traffic constable attacks
-
మహిళపై దాడికేసులో కానిస్టేబుల్‌పై వేటు
న్యూఢిల్లీ : లంచం ఇవ్వలేదని ఓ మహిళపై ఇటుకతో దాడి చేసిన కేసులో ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ చంద్రపై వేటు పడింది. అతడిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు సోమవారం వెల్లడించారు. అండర్ ఆర్టికల్ 311 (2) (బి) సెక్షన్ ప్రకారం ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. కాగా ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించినందుకు రూ.200 లంచం ఇవ్వాలంటూ ఓ మహిళను సతీష్ చంద్ర డిమాండ్ చేశాడు. అయితే అందుకు ఆ మహిళ నిరాకరించటంతో ఇటుకతో ఆమెపై దాడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ మాట్లాడుతూ.. కానిస్టేబుల్ రాయి పట్టుకుని మహిళను కొడుతున్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అతడిని విధుల నుంచి సస్పెండ్ చేయటంతో సరిపోదన్నారు. కాగా ఈ కేసులో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. -
లంచం ఇవ్వనందుకు ఇటుక రాయితో దాడి
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ మహిళపై పట్టపగలు ఇటుక రాయితో దాడి చేసిన ఘటనలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. అందరూ చూస్తుండగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. ... తన ముగ్గురు పిల్లలతో కలిసి ఓ మహిళ సౌత్ ఢిల్లీలో స్కూటీపై వెళుతుండగా సతీష్ చంద్ర అనే హెడ్ కానిస్టేబుల్ ఆమెను ఆపాడు. నిబంధనలు విరుద్ధంగా ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావంటూ మహిళను ఆపి లంచం డిమాండ్ చేశాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. అదికాస్తా వాగ్వివాదానికి దారితీసింది. దాంతో సహనం కోల్పోయిన సతీష్ చంద్ర ...మహిళపై ఇటుకతో దాడి చేశాడు. ఈ వ్యవహారాన్ని దారిన వెళ్లే వాళ్లు తీసిన వీడియో బయటకు రావటంతో కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. వీడియో క్లిప్ ఆధారంగా కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.