Toyota Kirloskar Motors Private Limited
-
ఇన్నోవా క్రిస్టాలో రెండు కొత్త గ్రేడ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త ఇన్నోవా క్రిస్టా వాహనానికి సంబంధించి రెండు టాప్ గ్రేడ్ల (జెడ్ఎక్స్, వీఎక్స్) ధరలను టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం) ప్రకటించింది. ఇందులో జెడ్ఎక్స్ గ్రేడ్ ధర రూ. 25.43 లక్షలు కాగా, వీఎక్స్ రేటు వేరియంట్‌ను బట్టి రూ. 23.79–23.84 లక్షలుగా (ఎక్స్ షోరూం) ఉంటుందని తెలిపింది. వీటిలో 7 ఎయిర్బ్యాంగ్లు, ముందు..వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్మార్ట్ ఎంట్రీ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయని పేర్కొంది. దీనితో ప్రస్తుతం మొత్తం నాలుగు గ్రేడ్లలో (జీ, జీఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్) కొత్త ఇన్నోవా క్రిస్టా లభిస్తున్నట్లవుతుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ తెలిపారు. రూ. 50,000 చెల్లించి ఆన్లైన్లో లేదా డీలర్ల దగ్గర బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
టయోటా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ ‘వెల్ఫైర్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ సెల్ఫ్ చార్జింగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ ‘వెల్ఫైర్’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. హైదరాబాద్ వేదికగా ఈ లగ్జరీ మల్టీ పర్పస్ వాహనాన్ని కంపెనీ బుధవారం విడుదల చేసింది. ఎక్స్ షోరూం ధర రూ.79.50 లక్షలు. డ్యూయల్ మోటార్స్‌తో 2.5 లీటర్ల గ్యాసోలిన్ హైబ్రిడ్ ఇంజన్ పొందుపరిచారు. 2800–4000 ఆర్పీఎంతో 198 ఎన్ఎం టార్క్, మైలేజీ లీటరుకు 16.35 కిలోమీటర్లు. భద్రత కొరకు 7 ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్, వెహికిల్ డైనమిక్స్ ఇంటెగ్రేటెడ్ మేనేజ్మెంట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లను జోడించారు. 40 శాతం దూరం, 60 శాతం సమయం ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణిస్తుంది. కళ్లు చెదిరే ఇంటీరియర్స్, ట్విన్ మూన్‌రూఫ్స్ దీని ప్రత్యేకత. నాలుగు రంగుల్లో లభిస్తుంది. హైదరాబాద్ నుంచి 20%..: టెస్ట్ మార్కెట్‌గా పేరొందడంతోపాటు ప్రధాన మార్కెట్ కావడంతో వెల్‌ఫైర్‌ను హైదరాబాద్ వేదికగా విడుదల చేసినట్టు టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. తొలి 3 నెలల షిప్‌మెంట్స్ అమ్ముడైనట్టు టీకేఎం ఎస్వీపీ నవీన్ సోని వెల్లడించారు. ఒక్కో షిప్మెంట్లో 60 వాహనాలు ఉంటాయని వివరించారు. అమ్ముడైన వాహనాల్లో 20%పైగా హైదరాబాద్ నుంచే నమోదయ్యాయన్నారు. అంతర్జాతీయంగా 6 లక్షలకుపైగా వెల్ఫైర్ వాహనాలు విక్రయమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతం పూర్తిగా తయారైన వెల్ఫైర్ వాహనాలను జపాన్ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నట్టు చెప్పారు. 1.5 కోట్ల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా విక్రయించామని టీకేఎం ఎండీ మసకజు యోషిముర వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టయోటాకు 43% వాటా ఉందన్నారు. -
మార్కెట్లోకి టొయోటా ఇతియోస్ క్రాస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో నాల్గో అతిపెద్ద కార్ల కంపెనీ అయిన టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీకేఎం) మరో సరికొత్త కార్‌తో నగరవాసుల ముందుకొచ్చింది. టీకేఎం జీఎం ఆర్కే రమేష్, హర్ష టొయోటా డీలర్ ప్రిన్సిపల్ హర్షవర్ధన్, రాధాకృష్ణ టొయోటా డీలర్ ప్రిన్సిపల్ ఎంవీ శ్రీనివాస్ శనివారమిక్కడ ‘ఇతియోస్ క్రాస్’ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ఏటా 2 లక్షల టొయోటా కార్లను విక్రయిస్తున్నామని చెప్పారు. మిలియన్ కార్లను విక్రయించిన కంపెనీల జాబితాలో ఇటీవలే తామూ చేరామని, ఇది చాలా ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 18 ఔట్లెట్లలో ఇతియోస్ క్రాస్ కార్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. దేశంలోని టొయోటా కంపెనీ మొత్తం మార్కెట్ విలువ కంటే ఆంధ్రప్రదేశ్ మార్కెట్ విలువే ఎక్కువగా ఉందని రమేష్ తెలిపారు. మూడు రకాల ఇంజిన్లు ఇతియోస్ క్రాస్ కారు సొంతమన్నారు. రెండు పెట్రోల్ వెర్షన్లు (1.5 లీటర్లు, 1.2 లీటర్లు) కాగా, మరోటి డీజిల్ వెర్షన్ (1.4 లీటర్లు) అని చెప్పారు. పెట్రోల్ వెర్షన్ ధర రూ.5.80 లక్షలు, డీజిల్ వెర్షన్ ధర రూ.7.05 లక్షలని వివరించారు.