trailar
-
జపాన్ ట్రైలర్.. దొంగగా రెచ్చిపోయిన కార్తి
పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తి జపాన్ అనే సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జపాన్’ . అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్ కీలకపాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కార్తి విభిన్నమైన లుక్‌తో కనిపించారు. ఇందుకోసం ఆయన తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇవే విషయాలు ట్రైలర్లో తెలుస్తుంది. ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ఆరంభంలో ఉంది. చేపగా మొదలైన జపాన్ జర్నీ.. తిమింగలంలా ఏలా మారింది అనే కథతో ట్రైలర్ ఆరంభమవుతుంది. తన దొంగతనాలతో పోలీసులు, ప్రభుత్వంలో జపాన్ అలజడి సృష్టిస్తాడని ట్రైలర్లో ఉంది. జపాన్ను పట్టుకునేందుకు పోలీసులతో పాటు చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే.. 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్లు వేసినా తిమింగలం వలలో పడదుగా' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది. ఆ తర్వాత 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట' అంటూ కార్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జపాన్ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) -
'కర్ణ' కోసం వెళ్లిన దిల్ రాజు
యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు. (ఇదీ చదవండి: Adipurush: ఏకంగా లక్షకు పైగా టికెట్లు కొనేశాడు..!) యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే లైన్స్ షో చేస్తూ మొదలు పెట్టిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లో మూవీ సోల్ తెలిసేలా సన్నివేశాలు కట్ చేశారు. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో చూడొచ్చని ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ అయింది. చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం అంటూ ఉత్కంఠ రేపే సీన్స్ చూపిస్తూ ఈ ట్రైలర్ క్లోజ్ చేశారు. చివరలో సెంటిమెంట్ సీన్స్ చూపించి ఆసక్తి పెంచేశారు. (ఇదీ చదవండి: Adipurush: అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట) -
ఇది భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి
‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను’ అంటూ అనుష్క చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘భాగమతి’ట్రైలర్. అనుష్క టైటిల్ రోల్లో ‘పిల్ల జమీందార్’ ఫేమ్ జి.అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ–ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం ‘భాగమతి’ ట్రైలర్ రిలీజ్ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ సినిమాతో సూపర్ ఫామ్‌లో ఉన్న అనుష్కతో ‘భాగమతి’ చిత్రం నిర్మించినందుకు గర్వంగా ఉంది. అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్. ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అద్భుతమైన కథని అంతే అద్భుతంగా అశోక్ తెరకెక్కించారు. ‘భాగమతి’ కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. తమన్ పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్’’ అన్నారు. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్‌రాజ్, ప్రభాస్ శ్రీను, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: మథి. -
సమ్మర్లో సూపర్ హీరోల హంగామా!
‘స్పైడర్’ సినిమాలోని ‘బూమ్ బూమ్’ పాట గుర్తుందిగా? ‘గుర్తుంది సరే! హాలీవుడ్ సినిమా న్యూస్‌లోకి మహేశ్ ఎందుకొస్తాడు?’ అనేగా మీ డౌట్! అక్కడే ఉంది అసలు విషయం. ‘బూమ్ బూమ్...’ పాటలో ‘మార్వెల్ కామిక్సే వీణ్ని చూసినాక రాశారేమో!’ అనే లైన్ గుర్తుందిగా? మార్వెల్ కామిక్స్ అంత పాపులర్ మరి! ఆ కామిక్స్ నుంచి పుట్టుకొచ్చిన సినిమాలూ అంతే! సూపర్ హీరోలంతా ఓ దగ్గర చేరి చేసే హంగామా నుంచి పుట్టిన ‘అవెంజర్స్’కు మార్వెల్ కామిక్స్‌లో, సినిమాల్లో ఓ సెపరేట్ క్రేజ్ ఉంది. అవెంజర్స్ సిరీస్‌లో ‘ది అవెంజర్స్’ (2012) ‘ది అవెంజర్స్ – ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ (2015) సినిమాలకు సీక్వెల్‌గా 2018లో ‘అవెంజర్స్ – ఇన్ఫినిటీ వార్’ అనే సినిమా వస్తోంది. ట్రైలర్‌తో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అన్న విషయం తెలుస్తూనే ఉంది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్ ‘అవెంజర్స్’ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మే 4, 2018న సినిమా విడుదలవుతోంది. అంటే.. మనకు సరిగ్గా సమ్మర్ టైమ్. విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని మనమే ముందు చూడబోతున్నాం. ఎందుకంటే ఏప్రిల్ 27న ఇండియాలో ఈ సినిమా విడుదల కానుంది. ఆంథోని, జాయ్ రుస్సో దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. రాబర్ట్ డొనీ, జాష్ బొర్లిన్, మార్క్ రఫాలో తదితర స్టార్ హీరోలు ఈ సినిమాలో నటిస్తున్నారు. -
తక్కువగా మాత్రం చూసుకోను
‘మీ అమ్మానాన్నలకంటే ఎక్కువగా చూసుకుంటానో లేదో తెలీదు కానీ.. తక్కువగా మాత్రం చూసుకోను’ అంటూ ప్రారంభమయ్యే ‘కన్నుల్లో నీ రూపమే’ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నందు, తేజస్వీ ప్రకాశ్ జంటగా బిక్స్ ఇరుసడ్లను దర్శకునిగా పరిచయం చేస్తూ భాస్కర్ భాసాని నిర్మించిన చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే’. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ రిలీజ్ చేశారు. అనంతరం బిక్స్ మాట్లాడుతూ– ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. యువతకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉన్నాయి. ‘రంగస్థలం’ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నా మాకు టైమ్ కేటాయించి మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన సుకుమార్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ట్రైలర్ చూసి మమ్మల్ని ఆశీర్వదించడం మా టీమ్‌కు మరింత ఆనందంగా ఉంది. సాకేత్ సంగీతం సినిమాకి ప్లస్. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ కొమండూరి, కెమెరా: ఎన్.బి. విశ్వకాంత్, సుభాష్ దొంతి, పాటలు: అనంత శ్రీరామ్, శ్రీమణి, కాసర్ల శ్యామ్. -
మగాడి జీవితం మళ్లీ కోలుకోలేదు
‘నేనెప్పుడూ ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. ఎవరినీ ఇష్టపడలేదు. అమ్మాయిలంటే నాకు మంచి ఒపీనియన్ కూడా లేదు. హుద్‌హుద్ వచ్చినప్పుడు విశాఖ కోలుకుందేమో కానీ, మీ ఆడవాళ్ల వల్ల గాయపడిన ఏ మగాడి జీవితం మళ్లీ కోలుకోలేదు... ఆనందంగా ఉంచడమంటే అవసరాలు తీర్చడం కాదు. ఆశలు తీర్చడం’ వంటి డైలాగులు ‘ఇ ఈ’ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నీరజ్ శ్యామ్, నైరా షా జంటగా రామ్ గణపతిరావు దర్శకత్వంలో లక్ష్మణ్‌రావు నిర్మించిన సిన్మా ‘ఇ ఈ’. సీనియర్ నటుడు సుధాకర్ కీలక పాత్రలో నటించారు. ఈ సిన్మా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘నేనూ, రామ్ స్నేహితులం. యానిమేటింగ్లో కలిసి పనిచేశాం. తనేమో ఫ్రాన్స్ వెళ్లి అదే రంగంలో డెరైక్టర్‌గా ఎదిగాడు. నేను దర్శక, నిర్మాతగా మారా. రామ్ దర్శకుడిగా మారి తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అన్నారు. ‘‘ఇ’ అంటే ఇతడు, ‘ఈ’ అంటే ఈమె అని అర్థం. కథాకథనాలు కొత్త తరహాలో ఉంటాయి’’ అన్నారు దర్శకుడు. ఈ నెల్లోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని లక్ష్మణ్‌రావు తెలిపారు. నీరజ్ శ్యామ్, నైరా షా సంగీత దర్శకుడు కృష్ణ చేతన్ పాల్గొన్నారు. -
ప్రేమ పందెంలో గెలుపు ఎవరిది?
‘‘చిన్న సినిమాలు చాలావరకు ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ షూటింగ్ దశలోనే ఆగిపోతున్నాయి. లక్ష్మీనారాయణగారికిది తొలి సినిమా అయినా షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదల చేస్తుండడం అభినందనీయం. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. శ్రవణ్, మీనాక్షి గోస్వామి జంటగా ఎం.ఎం. అర్జున్ దర్శకత్వంలో ఎం. లక్ష్మీనారాయణ నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’. ఈ సినిమా పాటలు, ట్రైలర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చెప్పిన కథలో ఓ చిన్న పాయింట్ నన్ను బాగా ఆకట్టుకుంది. అదేంటో సినిమాలోనే చూడాలి. మా యూనిట్ సభ్యుల సహకారం వల్లే అను కున్నట్లు నిర్మించగలిగాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ప్రేమపందెం’ కేవలం యూత్ మూవీ కాదు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి’’ అన్నారు అర్జున్. తెంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి యన్. సాయివెంకట్, సంగీత దర్శకుడు వెంకట్ ఎస్.వి.హెచ్. పాల్గొన్నారు. ఈ సినిమాకి సహకారం: శరత్సాగర్, కో–ప్రొడ్యూసర్: ఓబయ్య సోమిరెడ్డిపల్లె. -
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి...
''డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకొచ్చి తొడ కొట్టిందట. అయినా నువ్వు డైలాగ్ వేస్తే...కౌంటర్ ఇవ్వటానికి నేనేమైనా రైటర్నా..ఫైటర్ని ... అయ్బాబోయ్ నాకు కూడా సినిమా డైలాగ్స్ వచ్చేస్తున్నాయి...'' ఈ డైలాగ్స్ ఏ సినిమాలోవా అనుకుంటున్నారు కదూ... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేష్ బాబు 'ఆగడు' చిత్రం లోనివి. శనివారం (ఆగస్ట్ 9) మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా... 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ కొత్త టీజర్‌ను విడుదల చేసింది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా మొదటి టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు... ఇంకా ఆ ఊపులోనే ఉన్న మహేష్ అభిమానులకు .... తాజా టీజర్ మరింత కిక్ ఇచ్చిందనటంలో సందేహం లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రాం ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు సరసన హీరోయిన్ తమన్నాతొలిసారి నటిస్తోంది. ఇక మహేష్ తనయుడు గౌతమ్ బర్త్‌డే ఈనెల 31న చిత్ర ఆడియో ఫంక్షన్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మహేష్ బాబుకు సాక్షి డాట్ కామ్... బర్త్‌డే విషెస్ తెలుపుతోంది.