వివాదంలో పాకిస్తాన్ బ్యాట్స్ మన్
లాహోర్: వివాదాలతో సావాసం చేసే పాకిస్తాన్ బ్యాట్స్ మన్ ఉమర్ అక్మల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. నడిరోడ్డుపై ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి అందరి దృష్టిలో పడ్డాడు. సొంత నగరంలో లాహోర్ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించడంతో కారులో వెళుతున్న అక్మల్ ను పోలీసులు ఆపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగతంగా తన కారుకు నంబరు ప్లేట్ పెట్టించికున్నందుకు అతడిని పోలీసులు ప్రశ్నించారు. ఆగ్రహంతో ఊడిపోయిన అక్మల్ వారిపై తిట్లదండకం అందుకున్నాడు. అక్కడితో ఆగకుండా వారితో గొడవకు దిగాడు.
అయితే పోలీసులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని అతడు ఆరోపించాడు. ‘పోలీసులు నన్ను ఆపారు. దుర్భాషలాడారు. నాకు నేనుగా నంబరు ప్లేట్ తొలగించాలన్నార’ని మీడియాతో అక్మల్ చెప్పాడు. పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో బ్యాడ్ బాయ్ గా ముద్ర పడిన అక్మల్ కు వివాదాలు కొత్త కాదు. 2014 ఫిబ్రవరిలో ట్రాఫిక్ వార్డెన్ తో గొడవపడి జైలు శిక్షకు గురయ్యాడు. క్రమశిక్షణ ఉల్లంఘనతో జట్టులో స్థానం కోల్పోయాడు.