ఇది పోలింగ్‌ బూతే | Unique train coach look makes polling booth 140 centre of attraction | Sakshi
Sakshi News home page

ఇది పోలింగ్‌ బూతే

Published Thu, May 9 2019 1:09 AM | Last Updated on Thu, May 9 2019 1:09 AM

Unique train coach look makes polling booth 140 centre of attraction - Sakshi

నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్‌. హజారీబాగ్‌ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్‌ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు.

కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్‌ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్‌ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్‌ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని  ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్‌ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్‌ బ్లాక్‌లోనిది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement