పర్యాటకం వద్దు.. ఈవెంట్లే ముద్దు | Chandrababu naidu Neglect on Tourism Department | Sakshi
Sakshi News home page

పర్యాటకం వద్దు.. ఈవెంట్లే ముద్దు

Published Fri, Dec 28 2018 8:34 AM | Last Updated on Fri, Dec 28 2018 8:34 AM

Chandrababu naidu Neglect on Tourism Department - Sakshi

సాక్షి, అమరావతి  :రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడని ఈవెంట్ల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. సోషల్‌ మీడియా సమ్మిట్‌... ఎఫ్‌1హెచ్‌2ఓ బోట్‌ రేసింగ్‌... ఎయిర్‌ షో వంటి వాటికి రూ.కోట్లు వెచ్చించింది. రానున్న రెండు, మూడు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో నిర్వహించే ఈవెంట్ల గురించి విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పర్యాటక శాఖ ఇప్పటికే ఒక నివేదిక రూపొందించినట్లు సమాచారం. ఈవెంట్ల ప్రచారం కోసం ఎన్ని రూ.కోట్లు అయినా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో నిర్వహించే ఈవెంట్లను తిలకించేందుకు విదేశాల నుంచి పర్యాటకులు పెద్దగా వచ్చే అవకాశం లేకపోయినా అక్కడ ప్రచారానికి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం ఏమిటని సాక్షాత్తూ పర్యాటక శాఖ అధికారులే ప్రశ్నిస్తున్నారు.

విదేశీ పర్యాటకులు నిల్‌  
రాష్ట్రంలో ఇటీవల సోషల్‌ మీడియా సమ్మిట్‌ను ప్రభుత్వం నిర్వహించింది. ఇందుకోసం బాలీవుడ్‌ సినిమా తారలను కూడా రప్పించారు. ఈ సమ్మిట్‌కు కోట్లాది రూపాయలను మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక కృష్ణా నదిలో ఎఫ్‌1హెచ్‌2ఓ పవర్‌ బోట్‌ రేసింగ్‌ను వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది పర్యాటకులు హాజరవుతున్నారని ప్రభుత్వం భావించింది. వారికి వసతులు కల్పించే పేరిట విజయవాడ, గుంటూరు లాడ్జిల్లోని గదులను పర్యాటక శాఖ బుక్‌ చేసింది. ఈ బోట్‌ రేసింగ్‌కు కనీసం దేశవిదేశాల నుంచి 500 మంది కూడా హాజరు కాలేదు. లాడ్జీల్లో గదులన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ రూ.20 లక్షల అద్దె చెల్లించాల్సి వచ్చింది. ఇటీవల కృష్ణా నది వేదికగా ఐదు రోజులపాటు నిర్వహించిన ఎయిర్‌షో గురించి ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి భారీగా ఖర్చు చేశారు. ఈ ఎయిర్‌షోకు పెద్దగా ప్రజాస్పందన లభించలేదు. కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఈవెంట్లపై టీవీలు, హోర్డింగ్‌ల ద్వారా ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తుండడం చూసి ప్రజలు విస్తుపోతున్నారు.

కెనాల్‌ సిటీ, బీచ్‌ సిటీ ఎక్కడ బాబూ!
వైఎస్సార్‌ జిల్లాలోని గండికోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో గండికోటలో తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామని 2015 నవంబర్‌ 15న సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ అతీగతి లేకుండా పోయింది. నాగార్జున సాగర్‌ను బౌద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు హామీ మాటలకే పరిమితమైంది. చిత్తూరు జిల్లా తిరుపతిలో 100 చెరువులను అభివృద్ధి చేసి, లేక్‌సిటీగా మారుస్తామని చంద్రబాబు గతంలో ఘనంగా ప్రకటించారు. విజయవాడను కెనాల్‌ సిటీగా, విశాఖను బీచ్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు మూడేళ్ల క్రితం హామీ ఇచ్చారు. కానీ, ఆ సిటీలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎకో టూరిజం, బుద్ధిస్ట్‌ టూరిజం, హెరిటేజ్‌ టూరిజం, టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్, రిక్రియేషన్‌ అండ్‌ టూరిజం అడ్వెంచర్‌ బేస్డ్‌ టూరిజం, మెడికల్‌ టూరిజం ఏర్పాటు కోసం పలు కంపెనీలు ముందుకొచ్చి అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నా పనులు మాత్రం అడుగు కూడా ముందుకు పడడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement