గూడెం రైల్వే స్టేషన్‌లో ఆగిన షిర్డీ, హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లు
తాడేపల్లిగూడెం: కరోనా కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో రైళ్లలోని ఏసీ బోగీలను ఐసొలేషన్ వార్డులుగా మార్చడానికి రైల్వే అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా గతనెల 23న రైళ్ల రాకపోకలను నిలుపుదల చేశారు. ఈ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో షిర్డీ ఎక్స్‌ప్రెస్, హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేశారు. నిడదవోలు స్టేషన్‌లో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఇలా ఏలూరు, భీమవరం, నరసాపురం తదితర రైల్వే స్టేషన్లలో మొత్తం ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపి ఉంచారు. ఈ రైళ్లలో ఉన్న ఏసీ కోచ్‌లను ఐసొలేషన్ వార్డులుగా మార్చేందుకు కాకినాడ తరలించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. షంటింగ్ విధానంలో జిల్లాలోని స్టేషన్‌లలో నిలుపుదల చేసిన ఈ ఎనిమిది రైళ్లలోని ఏసీ బోగీలను ఒక్కటిగా లింక్‌చేసి కాకినాడ తరలించనున్నట్టు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.
ఆన్‌లైన్ రిజర్వేషన్
లాక్‌డౌన్ ఈ నెల 14 తర్వాత ఎత్తివేస్తారనే వార్తల నేపథ్యంలో 15వ తేదీ నుంచి రైళ్లలో ఆన్‌లైన్ రిజర్వేషన్ బుకింగ్ ఇచ్చారు. హాట్ కేక్ ల మాదిరిగా టికెట్లు రిజర్వు అయిపోయాయి. స్టేషన్‌లలోని కౌంటర్లకు మాత్రం రిజర్వేషన్ వెసులు బాటు ఇవ్వలేదు. ఒక వేళ లాక్‌డౌన్ పొడిగిస్తే చెల్లింపులలో ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్ పద్ధతిలో మాత్రమే రిజర్వేషన్‌కు సౌకర్యం కల్పించారని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment