train Coach
-
ఇలా చేస్తే ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! ఖర్చు ఎంతవుతుందో తెలుసా?
IRCTC Entire Train Or Coach Booking In Online: భారతదేశంలో సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు విమానాలను మాత్రమే కాకుండా ట్రైన్స్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. కుటుంబం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు ముందుగా రిజర్వ్ చేసుకున్నప్పటికీ ఒక్కొక్కరికి ఒక్కో చోట సీట్లు అలాట్ చేస్తారు. కానీ మీరందరూ కలిసి వెళ్లాలనుకున్నప్పుడు ఒక కోచ్ మొత్తమ్ బుక్ చేసుకోవచ్చు. ఇది 'ఐఆర్సీటీసి'లో ఎలా బుక్ చేసుకోవాలి? ఎంత ఖర్చు అవుతుందనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుక్ చేసుకునే విధానం ఏదైనా టూర్ వెళ్లాలనుకుని ఒక బృందం మొత్తం ప్రయాణించాలనుకున్నప్పుడు 'పుల్ టారిఫ్ రేట్' అనే బుకింగ్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసు కింద ఒక కోచ్ లేదా మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఒక ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్ వంటివి క్రియేట్ చేసుకోవాలి. దీని కోసం మీరు https://www.ftr.irctc.co.in/ftr/ అనే వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. ఈ విధంగా మీరు తర్వాత మీరు మొత్తం ట్రైన్ బుక్ చేసుకోవాలా.. లేదా ఒక కోచ్ మాత్రమే బుక్ చేసుకోవాలా.. అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు కావలసిన ఆప్షన్ ఎంచుకుని అవసరమైన అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ పే చేసిన తరువాత మీ బుకింగ్ కంప్లీట్ అవుతుంది. ఇందులో మీరు ఏసీ ఫస్ట్ క్లాస్,ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, ఏసీ 2 కమ్ 3 టైర్, స్లీపర్ కోచ్‌లను బుక్ చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ ఎప్పుడో తెలిసిపోయింది.. డెలివరీలు కూడా..) ఇండియన్ రైల్వే రూల్స్ ప్రకారం, మీరు ఒక కోచ్ బుక్ చేసుకోవాలనుంటే ముందుగా రూ. 50,000 వరకు సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇది మీరు ప్రయాణించే దూరం, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళా ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు రూ. 9 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇలాంటి బుకింగ్ కోసం కనీసం 30 రోజులు లేదా 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. -
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. త్వరలో ట్రైన్ హోటల్స్!
సాక్షి, చెన్నై: వృథాగా ఉన్న రైలు బోగీలను హోటళ్లుగా మార్చేందుకు దక్షిణ రైల్వే ప్రణాళిక రూపొందిస్తోంది. తొలి విడతలో మూడు చోట్ల ట్రైన్ హోటళ్లు ఏర్పాటు చేయనుంది. వివరాలు.. దక్షిణ రైల్వే పరిధిలోని చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు రోజూ వేలాది మంది ప్రయాణికులు వచ్చి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ సరైన హోటళ్లు అందుబాటులో లేవు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న దక్షిణ రైల్వే ప్రయాణికులను ఆకర్షించే విధంగా వృథాగా ఉన్న బోగీల్లో హోటళ్ల ఏర్పాటపై దృష్టి సారించింది. ఈ హోటళ్ల నిర్వహణ ప్రైవేటు సిబ్బందికి అప్పగించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా దక్షిణ రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరనుంది. ఇప్పటికే అనేక చోట్ల నగరాల్లో ప్రైవేటు హోటళ్లు రైళ్ల తరహాలో సెట్టింగ్ లు, పెయింటింగ్స్‌తో భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అయితే, రైల్వే యంత్రాంగం నిజమైన రైలు బోగీలను హోటళ్లుగా మార్చనుండడం విశేషం. రైలులో ప్రయాణిస్తూ ఆహారాన్ని తింటున్నామనే అనుభూతిని కలిగించేలా.. ఆయా బోగీలలో ప్రత్యేక డిజైన్లు, సీట్లను ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వారికి టెండర్ల ద్వారా ఈ హోటళ్లను త్వరలో కేటాయించనున్నారు. 24 గంటల పాటూ ఇవి సేవలు అందించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయనున్నారు. ఒకే సమయంలో ఓ బోగీలో 40 మంది కూర్చుని ఆహారం తినేందుకు తగినట్లు చేయాలని నిర్ణయించింది. తొలి విడతలో చెన్నై సెంట్రల్, పెరంబూరు, కాటాన్ కొళ్తూరు స్టేషన్లలో ఈ రైలు బోగీల హోటళ్లకు ఆన్లైన్ ద్వారా టెండర్లను ఆహా్వనించనున్నారు. చదవండి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ! -
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తక్కువ ధరకే ఏసీ ప్రయాణం, వచ్చేస్తోంది!
చెన్నై: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తక్కువ చార్జీలతో ఏసీ బోగీలతో కూడిన రైళ్లను ప్రవేశపెట్టేందుకు దక్షిణరైల్వే ఏర్పాట్లు చేసింది. ‘పేదల రథం’ పేరుతో ఆధునిక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. బస్సులతో పోల్చుకుంటే చార్జీలు స్వల్పం, సౌకర్యాలు అధికం కావడం వల్ల ప్రయాణికులు రైలు ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. ఈ కారణంగా రిజర్వేషన్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతో టిక్కెట్లు దొరక్క అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో రెండు లేదా మూడు ఏసీ బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిని టూ టైర్, త్రీ టైర్ బోగీలుగా విభజించి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. వీటిల్లో కుర్చీల సంఖ్య కూడా పరిమితంగా ఉన్నందున ఏసీ బోగీల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. ఈ పరిస్థితిని నివారించి ఏసీ బోగీలను కింది, మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైళ్లకు “పేదల రథం’ అని పేరుపెట్టారు. అత్యాధునిక వసతులతో తయారవుతున్న ఒక్కో బోగీలో 83 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిల్లో పడుకుని కూడా ప్రయాణించవచ్చు. సీసీ టీవీ, కెమెరాలు అమరుస్తారు. 110–130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడతాయి. చెన్నై పెరంబూరులోని ఇంటెగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ రైలు బోగీల్లో ప్రయాణం మరో ఏడాదికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చెన్నైకి ఆధునిక సిటీ బస్సులు కాలం చెల్లిన సిటీ బస్సుల స్థానంలో అత్యాధునిక బస్సులను తీసుకురానున్నారు. తొలిదశలో 242 బస్సులు చెన్నై రోడ్లలో సందడి చేయనున్నాయి. గ్రేటర్ చెన్నై ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలో 3,454 సిటీ బస్సులు నడుస్తున్నాయి. రోజుకు సగటున 30 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 10.5 శాతం మంది మహిళలు ఉచిత పథకం కింద ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ రోడ్డెక్కే 3,300 బస్సుల్లో వెయ్యి బస్సులు పాతబడిపోయి మూలపడేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. సిటీ బస్సులను 9 ఏళ్లకు మించి వినియోగించరాదనే నిబంధనను దాటి ప్రయాణిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జర్మన్ నిధుల సహకారంతో ప్రభుత్వం చెన్నైకి 242, మధురై, కోయంబత్తూరుకు చెరో 100 లెక్కన మొత్తం 644 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. తొలి విడతగా 242 బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచారు. అత్యంత ఆధునికమైన బస్సుల్లో పూర్తిస్థాయి రక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు, ఎమర్జెన్సీ బటన్లు, అత్యవసర ద్వారాలు, రానున్న బస్‌స్టేషన్, చేరుకోబోతున్న ప్రాంతాలను తెలిపే డిజిటల్ బోర్డులను అమరుస్తారు. చదవండి: Indian Railways: మన డేటాతో రైల్వే వ్యాపారం! -
ఐసొలేషన్ వార్డులుగా ఏసీ కోచ్‌లు
తాడేపల్లిగూడెం: కరోనా కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో రైళ్లలోని ఏసీ బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్చడానికి రైల్వే అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా గతనెల 23న రైళ్ల రాకపోకలను నిలుపుదల చేశారు. ఈ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో షిర్డీ ఎక్స్‌ప్రెస్, హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేశారు. నిడదవోలు స్టేషన్లో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఇలా ఏలూరు, భీమవరం, నరసాపురం తదితర రైల్వే స్టేషన్లలో మొత్తం ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపి ఉంచారు. ఈ రైళ్లలో ఉన్న ఏసీ కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్చేందుకు కాకినాడ తరలించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. షంటింగ్ విధానంలో జిల్లాలోని స్టేషన్లలో నిలుపుదల చేసిన ఈ ఎనిమిది రైళ్లలోని ఏసీ బోగీలను ఒక్కటిగా లింక్‌చేసి కాకినాడ తరలించనున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. ఆన్లైన్ రిజర్వేషన్ లాక్డౌన్ ఈ నెల 14 తర్వాత ఎత్తివేస్తారనే వార్తల నేపథ్యంలో 15వ తేదీ నుంచి రైళ్లలో ఆన్లైన్ రిజర్వేషన్ బుకింగ్ ఇచ్చారు. హాట్ కేక్ ల మాదిరిగా టికెట్లు రిజర్వు అయిపోయాయి. స్టేషన్లలోని కౌంటర్లకు మాత్రం రిజర్వేషన్ వెసులు బాటు ఇవ్వలేదు. ఒక వేళ లాక్డౌన్ పొడిగిస్తే చెల్లింపులలో ఇబ్బంది లేకుండా ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే రిజర్వేషన్‌కు సౌకర్యం కల్పించారని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్ బ్లాక్లోనిది. -
ఎలుక తెచ్చిన తంటా
సాక్షి ప్రతినిధి, చెన్నై: రైలు బోగీలో ప్రయాణికులే కాదు.. అడపాదడపా ఎలుకలూ ప్రయాణిస్తుంటాయి. అలాంటి ఓ ఎలుక బుద్ధిగా ప్రయాణం చేయకుండా తగుదునమ్మా అంటూ సాటి ప్రయాణికుడిని కరిచింది. బాధితుని ఫిర్యాదుతో రైల్వేశాఖకు రూ.32 వేలు వదిలింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైకి చెందిన వెంకటాచలం 2014 ఆగస్టు 8వ తేదీన ఎక్స్‌ప్రెస్ రైల్లో సేలం మీదుగా చెన్నైకు చేరుకున్నారు. ఈ ప్రయాణంలో అతడిని ఎలుక కరవగా తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే టీటీఈకి ఫిర్యాదు చేసినా ప్రథమచికిత్స అందలేదు. తరువాత వచ్చే స్టేషన్లో మాత్రమే చికిత్స చేయగలమని టీటీఈ బదులిచ్చారు. దీంతో చెన్నై చేరుకోగానే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసుకుని, మెరుగైన చికిత్స కోసం ప్రయివేటు ఆస్పత్రిలో చేరాడు. రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు కలిగిన బాధకు నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశాడు. బాధితునికి రూ.25 వేల నష్టపరిహారం, వైద్య ఖర్చులకు రూ.2వేలు, కోర్టు ఖర్చులకు రూ.5వేలు లెక్కన మొత్తం రూ.32 వేలను 9 శాతం వడ్డీ సహా చెల్లించాలని తమిళనాడు వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి ఆర్వీ దీనదయాళన్, సభ్యులు రాజ్యలక్ష్మి రైల్వేశాఖను ఆదేశిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఈ సొమ్ము 3 నెలల్లోగా బాధితునికి అందజేయాలని ఆదేశించారు. -
రైలు బోగీలో అస్థిపంజరం
సికింద్రాబాద్ : రైలు బోగీలో అస్థిపంజరం బయటపడ్డ ఉదంతం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులోని రెండు బోగీలను మరమ్మతు కోసం అదేరోజు షెడ్డుకు తరలించారు. మరమ్మతు చేసేందుకు ఇద్దరు కార్మికులు సోమవారం ఆ బోగీల వద్దకు వచ్చారు. బోగీలోంచి దుర్వాసన రావటంతో వారు పోలీసులకు సమాచారం అందించాచు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బోగీలోకి వెళ్లేందుకు యత్నించగా తలుపు లోపలి నుంచి గడియపెట్టి ఉంది. దీంతో కిటికీలోంచి పరిశీలించగా అస్థిపంజరం కనిపించింది. గ్యాస్ కట్టర్‌తో తలుపును తెరిచి లోపల ఉన్న పురుషుడి అస్తిపంజరాన్ని బయటకు తీశారు. ఒంటిపై ఖాకీ చొక్కా మాత్రమే ఉంది. అస్థిపంజరాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలేవీ లభించలేదు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక గుండెపోటుతో చనిపోయాడా అనేది తేలాల్సి ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.