Trainers
-
స్టార్స్.. ఫిట్నెస్ ట్రైనర్స్..
ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం. అయితే సినిమా తారలకు సంబంధించి వ్యాయామ అవసరాలు విభిన్నం. ఆరోగ్యంతో పాటు వారు పోషించే పాత్రలు వ్యాయామ శైలులను, అంతేకాదు వ్యాయామ శిక్షకులనూ నిర్ధేశిస్తాయి. అందుకే అందరికీ శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తయితే.. సెలిబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం మరో ఎత్తు అంటారు స్టార్ ట్రైనర్స్. ఈ నేపథ్యంలో నగరంలో సెలబ్రిటీ ట్రైనర్స్‌గా పేరొందిన కొందరి పరిచయం.. నగరంలోని సెలబ్రిటీ ట్రైనర్‌గా పేరొందిన వారిలో ముందు వరుసలో ఉంటారు కుల్దీప్ సేథ్.. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన జిమ్ ఎప్పుడు చూసినా సెలబ్రిటీల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ‘చిరుత’నయుడైన రామ్ చరణ్ దాకా శిక్షణ ఇచ్చారాయన. విజయ్ దేవరకొండ, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, అందాల ‘రాశి ఖన్నా’, రషి్మక.. తదితర తారలు ఎందరినో చెక్కిన శిల్పిగా పేరు తెచ్చుకున్నారు.సమంత..సత్తా.. అఖిల్‌కూ ఆయనే.. నటి సమంత తన ‘నాగిన్ మొబిలిటీ డ్యాన్స్’ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు వర్కవుట్ వీడియో వైరల్ అయ్యింది. ఆమె వ్యక్తిగత శిక్షకుడు ఫిట్నెస్ ట్రైనర్ జునైద్ షేక్. అతని గురువు ముస్తఫా అహ్మద్‌ల ఆలోచనే ఇది. దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న ఫిట్నెస్ ట్రైనర్లలో ఒకరైన జునైద్, స్పెషల్ వర్కవుట్ల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. ఆయన క్లయింట్లలో అఖిల్ అక్కినేని, మోడల్–డిజైనర్ శిల్పా రెడ్డి మాత్రమే కాదు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, రణ్వీర్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు.ఎన్టీఆర్‌కూ లాయిడ్.. సినిమా అవసరాలను బట్టి ట్రైనర్స్‌ని మార్చడం స్టార్స్‌కు తప్పనిసరి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని గిరిజన యోధుడిగా తన పాత్రకు తగిన టార్జాన్ లాంటి శరీరాకృతిని సాధించడానికి జూనియర్ ఎన్టీఆర్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ లాయిడ్ స్టీవెన్స్‌నే ఎంచుకున్నాడు. అదే విధంగా తాజాగా రాజమౌళి సినిమా చేస్తున్న మహేష్ బాబు అందులోని పాత్రకు తగ్గట్టు తన రూపాన్ని మార్చుకోడానికి లాయిడ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో లాయిడ్ జాన్ అబ్రహం, రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ స్టార్స్‌కి శిక్షణ ఇచ్చారు.మహేష్‌కి మినాష్.. ఫిట్నెస్ ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ గత ఐదేళ్లుగా మహేష్ బాబుతో కలిసి పని చేస్తున్నాడు. ‘ఒకరోజు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఒకరోజు కార్డియో ఇలా షూట్ ముగిసిన తర్వాత రోజూ సాయంత్రం పూట శిక్షణ ఉంటుంది’ అని మినాష్ అంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 60 నిమిషాల పాటు కఠినమైన కసరత్తులు చేసే మహేష్ సెట్లో, సెట్ వెలుపల కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ అనీ, గాయాలతో పోరాడడం, వాటిని అధిగమించడం, అద్భుతమైన ఆకృతిని పొందడం..సాధ్యం. ప్రస్తుతం మహేష్ వయసు వెనక్కు వెళుతోంది’ అంటూ తన సూపర్‌స్టార్ స్టూడెంట్‌ని ప్రశంసిస్తారాయన.అనసూయ.. ఆర్జీవి.. అరవై ఏళ్లొచి్చనా ఇంకా ఫిట్‌గా కనిపించే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఫిట్నెస్ శిక్షకునిగా పనిచేశారు విజయ్ గంధం. అలాగే యాంకర్, నటి అనసూయ, నాగేంద్రబాబు.. తదితరులకూ శిక్షణ అందించారు. ‘ఇప్పుడు నటీనటులకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు సైతం ఫిట్నెస్ మీద పూర్తి అవగాహన, ఆసక్తి ఏర్పడింది. క్రమశిక్షణతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు’ అంటారు విజయ్ గంధం. గత కొంత కాలంగా అనేక అగ్రస్థాయి బ్రాండెడ్ జిమ్స్‌లో ట్రైనర్‌గా పనిచేసిన విజయ్.. టాలీవుడ్ తారలు మాత్రమే కాకుండా నగరంలో పలువురు వ్యాపార ప్రముఖులకూ ట్రైనర్‌గా పేరొందారు.వారి ఆసక్తినిబట్టే.. ‘తెరపై తారలు పోషించాల్సిన పాత్రలు, వారి ఇష్టాలు, శరీర తీరుతెన్నులకు అనుగుణంగా వర్కవుట్లను సృష్టించడానికి ఇష్టపడతాను, ఉదాహరణకు హీరో అఖిల్ అక్కినేని క్రీడా అభిమాని. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన వర్కవుట్లు చాలా వరకూ క్రీడల చుట్టూ డిజైన్ చేశా. అదే విధంగా కొందరికి సైక్లింగ్, బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. నేను అలాంటి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. వ్యాయామం సరదాగా ఉండాలి తప్ప బాధపెట్టకూడదు. సమంత చూడడానికి సున్నితంగా కనిపిస్తుంది. కానీ వర్కవుట్ చేసే టైమ్‌లో బలమైన శక్తిగా మారుతుంది. అందుకే ఆమె నా ఫేవరెట్ క్లయింట్.’ – జునైద్ షేక్, ఫిట్నెస్ ట్రైనర్ -
పునీత్ మరణం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం
బెంగళూరు(కర్ణాటక): కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్‌లో వర్కవుట్స్ సమయంలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్ నిర్వాహకులు చూడాలన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్, పలువురు కార్డియాలజిస్ట్‌లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఆదివారం 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూ గుండెపోటుతో.. కన్నడ నటుడు పునీత్‌రాజ్ కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. -
‘షేప్’ కావాలంటే.. టైమ్ ఇవ్వాల్సిందే..
ఫిట్‌నెస్‌కు ఎన్నో జాగ్రత్తలు తప్పవు.. సినీమోజు పనికిరాదంటున్న ట్రైనర్స్ సిటీ యూత్‌కి జిమ్‌లు, ఎక్సర్సైజ్లు క్రేజీగా మారాయి. సినిమా హీరో, హీరోయిన్లను చూసి పెంచుకుంటున్న మోజుతో అచ్చం వారిలాగే వేగంగా తమ బాడీ ‘షేప్’ కూడా మార్చుకోవాలనుకుంటున్నారు. కండరాలు.. అవి పనిచేసే విధానంపై సరైన అవగాహన లేక లేనిపోని సమస్యలతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల మెహదీపట్నం, గతంలో ఎల్బీనగర్ జిమ్‌లలో యువకులు వర్కవుట్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వ్యాయామం సరైన విధంగా సాగాలంటే మజిల్స్ మీద కనీస అవగాహన ఉండాలంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్స్. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి మనం తినే ఆహారం, చేసే శారీరక శ్రమ కండరాల లుక్‌ని, షేప్‌ని నిర్ణయిస్తాయి. ఈ కండరాల్లో మార్పులు వేగంగా రావాలనుకుంటే సప్లిమెంట్స్, శస్త్రచికిత్సలు చేయాలి. వీటికన్నా తగిన సమయం తీసుకుని వచ్చే ఆరోగ్యకరమైన షేప్‌ని మాత్రమే మనం ఆహ్వానించాలి. అందుకు ముందుగా కండరాలపై, వాటికి ఇచ్చే వ్యాయామంపై అవగాహన పెంచుకోవాలంటున్నారు సోల్ జిమ్‌కు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్. డెల్టాయిడ్స్: భుజ కండరాల ఎక్సర్సైజ్లో స్పందించే కండరమే డెల్టాయిడ్. షోల్డర్‌కు ఓ పక్కగా ఉన్న భాగాన్ని మెడిలియల్ డెల్టాయిడ్, ప్రముఖంగా కనబడే భాగాన్ని యాంటిరియర్ డెల్టాయిడ్ అంటారు. వీటిని తీరైన విధంగా తీర్చిదిద్దాలంటే.. 4 నుంచి 8 నెలల సమయం పడుతుంది. ట్రైసప్స్: భుజాలకు దిగువన చేతికి వెనుక భాగంలో ఉండే కండరం ఇది మూడు మజిల్స్‌తో ఏర్పడుతుంది కాబట్టి ట్రైసప్స్ అంటారు. ఆలస్యంగా వెలుగు చూసి తొందరగా మాయమయే స్వభావం దీనిది. వ్యాయామ ప్రియులు ‘హార్స్‌షూ’గా అభివర్ణించే ఈ షేప్ రావాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుంది. అప్పర్-లోయర్ బ్యాక్ వీపునకు రెండు వైపులా భుజాలకు దిగువన ఉండే కండరాలను లెటిజమ్ మజిల్ అంటారు. దీనికి సరైన విధంగా ఎక్సర్సైజ్ అందిస్తే విషేప్ వస్తుంది. గ్రీకు వీరుడి రూపానికి అంత ప్రాచుర్యం రావడానికి కారణమైన కార వి-షేప్ కావాలంటే ఏడాదిన్నర పడుతుంది. ఈ పార్ట్ మంచి షేప్ తిరిగితే ‘క్రిస్మస్ ట్రీ షేప్’ అంటూ ఫిట్నెస్ లవర్స్ వర్ణిస్తారు. బైసప్స్: ముందు వైపు చేతుల భుజం కిందుగా మోచేయికి పైన ఉండే కండరాలు. నేను బలవంతుడిని అని చూపించడానికి తరచుగా ప్రతి ఒక్కరూ చేతులు పైకి మడిచి చూపించే కండరాలివే. రెండు కండరాలు జత కారణంగా దీన్ని బైసప్స్ అంటారు. మూడు నుంచి 8 నెలల సమయంలో బైసప్స్ను షేప్‌కు తేవచ్చు. పెక్టొరాలిస్: ఛాతి ప్రాంతంలో ఉండేవి పెక్టొరాలిస్ మజిల్స్. వీటిలోనే మైనర్, మేజర్ పెక్టొరాలిస్ అని రెండు రకాల మజిల్స్ ఉంటాయి. ఛాతిని తీర్చిదిద్దే పెద్ద సైజ్ కండరాలివి. అప్పర్, మిడిల్, లోయర్, అవుటర్.. ఇలా 4 రకాలుగా విభజించి దానికి తగ్గట్టుగా ఛాతికి వ్యాయామం అందివ్వాలి. తొందరగా పెరిగే లక్షణం ఛాతి మజిల్ కి ఉన్నప్పటికీ కనీసం 6 నెలల టైమ్ ఇవ్వాల్సిందే. రెక్టస్ మజిల్: ఛాతికి దిగువన ఉంటాయి. దీనిలో రెక్టస్ అబ్డామినల్ మజిల్స్‌ను పైకి కనిపించేలా చేయడానికి వ్యాయామ ప్రియలు ప్రయత్నిస్తుంటారు. ఇందులో కూడా అప్పర్ , లోయర్, మిడిల్ భాగాలుంటాయి. ఈ మూడింటికి సమానంగా ఇచ్చే వ్యాయామం ద్వారా అందంగా కొలువుతీరే కండరాలనే సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ వర్ణిస్తున్నారు. అత్యంత కఠినమైన వ్యాయామాలతో ఏడాది పైన సమయం పడుతుంది. క్వార్డ్రయిసప్స్: తొడకు ముందు భాగంలో ఉండే ఈ మజిల్ సైజ్ పరంగా పెద్దది. మొత్తం 4 కండరాలతో నిర్మితమైంది కాబట్టి దీన్ని క్వార్డ్రయిసప్స్గా వ్యవహరిస్తారు. దీనిని బలంగా మార్చాలంటే కనీసం ఆర్నెల్ల సాధన అవసరం. కాఫ్స్: కాలి దిగువ భాగంలో ఉండే కండరాలివి. మనం పిక్కలని పిలుస్తాం. ప్రతిరోజూ ఎక్కువగా వాడే కండరం ఇది. దీనిలో కూడా ఇన్నర్, అవుటర్, రియర్.. అంటూ 3 రకాలుంటాయి. దీనికి ఆర్నెల్లలో మంచి షేప్ తీసుకురావచ్చు. ఒక ప్రత్యేక భాగాన్ని షేపప్ చేయాలంటే.. వ్యక్తి వయసు, దేహం శైలి, ఆహారపు అలవాట్లను అనుసరించి ఉంటుంది. ఆరోగ్యకరమైన పద్ధతుల్లో మాత్రమే ఫిజిక్ షేప్ చేసుకోవాలనేది గుర్తించాలి.