అక్కడ ఫేస్బుక్ గెలిచింది
బీజింగ్ : సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ చైనాలో గెలిచింది. "ఫేస్ బుక్ " ట్రేడ్ మార్కు కేసుపై సోషల్ మీడియా దిగ్గజానికే బీజింగ్ హైకోర్టు మొగ్గుచూపింది. ఫేస్ బుక్ ట్రేడ్ మార్కుతో పేరు రిజిస్టర్ చేసుకున్న చైనీస్ కంపెనీకి అనుమతులు నిరాకరించింది. దక్షిణ గుయంగ్గోంగ్ కు చెందిన జాంగసాన్ పెరల్ రివర్ డ్రింక్స్ ఫ్యాక్టరీ తను ఉత్పత్తిచేసే ఆహార ఉత్పత్తులకు "ఫేస్ బుక్" అనే ట్రేడ్ మార్కును 2014లో నమోదు చేసుకుంది. మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ ట్రేడ్ మార్కును ఉద్దేశ పూర్వకంగా ఆ కంపెనీ వాడుకుందని కోర్టు మండిపడింది. ఆ కంపెనీ నైతిక సూత్రాలను ఉల్లఘించిందని పేర్కొంది. అయితే చైనీస్ చట్టాల ప్రకారం, గ్లోబల్ గా గుర్తించబడిన బ్రాండ్ల ట్రేడ్ మార్కులు కచ్చితంగా చైనాలో కూడా బాగా పేరొందిన ట్రేడ్ మార్కులుగా కచ్చితంగా నిరూపించుకోవాలని కోర్టు తెలిపింది.
700 మిలియన్ ఇంటర్నెట్ యూజర్లున్న చైనాలో ఇటీవలే ట్విట్టర్ తో పాటు ఫేస్ బుక్ సేవలు నిలిపివేయబడ్డాయి. చైనాలో సేవలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి చైనీస్ అధ్యక్షుడు జింన్ పింగ్ తో ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గతేడాది యూఎస్ లో సమావేశమయ్యారు. అలాగే చైనాలో జరిగే సమావేశాలన్నింటికీ అతను తప్పనిసరిగా హాజరవుతూ వస్తున్నారు. చైనా డెవలప్ మెంట్ ఫోరమ్ 2016కు కూడా జుకర్ బర్గ్ హాజరయ్యారు. ఈ పర్యటనలోనే అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాక్ మా తో భేటీ అయ్యారు.
అయితే వెస్ట్రన్ కంపెనీలన్నీ పదేపదే చైనాలో ట్రేడ్ మార్కు విషయంపై సంక్షోభంలో పడుతున్నాయి. చైనాలో కూడా వారి బ్రాండ్ పేరును నిరూపించుకోవాలనే నిబంధన వల్ల ఈ కంపెనీలకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఇటీవలే "ఐఫోన్" బ్రాండ్ తో ఎలక్ట్రానిక్ మార్కెట్ ను ఆకట్టుకున్న యాపిల్ ఇంక్ కు చైనాలో పరాభవమే ఎదురైంది. ఆ దేశ జిన్ టాంగ్ టియాండీ లెదర్ కంపెనీ, ఐఫోన్ ట్రేడ్ మార్కుతో మార్కెట్లో వస్తువులను అమ్ముకోవచ్చని బీజింగ్ పీపుల్స్ పెద్దల కోర్టు తీర్పునిచ్చింది.