బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
కావలిరూరల్ : బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొన్నదిన్నె క్రాస్‌రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. కావలి రూరల్ ఎస్సై పుల్లారావు సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు పెద్దపాళెంకు చెందిన చాపల శ్రీను (28) శుక్రవారం రాత్రి రామాయపట్నంలో బంధువుల వివాహానికి వెళ్లి అక్కడి నుంచి కావలి మండలం ఒట్టూరుకు చెందిన అప్పన్నగారి సోమరాజు, వెయ్యల శ్రీనుతో కలిసి ఒట్టూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి 10.30 గంటల సమయంలో కొనదిన్నె క్రాస్‌రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా అన్నగారిపాళెం నుంచి పెళ్లి బృందంతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న చాపల శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా, సోమరాజు, శ్రీను స్వల్పగాయాలయ్యాయి. వెంటనే చాపల శ్రీనును ఆటోలో కావలికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న శ్రీను భార్య సృజన బోరున విలపించింది. విషయం తెలుసుకున్న బంధువులు పెద్దఎత్తున ఏరియా వైద్యశాలకు తరలివచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎస్సై పుల్లారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.