాయి.
అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘సీ ప్లేన్’లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. తేలికపాటి విమానాలు నీళ్లలో దిగే ఏర్పాటుతోపాటు నేలపైనా దిగేందుకు అనువైనవి. సీప్లేన్‌లను రంగంలోకి దించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవచ్చని ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. గతంలో విదేశీ పర్యటన సమయంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దీనిపై దృష్టి సారించారు. అక్కడి తరహాలో హైదరాబాద్‌లో సీ ప్లేన్‌ను అందుబాటులో ఉంచితే గగనతలం ద్వారా హైదరాబాద్‌తోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను వీక్షించే అవకాశం ఉంటుం దని, ఇది పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుందని ఆయన ప్రభుత్వానికి నివేదించారు. దీనికి ప్రభుత్వం పచ్చజెండా ఊపటంతో కసరత్తు మొదలైంది.
కేవలం పర్యాటకులను తిప్పటానికి మాత్రమే వాటిని పరిమితం చేయకుండా హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్న వరంగల్, కరీంనగర్ లాంటి నగరాలకు కూడా వాటిని నడిపితే ఎలా ఉంటుందనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. వీటికి ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టులు అవసరం లేనందున ఆ నగరాల్లోని నీటి వనరులను టేకాఫ్, ల్యాండింగ్‌కు వాడొచ్చు. వరంగల్‌లో భద్రకాళి, వడ్డేపల్లి చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు టేకాఫ్, ల్యాండింగ్‌కు సరిపోతాయో లేదో పరిశీలించనున్నారు. ఇక కరీంనగర్‌కు ఆనుకునే ఉన్న లోయర్ మానేర్‌డ్యాం బాగా ఉపయోగపడనుంది. 15 నిమిషాల ప్రయాణానికి రూ.4 వేల వరకు, అరగంట ప్రయాణానికి 9 వేల వరకు చార్జి చేసే అవకాశం ఉంది. ఒక్కో విమానంలో పదిమంది ప్రయాణించే వెసులుబాటుంటుంది.
హెలికాప్టర్లు నడిపేందుకు...
ఇక హెలికాప్టర్లు నడిపేందుకు మరో రెండు సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటికోసం హెలీప్యాడ్లు తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. అందుకుగాను ఆ సంస్థకు రుసుము చెల్లించే విషయంలో చర్చలు సాగుతున్నాయి. సరిపడా స్థలాన్ని కేటాయిస్తే తామే నిర్వహించేందుకు సిద్ధమని పర్యాటక శాఖ స్పష్టం చేసింది. ఇది కూడా మరో వారంపదిరోజుల్లో కొలిక్కి రానుంది. వెరసి ఫిబ్రవరిలో ఇటు హెలికాప్టర్ అటు సీ ప్లేన్లు అందుబాటులోకి రావటం ఖాయంగా కనిపిస్తోంది. పర్యాటకప్రాంతాలను గగనతలం నుంచి వీక్షించే అనుభవం లేని నగర పర్యాటకులు వాటి రాకకోసం ఎదురుచూస్తున్నారు.
మరికొద్దిరోజుల్లో స్పష్టత
హైదరాబాద్ కేంద్రంగా సీప్లేన్ నిర్వహణకు రెండు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. వాటితో ధరల విషయంలో చర్చలు సాగుతున్నాయి. టికెట్లను ప్రభుత్వమే విక్రయించుకుని తమకు నెలవారీ నిర్ధారిత మొత్తాన్ని చెల్లించాలని ఆ సంస్థలు కోరుతున్నాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. వాటి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకుని టికెట్లను ఆయా సంస్థలే విక్రయించుకోవాలని పేర్కొంటోంది. దీనిపై మరో వారంపది రోజుల్లో స్పష్టత రానుంది.