ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టతకు చర్యలు
భాగ్యనగర్‌కాలనీ: ట్రాఫిక్ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ప్రజా రవాణా వ్యవస్థ సాఫీగా సాగుతుందని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. కూకట్‌పల్లిలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన సైబరాబాద్ ట్రాఫిక్ అదనపు ఉప కమిషనర్, ట్రాఫిక్ కూకట్పల్లి డివిజన్ సహాయ పోలీస్ కమిషనర్ భవనాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సరైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి ట్రాఫిక్‌పై అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సైబరాబాద్ ట్రాఫిక్ విభాగంలో రెండు జోన్లుగా విభజించినట్టు చెప్పారు. ఈ భవన నిర్మాణానికి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రూ.6 లక్షలు విరాళం ఇవ్వగా మిగతా డబ్బును పోలీస్ వ్యవస్థ వెచ్చించిందన్నారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిచవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో సైబరాబాద్ జాయింట్ కమిషనర్ వై.గంగాధర్, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సైబరాబాద్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఎం.రామ్మోహన్రావు, కూకట్పల్లి ట్రాఫిక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ పి.సంతోష్‌కుమార్, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్యాంసుందర్‌రెడ్డి, కూకట్పల్లి, బాలానగర్ ఏసీపీలు సాయిమనోహర్, నంద్యాల నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.