Toyota Kirloskar
-
టయోటా హైలక్స్ బుకింగ్స్ ప్రారంభం
ముంబై: వాహన తయారీ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ ప్రీమియం యుటిలిటీ వెహికిల్ హైలక్స్ బుకింగ్స్‌ను తిరిగి ప్రారంభించింది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్స్ స్వీకరిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2022 జనవరిలో కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరించింది. సరఫరా అడ్డంకుల నేపథ్యంలో అదే ఏడాది ఫిబ్రవరిలో బుకింగ్స్‌ను నిలిపివేసింది. హైలక్స్ ధర ఎక్స్‌షోరూంలో రూ.33.99 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 2.8 లీటర్ డీజిల్ ఇంజన్ పొందుపరిచారు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాలకైనా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హైలక్స్.. భారత మార్కెట్లో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని విశ్వసిస్తున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్, స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. -
వాహన విక్రయాల్లో వృద్ధి
ముంబై: గత ఆర్థిక ఏడాది చివరి నెల మార్చి వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, ఎంజీ మోటార్స్ విక్రయాలు క్షీణించాయి. వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ద్విచక్ర వాహనాలు అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ‘‘2021–22లో వాహనాల ఉత్పత్తిపై ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత కొంత ప్రభావం చూపింది. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరా పరిస్థితి అనూహ్యంగా కొనసాగుతున్నందున ప్రస్తుత సంవత్సరంలో ఇది కొంత ప్రభావం చూపవచ్చు’’ అని మారుతీ తెలిపింది. ► మారుతీ సుజుకీ మార్చి మొత్తం అమ్మకాలు 1,43,899 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఫిబ్రవరిలో విక్రయించిన మొత్తం 1,55,417 విక్రయాలతో పోలిస్తే స్వల్పంగా ఆరుశాతం(6.3)గా ఉంది. 2021–22లో ఎగుమతులు 2,38,376 యూనిట్లు నమో దయ్యాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయి ఎగుమతులు రికార్డు కావడం సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి. ► కియా మోటర్స్ మార్చి విక్రయాలు 18% పెరిగాయి. ఈ మార్చిలో మొత్తం 22,622 యూనిట్లకు అమ్మింది. ఒక నెలలో ఈ స్థాయిలో విక్రయించడం ఇదే తొలిసారి. సెమికండెక్టర్ల కొరత కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,86,787 వాహనాలను విక్రయించింది. ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాల్లో టాటా మోటార్స్ 35 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ మార్చిలో 86,718 కార్లను అమ్మగా.. గతేడాది ఇదేనెలలో 42,293 యూనిట్లను అమ్మింది. హీరో మోటో మార్చి అమ్మకాలు 14% క్షీణించాయి. గతే డాది మార్చిలో 5.24 లక్షల వాహనాలను విక్రయించగా.., ఈ మార్చిలో 4.50 లక్షల యూనిట్లు అమ్మింది. -
‘ఉద్యోగులకు కార్ల కంపెనీలు బంపర్ ఆఫర్’
ముంబై: కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను నియంత్రించేందుకు అన్ని దేశాలు లాక్డౌన్లు ప్రకటించాయి. కానీ కార్ల తయారీ కంపెనీలు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లతో ఉద్యోగులను ఆశ్చర్యపరుస్తున్నాయి. టయోటా కిర్లోస్కర్, హుండాయ్ మోటార్ ఇండియా, మారుతీ సుజుకీ తదితర కంపెనీలు ఉద్యోగులకు భారీ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ప్రకటించాయి. లాక్‌డౌన్‌లోను హోండా, టయోటా తదితర కంపెనీలు 4నుంచి 14శాతం ఉద్యోగులకు వేతనాలు పెంపెను ప్రకటించాయి. వేతనాల పెంపుపై హుండాయి మోటార్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్టీఫన్ సుధాకర్ స్పందిస్తు.. తమ కంపెనీలో బ్లు కాలర్ ఉద్యోగులకు నైపుణ్యం ఆధారంగా ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. అయితే త్వరలోనే జూనియర్, మిడిల్(మధ్యస్థాయి), సీనియర్ లెవల్ ఉద్యోగులకు వేతనాల విషయంలో ప్రణాళిక రచిస్తున్నట్లు స్టీఫన్ సుధాకర్ తెలిపారు. కాగా ఎమ్జీ మోటార్ ఇండియా కంపెనీకి చెందిన రాజీవ్ చాబా స్పందిస్తు.. కంపెనీ వృద్ధి సాధారణ స్థాయికి వస్తే రాబోయే రెండు, మూడు నెలల్లో ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మహీంద్ర చీప్ హెచ్ ఆర్ రాజేశ్వర్ తిరుపతి స్పందిస్తూ.. ప్రస్తుతం వేతన తగ్గంపు ఉండదని, సాధారణంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లే ఈ సంవత్సరం కూడా ఉద్యోగులకు ప్రయోషన్లు, ఇంక్రిమెంట్లు కల్పించనున్నట్లు తెలిపారు. అయితే దేశంలో లాక్డౌన్ సడలించి రెండు నెలలు అయినందున ప్రముఖ కార్ల కంపెనీలు 85శాతం అమ్మకాలతో జోరుమీదున్నాయి. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు తమ గ్రామాలకు వెళ్లడం వల్ల సిబ్బంది కొరత వేదిస్తున్నట్లు కార్ల కంపెనీ అధికారులు పేర్కొంటున్నారు -
లెక్సస్ బ్రాండ్ రాకకు మళ్లీ బ్రేక్
ముంబై : టయోటా కొత్త బ్రాండు లెక్సస్ ఆవిష్కరణకు భారత్‌లో మళ్లీ బ్రేక్‌లు పడ్డాయి. లెక్సస్, డాయ్ హాట్సూ బ్రాండులను భారత్‌లో ఇప్పట్లో ప్రవేశపెట్టకూడదని టయోటా నిర్ణయించింది. దేశ రాజధాని ప్రాంతంలో డీజిల్ వెహికిల్స్‌పై నిషేధం నేపథ్యంలో టయోటా తాజా నిర్ణయం తీసుకుందని, ఈ బ్రాండ్ల రాకకు మరికొంత కాలం ఆలస్యం కావొచ్చని లోకల్ యూనిట్ వైస్ చైర్మన్ చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు క్లియర్ అయ్యేంత వరకు భారత్‌లో కొత్త పెట్టుబడులేమీ కూడా పెట్టకూడదని టయోటా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అయితే గత ఐదేళ్లలో ఇప్పటికీ మూడుసార్లు భారత్‌లోకి ప్రవేశించబోయి ఆగిపోయిన లెక్సస్ బ్రాండ్, టయోటా తాజా నిర్ణయంతో మరోమారు ఈ బ్రాండ్ భారత్‌లో ప్రవేశానికి నోచుకోవడం లేదు. లగ్జరీ లెక్సస్ బ్రాండ్‌ను 2017 మొదట్లో, ఫెస్టివల్ సీజన్లో డాయ్హాట్సూలను భారత రోడ్లపై పరుగులు పెట్టించాలని టయోటా నిర్ణయించింది. కానీ న్యూఢిల్లీలో పెద్ద డీజిల్ వాహనాలపై నిషేధం ఈ బ్రాండుల ప్రవేశానికి ఆటంకంగా మారిందని కంపెనీకి చెందిన ప్రతినిధులు చెప్పారు. ఫైనల్ కోర్టు ఆర్డర్లపై ఆటోమొబైల్ ఇండస్ట్రి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. డీజిల్ వాహనాల వల్ల వస్తున్న కాలుష్య ముప్పు సమస్యతో నేషనల్ రాజధాని ప్రాంతంలో పెద్ద డీజిల్ వాహన అమ్మకాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో 10ఏళ్లకు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్ల పెట్రోల్ వాహనాలకు డీ-రిజిస్ట్రర్ చేయాలని ఎన్జీటీ గత నెలే ఆదేశాలు కూడా జారీచేసింది. అయితే ప్యాసెంజర్ వాహన అమ్మకాల్లో ఎన్సీఆర్ కనీసం 12శాతం నమోదుచేస్తోంది. ఈ ప్రాంతంలో డీజిల్ వెహికిల్స్ మొత్తం అమ్మకాలు 25-30 శాతంగా రికార్డు అవుతున్నాయి. డీజిల్ వాహన విక్రయంలో టాప్ సెల్లింగ్ మోడల్స్ గా ఉంటున్న టయోటా.. ఈ ఆదేశాలతో ఎక్కువగా నష్టపోతోంది. -
సూపర్ బైక్స్ హల్చల్
పన్నెండవ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరణల జోరు కొనసాగుతోంది. ఈ ఎక్స్పో రెండో రోజైన గురువారం సూపర్ బైక్‌లు సందడి చేశాయి. పలు కంపెనీలు భారీ పెట్టుబడుల ప్రణాళికలను కూడా ప్రకటించాయి. డీఎస్కే హ్యోసంగ్, ట్రయంఫ్, టెర్రా మోటార్స్‌లు సూపర్ బైక్‌లను ఆవిష్కరించాయి. వివరాలు మారుతీ సుజుకి: ఈ కంపెనీ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్లో కొత్త కారు, సెలెరియోను ఆవిష్కరించింది. ధర రూ.3.9 -రూ.4.96 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ మోడల్లో ఆటోమాటిక్ గేర్ షిఫ్ట్ వేరియంట్లు రెండింటిని అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కార్లకు సాధారణంగా మూడు సమస్యలుంటాయని వివరించింది. ధర అధికంగా ఉండడం, మైలేజీ తక్కువగా వస్తుండడం, నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండడం వంటి ఈ మూడు సమస్యలను తీర్చేలా ఈ సెలెరియో కారును రూపొందించామని పేర్కొంది. టయోటా: తొలి క్రాసోవర్, న్యూ ఇటియోస్ క్రాస్‌ను ఆవిష్కరించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారును ఈ ఏడాది మేలో అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. కారు ప్లాట్‌ఫామ్‌పై ఎస్యూవీ ఫీచర్లతో రూపొందించే వాహనాలను క్రాసోవర్‌గా పరిగణిస్తారు. ధర ఇటియోస్ లివా కార్ల ధర (రూ.4.23లక్షలు-7.12 లక్షలు)ల కన్నా అధికంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా: ఈ కంపెనీ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు హలోను ఆవిష్కరించింది. మూడేళ్లలో ఈ కారును మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 200 కిమీ దూరం ప్రయాణిస్తుందని, 0-100 కి.మీ.లను 8 సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. అని పేర్కొంది. గంటలోనే పూర్తిగా రీచార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ వాహనం ఈ20ను కంపెనీ డిస్ప్లే చేసింది. ఇక టూవీలర్ల విషయానికొస్తే 300 సీసీ బైక్ మోజోను ఆవిష్కరించింది. ఈ ఏడాదే ఈ బైక్‌ను మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. టాటా మోటార్స్: కార్లలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ అందించడానికి టాటా మోటార్స్, శామ్సంగ్ కంపెనీలు చేతులు కలిపాయి. శామ్సంగ్ అందించే మిర్రర్లింక్ టెక్నాలజీతోకూడిన డ్రైవ్ లింక్ యాప్‌తో ప్రయాణికుల వాహనాలను టాటా మోటార్స్ వచ్చే ఏడాది అందించనున్నది. ఈ టెక్నాలజీ వల్ల కారును నడిపే డ్రైవర్ కాల్స్‌కు ఆన్సర్ చేయవచ్చు. ఇంటర్నెట్ను యాక్సెస్, మ్యూజిక్‌ను కూడా వినవచ్చు. జేబీఎం: వాహన విడిభాగాలు తయారు చేసే జేబీఎం గ్రూప్ సిటీలైఫ్ పేరుతో ఫ్లోర్ ఎత్తు తక్కువగా ఉండే సిటీ బస్‌ను ఆవిష్కరించింది. సీఎన్జీ, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ బస్సుల తయారీ ప్రాజెక్ట్ కోసం గత రెండేళ్లలో రూ. 500 కోట్లు పెట్టుబడులు పెట్టామని పేర్కొంది. ట్రయంఫ్: ఈ బ్రిటిష్ బైక్ కంపెనీ కొత్తగా డేటోన 675 బైక్‌ను ఆవిష్కరించింది. ధర రూ.10.15 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ తాజా బైక్‌తో కంపెనీ భారత్‌లో విక్రయిస్తున్న బైక్‌ల సంఖ్య 11కు చేరింది. డీఎస్కే హ్యోసంగ్: 250సీసీ బైక్ అక్విలా 250ను ఆవిష్కరించింది. ధర రూ. 2.69 లక్షలు. ఈ బైక్‌తో పాటు మరో మూడు బైక్‌లు-ఆర్టీ 125డీ, జీడీ 250ఎన్, కామెట్ 250లను కూడా డిస్ప్లే చేసింది. ఈ మూడు బైక్‌లను ఈ ఏడాది దసరా, దీపావళి పండుగల కల్లా అందుబాటులోకి తెస్తామని వివరించింది. 125 సీసీ బైక్‌ను 2016లో మార్కెట్లోకి తెస్తామని పేర్కొంది. హీరో: మూడు కొత్త స్కూటర్ మోడళ్లు- 110 సీసీ డాష్, 110 సీసీ డేర్, 100 సీసీ జిర్లను ఆవిష్కరించింది. ఈ మూడు స్కూటర్లను ప్రముఖ హిందీ సినిమా నటుడు రణబీర్ కపూర్ ఆవిష్కరించారు. డాష్, డేర్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా అందిస్తామని పేర్కొంది. పెట్టుబడులు.. వచ్చే మూడేళ్లలో రూ.5,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మహీంద్రా గ్రూప్ పేర్కొంది. ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ, భారత్‌లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, రూ.6,200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హిందూజా గ్రూప్ పేర్కొంది. రియల్టీ, మీడియా, విద్యుత్తు వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని పేర్కొంది. వాహన ప్యాకేజీ కావాలి: ప్రఫుల్ గ్రేటర్ నోయిడా: అమ్మకాలు తగ్గి ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వాహన రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ అందించడం అవసరమని భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కోరారు. ఈ ప్యాకేజీలో భాగంగా వాణిజ్య వాహనాలపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని ప్రస్తుతమున్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గించడం, ఇతరత్రా చర్యలను తీసుకోవాలని సూచించారు. అన్ని సెగ్మెంట్ల వాహనాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆర్థిక మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నామని, వాహన రంగానికి వీలైనంత మేలు చేసే చర్యలు తీసుకుంటామని ఆయన అభయం ఇచ్చారు. ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆయన మాట్లాడారు.