ఉరకలెత్తిన ఉద్యమం
బొబ్బిలి, న్యూస్‌లైన్:సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జిల్లా వ్యాప్తం గా ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. వీరికి సమైక్యవాదులు మద్దుతుగా నిలబడ్డారు. జిల్లా కేంద్రంతో పాటు చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గ కేంద్రాల్లో ట్రాక్టర్ల ర్యాలీలు భారీగా జరిగాయి. జిల్లా కేంద్రంలో విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ ఆధ్వర్యంలో దాదాపు వంద ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. దీన్ని పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబ శివరాజు జెండా ఊపి ప్రారంభించారు.
ఆ పార్టీ నాయకుల ప్రచార కమిటీ జిల్లా కన్వీనరు గొర్లె వెంకటరమణ, కాళ్ల గౌరీశంకర్, అవనాపు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని వీధుల్లో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. పలువురు సమైక్యవాదులు సైతం దీనిలో పాల్గొన్నా రు. చీపురుపల్లి నియోజకవర్గంలో దాదాపు వంద ట్రాక్టర్లతో పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తలు మీసాల వరహాలనాయుడు, శనపతి శిమ్మినాయుడుల ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీబొమ్మ జంక్షన్ నుంచి మెయిన్‌రోడ్, ఆంజనేయపురం, లావేరురోడ్ తదిత ర ప్రాంతాల్లో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక మూడు రోడ్ల కూడలి వద్ద సభ ఏ ర్పాటు చేసి నిరసనలు వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తుమ్మగంటి సూరినాయుడు, ఇప్పిలి నీలకంఠం, మన్నెపురి చిట్టి, ఆర్‌ఈసిఎస్ మాజీ డెరైక్టర్ కర్రోతు రమణ, గవిడి సురేష్, డబ్బాడ శంకర్, ఎల్లింటి శివ, మీసాల రాజగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. బోడసింగిపేట గ్రామం నుంచి విద్యుత్ సబ్ స్టేషన్ వ రకూ ఈ ర్యాలీ కొనసాగింది. వందలాది మంది సమైక్యవాదులు, పార్టీ నాయకలు దీనికి మద్దతు పలికారు. కురుపాం మండలంలో గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండల కేంద్రాల్లో ట్రాక్టర్ ర్యాలీలు ఆయా మండల నాయకుల ఆధ్వర్యంలో జరిగాయి. సాలూరు నియోజకవర్గ కేంద్రంలో గరుడబిల్లి ప్రశాంత్, రాయల సుందరరావుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. ఎస్.కోట నియోజకవర్గంలో సమన్వయకర్తలు బోకం శ్రీనివాస్,
గేదెల తిరుపతిరావులు కొత్తవలస, ఎల్.కోట, ఎస్.కోట జామి మండలాల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సమన్వయకర్త వేచలపు చినరామినాయుడు ఆధ్వర్యంలో వేపాడ మండలంలో నిరసన ర్యాలీ జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గంలో పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు సింగుబాబు, డాక్టరు సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ భారీ ర్యాలీ మొయిద జంక్షను నుంచి ర్యాలీ నిర్వహించారు. నెల్లిమర్ల పట్టణమంతా తిరిగి నిరసన తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గంలో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, గర్భాపు ఉదయభానుల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ముందుగా దివంగత నేత వైఎస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. కాంప్లెక్సు జంక్షన్ నుంచి పాత బస్టాండు వరకూ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఛైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.