మరింత చేరువగా...
ఏడు జిల్లా కేంద్రాలను బెంగళూరుతో కలుపుతూ
రైలు సౌకర్యం 23 పట్టణ, నగరాల మధ్య
105 రైల్వే స్టేషన్లు 15 లక్షల మందికి ప్రయోజనం
{పాజెక్టు వ్యయం రూ.8 వేల కోట్లు
బెంగళూరు : ప్రజారవాణా వ్యవస్థను పెంపొందించడంతో పాటు బస్సు సర్వీసులపై ఒత్తిడిని తగ్గిం చడానికి కర్ణాటక ప్రభుత్వం ృహత్ ప్రణాళికను చేపట్టనుంది. దాదాపు రూ.8వేల కోట్ల వ్యయం కాగల ఈ ప్రాజెక్టును మూడు దశల్లో పూర్తి చే యనుంది. ఇందుకు సంబంధించిన నివేదికకు కేంద్రం నుంచి ప్రాథమిక అంగీకారం లభించినట్లు సమాచారం. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాల నుంచి నిత్యం ఉద్యోగ, వ్యాపార, ఉపాధి నిమిత్తం 15 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్ల్లు పట్టణాభివృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీరు ప్రధానంగా సొంతవాహనాలు, లేదా బస్సుల ద్వారా బెంగళూరుకు వస్తుంటారు. రానున్న పదేళ్లలో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉం ది. అదే కనుక జరిగితే ఇప్పటికే బెంగళూరు వా సులకు తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్య రెట్టింపు అవుతుంది. అందుకే ఈ సమస్యను పరిష్కరించే దిశగా బెంగళూరుకు వంద కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లా కేంద్రాలను వాటి మధ్య ఉన్న 23 చిన్ననగరాలు, పట్టణాలకు రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 440 కిలోమీటర్ల రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా నూతనంగా 43 రైల్వే స్టేషన్లతో పాటు మొత్తం 105 రైల్వే స్టేషన్లు ఏర్పడుతాయి. ఇందులో కొన్నింటిని గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిర్మించనున్నారు.
ప్రతి స్టేషన్ నుంచి కనిష్టంగా 60 నిమిషాలు, గరిష్టంగా 90 నిమిషాల్లో బెంగళూరుకు చేరుకునేలా ప్రాజెక్టు రూపకల్పన జరి గింది. ఈ ప్రాజెక్టులో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒకటి చొప్పు నా 24 గంటలూ రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి రైలులో 15 బోగీలు ఉండగా 3వేల ప్రయాణికులు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రూ.3,400 కోట్లు ఖర్చుకాగల మొదటి దశలో బెంగళూరు-బంగారుపేట, రెండోవిడతలో రూ.2,300 కోట్ల నిధులతో బెంగళూరు-రామనగర, మండ్య, రూ.2,300 కోట్లు ఖర్చుతో మూడో విడతలో బెంగళూరు-చిక్కబళ్లాపుర,దొడ్డబళ్లాపుర మధ్యలో ఉన్న అన్ని చిన్నచిన్న నగరాలకు రైలు సౌకర్యం కల్పించబడుతుంది.
ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ఫామ్, రైల్వే స్టేషన్ల ఉన్నతీకరణతో పాటు సిగ్నల్ వ్యవస్థకు కూడా ఆధునిక పరిజ్ఞానాన్ని జోడించనున్నారు. ఈ విషయమై రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ...‘మెట్రోతో పోలిస్తే ఈ నూతన ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు తక్కువ. మెట్రోకు కిలోమీటరుకు సగటున రూ.300 కోట్లు ఖర్చవుతుంది.
అయితే నూతన ప్రాజెక్టులో కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ. 18 కోట్లు మాత్రమే. అంతేకాక మెట్రోకు భూ సేకరణ కూడా అవసరం. నూతన ప్రాజెక్టుకు కొత్తగా భూమిని సేకరించాల్సిన అవసరం లేదు. ఆధునికత సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవ వనరులను పెంచితే సరిపోతుంది. ఏడాది పాటు కృషిచేసి రూపొందించిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సూత్రప్రాయంగా అనుమతి లభించింది.’ అని పేర్కొన్నారు.