TPCC members
-
టీఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేశారా?
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కూని చేసిందని టీపీసీసీ నేత మల్లు రవి విమర్శించారు. శాసన సభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు అణిచివేస్తున్నారని, ఈ రోజు బ్లాక్ డే అని ఆయన అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బస్సు యాత్ర విజయవంతం కావడంతో సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో టీఆర్ఎస్ నేతలు ఈ నాటకాన్ని సృష్టించారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేస్తున్నా అక్కడ సభను వాయిదా వేశారే తప్ప ఇక్కడిలా సస్పెండ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్తో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా పరిరక్షణ దీక్ష చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
'దొంగలెక్కలు చెప్పకుండా అఖిలపక్షం ఏర్పాటు చేయండి'
హైదరాబాద్ : రెతుల ఆత్మహత్యలపై దొంగలెక్కలు చెప్పి మోసగించకుండా వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధులు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, టీపీసీసీ కిసాన్సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా 1007 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే కేవలం 97 మంది మాత్రమే అంటూ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాల సంఖ్యను పార్లమెంటుకు ఇచ్చిందని వారు విమర్శించారు. గుళ్లు, గోపురాలు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ పార్టీ బలాన్ని పెంచుకోవడానికి తప్ప రైతుల సమస్యలను పట్టించుకునేందుకు ఆయనకు సమయం ఉండటం లేదని శ్రవణ్ విమర్శించారు. ఇంకా బేషజాలకు పోకుండా వెంటనే అఖిలపక్షం ఏర్పాటుచేసి, రైతుల ఆత్మహత్యలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు, రాజకీయపార్టీలతో కమిటీ వేయాలని కోరారు.