కదం తొక్కిన రైతన్న
=వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీలు
=ట్రాక్టర్ నడిపి నిరసన తెలిపిన ఆర్‌కే.రోజా
జననేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపును రైతులందుకున్నారు. కదంతొక్కుతూ ట్రాక్టర్ల ర్యాలీని నిర్వహించారు. సమైక్యమే తమ నినాదమని చాటారు.
సాక్షి, తిరుపతి: సమైక్య రాష్ట్రం కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో బుధవారం జిల్లావ్యాప్తంగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు ట్రాక్టర్లను పొలం నుంచి రోడ్డుపైకి తీసుకుని వచ్చారు. పార్టీ అధికార ప్రతినిధి, నగరి నియోజకరవర్గం సమన్వయకర్త ఆర్‌కే. రోజా నాయకత్వంలో బుధవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. నగరిలోని సత్రవాడ నుంచి ఓం శక్తి కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఆమె స్వయంగా ట్రాక్టర్ నడిపారు.
మదనపల్లి చీకులపేటలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త షమీమ్ అస్లాం నిమ్మనపల్లిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో పార్టీ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ అధ్వర్యంలో రూరల్ మండలంలోని ఎన్‌ఆర్ పేట నుంచి చిత్తూరులోని గాంధీ విగ్రహం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గం సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో చిత్తూరు-నేండ్రగుంట మార్గంలో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది.
రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి ఆందోళన నిర్వహించారు. ఆయనతోపాటు పాకాల మండల కన్వీనర్ చెన్నకేశవ రెడ్డి, గోవిందరెడ్డి, కేశవులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగలో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం అధ్వర్యంలో ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. స్థానిక చెంగాలమ్మ గుడి నుంచి వ్యవసాయ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో మండల కన్వీనర్ విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.
కుప్పంలో పార్టీ సమన్వయకర్త సుబ్రమణ్యం రెడ్డి నాయకత్వంలో బైపాస్ రోడ్డులోని షాదీ మహల్ నుంచి చెరువు కట్ట వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్కూటర్లు, ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. మండల కన్వీనర్ సురేష్ రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోవిందరెడ్డి, ఆంజనేయులు ర్యాలీని విజయవంతం చేశారు. పలమనేరులో వైఎస్‌ఆర్ సీపీ రిలే నిరాహారదీక్షలు జరిగాయి. తిరుపతిలో జరిగిన వైఎస్‌ఆర్ సీపీ రిలే నిరాహారదీక్షలో మహిళా విభాగం నేత కుసుమ అధ్వర్యంలో పలువురు పాల్గొన్నారు.
కొనసాగుతున్న నిరసనలు
శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కల్యాణ మండపం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ నాయకుడు వరదారెడ్డి నాయకత్వంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మదనపల్లిలో సమైక్య జేఏసీ నేతలు మల్లికార్జున సర్కిల్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి, విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.