సెల్ఫీ సరదాకు యువతి బలి
లండన్: సెల్ఫీ తీసుకోవడం చాలామందికి సరదా. కానీ జాగ్రత్తలు తీసుకోకుండా సాహసాలు చేస్తే ప్రాణాపాయం తప్పదు. సెల్ఫీ సరదా మరో ప్రాణం తీసింది. రుమేనియాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో విషాదకర రీతిలో మరణించింది. అన్నా ఉర్సు (18) రైలు టాప్‌పైన నిలబడి సెల్ఫీ తీసుకోవాలని ముచ్చటపడింది. ఆ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయాలని భావించింది. అన్నా తన స్నేహితురాలితో కలసి లాసి పట్టణంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. ఇద్దరూ కలసి రైలుపైకి ఎక్కారు. కాగా ఉర్సు హై టెన్షన్ విద్యుత్ కేబుల్‌కు దగ్గరగా వెళ్లడంతో షాక్ కొట్టింది. ఆమె దుస్తులకు మంటలు అంటుకోగా, స్నేహితురాలి రైలుపై నుంచి పడిపోయింది.
ఈ సంఘటనను గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే ఎమర్జెన్సీ సర్వీసుకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రాణాలకు తెగించి వీరిని కాపాడేందుకు ప్రయత్నించాడు. రైలుపైకి ఆమె దుస్తులపై మంటలను ఆర్పివేశాడు. ఇద్దరు అమ్మాయిలను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉర్సు శరీరం 50 శాతంపైగా కాలిపోవడంతో మరణించింది. ఆమె స్నేహితురాలు చికిత్స పొందుతోంది.