స్టార్టప్‌లతో సంప్రదాయ వ్యాపారాలకు దెబ్బ!
ఏంజెల్ ఇన్వెస్టర్ల అభిప్రాయం
కోల్‌కతా: దేశంలో శరవేగంగా వేళ్లూనుకుంటున్న స్టార్టప్ సంస్థలతో సంప్రదాయ వ్యాపార విధానాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఇన్వెస్టర్లు స్టార్టప్‌లకు నిధులను సమకూర్చుతున్నవారే కావడం గమనార్హం. ‘సంప్రదాయ వ్యాపారులు తమ సొంత శైలిలో వెళ్తారు. కస్టమర్లకు నేరుగా అవసరమైనమేరకు డిస్కౌంట్లను ఇస్తారు. అయితే, స్టార్టప్‌లతో ముందుకొస్తున్న టెక్నాలజీ నిపుణులకు గతంతోపనిలేదు. భవిష్యత్తుపైనే దృష్టిపెడతారు’ అని ఆన్లైన్ సరుకుల విక్రయ సంస్థ గ్రోఫర్స్ ఫైనాన్స్ హెడ్ అష్నీర్ గ్రోవర్ పేర్కొన్నారు. ఈ విధమైన వ్యవహారశైలి సంప్రదాయ వ్యాపార విధానాన్ని దెబ్బతీస్తూనే ఉంటుందన్నారు.
ఐడీజీ వెంచర్స్ ఎండీ టీసీఎం సుందరం కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్యాబ్ అగ్రిగేటర్లు, ఈ-కామర్స్ సంస్థలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, 90 శాతం స్టార్టప్‌లు ఎందుకూపనికిరావని, ఉద్యోగాల కల్పనలో వాటివల్ల పెద్దగా ఒరిగిందేమీలేదంటూ ఫ్యూచర్ గ్రూప్ చైర్మన్ కిశోర్ బియానీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ... ఒకవిధంగా ఆయన చెప్పింది నిజమేనని ఇండియా ఇంటర్నెట్ ఫండ్‌కు చెందిన అనిరుధ్ సూరి పేర్కొన్నారు.
‘90 శాతం స్టార్టప్‌లు జాబ్స్‌ను సృష్టించలేవన్నది వాస్తవం. అయితే, విజయవంతమైన ఒకట్రెండు స్టార్టప్‌లు ప్రస్తుత వ్యాపార విధానాలను అతలాకుతలం చేయగలవు’ అని ఆయన చెప్పారు. కలకత్తా ఏంజెల్ నెట్వర్క్(సీఏఎన్) నేతృత్వంలో నిర్వహించిన ఒక చర్చాకార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఇన్వెస్టర్లు ఈ అభిప్రాయాలను వెల్లడంచారు. స్టార్టప్‌ల ఆవిర్భావంలో బెంగళూరు. ఢిల్లీ, పుణే, హైదరాబాద్, చెన్నైలతో పోలిస్తే.. తూర్పు భారతావని వెనుకబడటానికి.. ఇక్కడ నిపుణుల కొరతతోపాటు ఇందుకు సరైన పరిస్థితులు లేకపోవడమే కారణమని వారు పేర్కొన్నారు.