పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తి జపాన్ అనే సినిమాతో వెండితెరపై కనిపించనున్నారు. కార్తి కథానాయకుడిగా రాజు మురుగన్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జపాన్’ . అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. సునీల్ కీలకపాత్రని పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. కార్తి విభిన్నమైన లుక్‌తో కనిపించారు. ఇందుకోసం ఆయన తన లుక్ కూడా పూర్తిగా మార్చేశాడు. ఇవే విషయాలు ట్రైలర్‌లో తెలుస్తుంది.
ఇందులో కార్తి బంగారం స్మగ్లింగ్ చేసే వ్యక్తి పాత్రలో కనిపించనున్నారు. కామెడీ జోడించి, కొత్త అవతారంలో ఆయన అలరించనున్నారు. సముద్రం ఒడ్డున నివసించే జపాన్ (కార్తీ) చిన్నప్పుడే తన తల్లి కోసం దొంగగా మారినట్టు ట్రైలర్ ఆరంభంలో ఉంది. చేపగా మొదలైన జపాన్ జర్నీ.. తిమింగలంలా ఏలా మారింది అనే కథతో ట్రైలర్ ఆరంభమవుతుంది. తన దొంగతనాలతో పోలీసులు, ప్రభుత్వంలో జపాన్ అలజడి సృష్టిస్తాడని ట్రైలర్‌లో ఉంది. జపాన్‍ను పట్టుకునేందుకు పోలీసులతో పాటు చాలా మంది ప్రయత్నిస్తారు. అయితే.. 'సొరచేపలు చుట్టుముట్టాయి. కానీ ఎన్ని ప్లాన్‍లు వేసినా తిమింగలం వలలో పడదుగా' అంటూ జపాన్ చెప్పే డైలాగ్ బాగా పేలింది.
ఆ తర్వాత 'సింహం కాస్త సిక్ అయితే.. పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసిపెట్టాయట' అంటూ కార్తి చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తమిళనాడులోని అనేక బంగారు దుకాణాల నుంచి కొన్ని కిలోల బంగారాన్ని దొంగలించిన ఓ వ్యక్తి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జపాన్ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. జపాన్ సినిమా దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ పేర్కొంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనుంది.
(ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం)
Comments
Please login to add a commentAdd a comment