trademark case
-
డోల్మా ఆంటీతోనే మజాకులా? ఎవరీ డోల్మా? ఏమా కథ?
ఢిల్లీకి చెందిన డోల్మా ఆంటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రేడ్‌మార్క్ వివాదంలో డోల్మా ఆంటీకి ఢిల్లీ హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ‘‘డోల్మా ఆంటీ మోమోస్" ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించింది. ఇంతకీ ఎవరీ డోల్మా అంటీ... తెలుసుకుందాం రండి! దేశ రాజధాని నగరం ఢిల్లీలో డోల్మా ఆంటీ మోమో బాగా పాపులర్. ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్ ప్రాంతంలో డోల్మా ఆంటీ మోమోస్ కోసం ఆహార ప్రియులు బారులు తీరతారు. కేవలం స్థానికులు మాత్రమే కాదు అక్కడికి వచ్చిన వారంతా ఒక్కసారి డోల్మా ఆంటీ మోమోస్ టేస్ట్ చేస్తే.. ఆహా..ఏమి రుచి.. తినరా మళ్లీ...మళ్లీ అంటారు. అలా ఈ మోమోలు బాగా పాపులర్ అయ్యాయి. లజ్‌పత్ నగర్‌కి వెళ్లి డోల్మా ఆంటీ మోమోలు తినకపోతే ఎలా? అనుకునేంతగా పేరు సంపాదించుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ అక్రం ఖాన్ ‘డోల్మా ఆంటీ మోమో’ పేరుతో 2018లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన డోల్మా ట్సేరింగ్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. డోల్మా 1994లో లజ్‌పత్ నగర్లో మొట్టమొదటి మోమో స్టాల్‌ను ప్రారంభించిందన్న వాదనను సమర్థించింది. దీంతో ఢిల్లీ హైకోర్ట్ మొహమ్మద్ అక్రం ఖాన్ ట్రేడ్‌మార్క్ చెల్లదని తీర్పునిచ్చింది. 30 ఏండ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న డోల్మా కూడా 2023లో తన మోమోలకు ట్రేడ్‌మార్క్ తీసుకోవడం విశేషం. కాగా డోల్మా ట్సేరింగ్ కుటుంబం 1950లో బౌద్ధ గురువు దలైలామా తోపాటు టిబెట్ నుంచి భారత్ తరలి వచ్చిందట. బతుకు దెరువు కోసం టిబెట్‌కు చెందిన స్ట్రీట్ ఫుడ్‌ను ఢిల్లీవాసులకు రుచి చూపించింది. 1994లో లజ్‌పత్‌నగర్‌లో తొలి మోమో స్టాల్ ప్రారంభించింది. 90వ దశకంలో అంతగా ఆదరన లభించలేదు. అయితే ఎట్టకేలకు ఢిల్లీ ప్రజల పల్స్ పట్టేసిందిడోల్మా. స్థానిక టేస్ట్‌కు అనుగుణంగా మోమోలకు స్పైసీ మసాలా చట్నీ జోడించి విక్రయించడం మొదలు పెట్టింది. అంతే...అప్పటినుంచి ఆమె వెనుదిరిగి చూసింది లేదు. రూ.15 కి ఆరు మోమోల ప్లేట్‌తో ప్రారంభించి, ఇపుడు 8 మోమోలు రూ. 60కి విక్రయిస్తోంది. లజ్‌పత్ నగర్‌లోని ప్రధాన స్టాల్‌తో పాటు, డోల్మా ఆంటీకి మరో రెండు చోట్ల మోమోస్ స్టాల్స్ ఉన్నాయి. -
కర్ణాటకకు షాక్: కేఎస్ఆర్టీసీ ఇక కేరళకు!
తిరువనంతపురం: కేఎస్ఆర్టీసీ అనే పేరు రెండు రాష్ట్రాల ఆర్టీసీకి ఉంది. ఈ పేరుపై ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా దీనిపై రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్‌కు తుది నిర్ణయం వెలువరించింది. ఆ పేరు ఇక కేరళకే దక్కుతుందని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కర్ణాటకకు షాక్ తగిలింది. కేరళ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని పేర్లు ఉన్నాయి. వీటి సంక్షిప్త పేరు (షార్ట్ నేమ్) కేఎస్ఆర్టీసీ అని వస్తుంది. అయితే ఈ పేరు రెండు రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ అనే పేరుతో ఏనుగు వాహనం అనే నిక్‌నేమ్‌తో కూడిన పేరును కేరళ వాడాలని ట్రేడ్‌మార్క్ ఆఫ్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. కేఎస్ఆర్టీసీ పేరు తమదని, కేరళ వాడొద్దంటూ 2014లో కర్ణాటక కేరళకు నోటీసులు ఇచ్చింది. కేఎస్ఆర్టీసీని తమకు కేటాయించాలంటూ అప్పటి కేరళ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఆంటోనీ చాకో రిజిస్ట్రర్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్‌కు దరఖాస్తు చేశారు. ఏడేళ్లుగా విచారణ కొనసాగుతోంది. 1999 ట్రేడ్‌మార్క్స్ చట్టం ప్రకారం కేఎస్ఆర్టీసీ పేరును కేరళకు కేటాయిస్తూ శుక్రవారం ట్రేడ్‌మార్క్స్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేరళ రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు హర్షం వ్యక్తం చేశారు. కేఎస్ఆర్టీసీ పేరు మాత్రమే కాదని, తమ సంస్కృతికి అద్దం పట్టేది అని పేర్కొన్నారు. -
అక్కడ ఫేస్బుక్ గెలిచింది
బీజింగ్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ చైనాలో గెలిచింది. "ఫేస్ బుక్ " ట్రేడ్ మార్కు కేసుపై సోషల్ మీడియా దిగ్గజానికే బీజింగ్ హైకోర్టు మొగ్గుచూపింది. ఫేస్ బుక్ ట్రేడ్ మార్కుతో పేరు రిజిస్టర్ చేసుకున్న చైనీస్ కంపెనీకి అనుమతులు నిరాకరించింది. దక్షిణ గుయంగ్గోంగ్ కు చెందిన జాంగసాన్ పెరల్ రివర్ డ్రింక్స్ ఫ్యాక్టరీ తను ఉత్పత్తిచేసే ఆహార ఉత్పత్తులకు "ఫేస్ బుక్" అనే ట్రేడ్ మార్కును 2014లో నమోదు చేసుకుంది. మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ ట్రేడ్ మార్కును ఉద్దేశ పూర్వకంగా ఆ కంపెనీ వాడుకుందని కోర్టు మండిపడింది. ఆ కంపెనీ నైతిక సూత్రాలను ఉల్లఘించిందని పేర్కొంది. అయితే చైనీస్ చట్టాల ప్రకారం, గ్లోబల్ గా గుర్తించబడిన బ్రాండ్ల ట్రేడ్ మార్కులు కచ్చితంగా చైనాలో కూడా బాగా పేరొందిన ట్రేడ్ మార్కులుగా కచ్చితంగా నిరూపించుకోవాలని కోర్టు తెలిపింది. 700 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లున్న చైనాలో ఇటీవలే ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్ సేవలు నిలిపివేయబడ్డాయి. చైనాలో సేవలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి చైనీస్ అధ్యక్షుడు జింన్ పింగ్ తో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గతేడాది యూఎస్ లో సమావేశమయ్యారు. అలాగే చైనాలో జరిగే సమావేశాలన్నింటికీ అతను తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. చైనా డెవలప్ మెంట్ ఫోరమ్ 2016కు కూడా జుకర్ బర్గ్ హాజరయ్యారు. ఈ పర్యటనలోనే అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా తో భేటీ అయ్యారు. అయితే వెస్ట్రన్ కంపెనీలన్నీ పదేపదే చైనాలో ట్రేడ్ మార్కు విషయంపై సంక్షోభంలో పడుతున్నాయి. చైనాలో కూడా వారి బ్రాండ్ పేరును నిరూపించుకోవాలనే నిబంధన వల్ల ఈ కంపెనీలకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవలే "ఐఫోన్" బ్రాండ్ తో ఎలక్ట్రానిక్ మార్కెట్ ను ఆకట్టుకున్న యాపిల్ ఇంక్ కు చైనాలో పరాభవమే ఎదురైంది. ఆ దేశ జిన్ టాంగ్ టియాండీ లెదర్ కంపెనీ, ఐఫోన్ ట్రేడ్ మార్కుతో మార్కెట్లో వస్తువులను అమ్ముకోవచ్చని బీజింగ్ పీపుల్స్ పెద్దల కోర్టు తీర్పునిచ్చింది.