వెంకన్న నిలయం..పుష్ప సోయగం
తిరుమల: అలంకారప్రియుడు శ్రీవేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల పుణ్యక్షేత్రం పుష్పసోయగంతో కనువిందు చేస్తోంది. శ్రీ మన్మథనామ సంవత్సర ఉగాది సందర్భంగా తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఉద్యానవనం విభాగం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. నాలుగు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 2 లక్షల కట్ పుష్పాలను అలంకరణల కోసం వినియోగించింది. ప్రత్యేకించి ఆలయ మహాద్వారం నుంచి సన్నిధి వరకు పుష్పాలంకరణలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ధ్వజస్తంభం పైభాగంలో ఏర్పాటు చేసిన మామిడికాయల పందిరి ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రకాల పుష్పాలు, పండ్లు, కూరగాయలతో ధ్వజస్తంభం, బలిపీఠాన్ని అలంకరించారు. బలిపీఠం ముందు ఉంచిన వాటర్మిలాన్ కార్విన్ ఆర్ట్(కర్బుజాలతో తయారుచేసిన వివిధ దేవతామూర్తుల నమూనాలు) విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నవధాన్యాలతో తయారు చేసిన ‘శ్రీమహావిష్ణువు’, బెంగుళూరు వంకాయలతో చేసిన ‘శేషశయన’, పుష్పకలశం నమూనాలను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు.
ఆలయంలోని ఉగాది ఆస్థానంలో పాల్గొన్న ఈవో ఈ అలంకరణలను స్వయంగా పరిశీలించారు. ఉద్యానవనం సూపరింటెండెంట్ శ్రీనివాసులును ప్రత్యేకంగా అభినందించారు. కోల్కతా, బెంగళూరు, సేలం, హైదరాబాద్ నుంచి వచ్చిన 120 మంది అలంకరణ నిపుణులతో పాటు మరో 120 మంది టీటీడీ ఉద్యానవనం సిబ్బంది కలసి అలంకరించారని సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఈవో సాంబశివరావుకు తెలిపారు.