స్టార్స్‌.. ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌.. | Story Of Celebrity fitness Trainers | Sakshi
Sakshi News home page

స్టార్స్‌.. ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌..

Published Sun, Nov 24 2024 7:39 AM | Last Updated on Sun, Nov 24 2024 9:54 AM

Story Of Celebrity fitness Trainers

తారల ఫిజిక్‌ తీర్చిదిద్దడంలో కొందరికి టాప్‌ ర్యాంక్‌

పాత్రలకు అనుగుణంగా ట్రైనర్స్‌ మార్పులు

నెటిజనులను ఆకట్టుకుంటున్న స్టార్స్‌  వర్కవుట్స్‌

టాప్‌ ఫిట్‌నెస్‌ శిక్షకుల కోసం టాలీవుడ్‌  ఆరాటం 

ఆరోగ్యం కావాలనుకునే అందరికీ వ్యాయామం అవసరమే. అందుకోసం చాలా కసరత్తులు చేయాలి. దీంతో పాటు ఆహార నియమాలూ కఠినంగా ఉండాలి. సరైన న్యూట్రిషన్‌ తీసుకున్నప్పుడే సరైన వ్యాయామం చేయగలం. అయితే సినిమా తారలకు సంబంధించి వ్యాయామ అవసరాలు విభిన్నం. ఆరోగ్యంతో పాటు  వారు పోషించే పాత్రలు వ్యాయామ శైలులను, అంతేకాదు వ్యాయామ శిక్షకులనూ నిర్ధేశిస్తాయి. అందుకే అందరికీ శిక్షణ ఇవ్వడం ఒక ఎత్తయితే.. సెలిబ్రిటీలకు శిక్షణ ఇవ్వడం మరో ఎత్తు అంటారు స్టార్‌ ట్రైనర్స్‌. ఈ నేపథ్యంలో నగరంలో సెలబ్రిటీ ట్రైనర్స్‌గా పేరొందిన కొందరి పరిచయం..       

నగరంలోని సెలబ్రిటీ ట్రైనర్‌గా పేరొందిన వారిలో ముందు వరుసలో ఉంటారు కుల్‌దీప్‌ సేథ్‌.. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన జిమ్‌ ఎప్పుడు చూసినా సెలబ్రిటీల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటుంది.  మెగాస్టార్‌ చిరంజీవి దగ్గర నుంచి ‘చిరుత’నయుడైన రామ్‌ చరణ్‌ దాకా శిక్షణ ఇచ్చారాయన. విజయ్‌ దేవరకొండ, ఆర్‌ఎక్స్‌ 100 ఫేమ్‌ కార్తికేయ, అందాల ‘రాశి ఖన్నా’, రషి్మక.. తదితర తారలు ఎందరినో చెక్కిన శిల్పిగా పేరు తెచ్చుకున్నారు.

సమంత..సత్తా.. అఖిల్‌కూ ఆయనే.. 
నటి సమంత తన ‘నాగిన్‌ మొబిలిటీ డ్యాన్స్‌’  వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినప్పుడు  వర్కవుట్‌ వీడియో వైరల్‌ అయ్యింది. ఆమె వ్యక్తిగత శిక్షకుడు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ జునైద్‌ షేక్‌. అతని గురువు ముస్తఫా అహ్మద్‌ల ఆలోచనే ఇది. దేశంలోనే అత్యంత డిమాండ్‌ ఉన్న ఫిట్‌నెస్‌ ట్రైనర్‌లలో ఒకరైన జునైద్, స్పెషల్‌ వర్కవుట్‌ల రూపకల్పనకు ప్రసిద్ధి చెందారు. ఆయన క్లయింట్‌లలో అఖిల్‌ అక్కినేని, మోడల్‌–డిజైనర్‌ శిల్పా రెడ్డి మాత్రమే కాదు బాలీవుడ్‌ స్టార్స్‌ హృతిక్‌ రోషన్, రణ్‌వీర్‌ సింగ్‌ తదితరులు కూడా ఉన్నారు.

ఎన్‌టీఆర్‌కూ లాయిడ్‌.. 
సినిమా అవసరాలను బట్టి ట్రైనర్స్‌ని మార్చడం స్టార్స్‌కు తప్పనిసరి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని గిరిజన యోధుడిగా తన పాత్రకు తగిన టార్జాన్‌ లాంటి శరీరాకృతిని సాధించడానికి జూనియర్‌ ఎన్‌టీఆర్‌ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌నే ఎంచుకున్నాడు. అదే విధంగా తాజాగా రాజమౌళి సినిమా చేస్తున్న మహేష్‌ బాబు అందులోని పాత్రకు తగ్గట్టు తన రూపాన్ని మార్చుకోడానికి లాయిడ్‌ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో లాయిడ్‌ జాన్‌ అబ్రహం, రణ్‌వీర్‌ సింగ్‌ వంటి బాలీవుడ్‌ స్టార్స్‌కి శిక్షణ ఇచ్చారు.

మహేష్‌కి మినాష్‌.. 
ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మినాష్‌ గాబ్రియేల్‌ గత ఐదేళ్లుగా  మహేష్‌ బాబుతో కలిసి పని చేస్తున్నాడు. ‘ఒకరోజు స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్, ఒకరోజు కార్డియో ఇలా షూట్‌ ముగిసిన తర్వాత రోజూ సాయంత్రం పూట శిక్షణ ఉంటుంది’ అని మినాష్‌ అంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 60 నిమిషాల పాటు కఠినమైన కసరత్తులు చేసే మహేష్‌ సెట్‌లో, సెట్‌ వెలుపల కూడా ఒక పర్ఫెక్షనిస్ట్‌ అనీ, గాయాలతో పోరాడడం, వాటిని అధిగమించడం, అద్భుతమైన ఆకృతిని పొందడం..సాధ్యం. ప్రస్తుతం మహేష్‌ వయసు వెనక్కు వెళుతోంది’ అంటూ తన సూపర్‌స్టార్‌ స్టూడెంట్‌ని ప్రశంసిస్తారాయన.

అనసూయ.. ఆర్జీవి.. 
అరవై ఏళ్లొచి్చనా ఇంకా ఫిట్‌గా కనిపించే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు ఫిట్‌నెస్‌ శిక్షకునిగా పనిచేశారు విజయ్‌ గంధం. అలాగే యాంకర్, నటి అనసూయ, నాగేంద్రబాబు.. తదితరులకూ శిక్షణ అందించారు. ‘ఇప్పుడు నటీనటులకు మాత్రమే కాదు దర్శక నిర్మాతలకు సైతం ఫిట్‌నెస్‌ మీద పూర్తి అవగాహన, ఆసక్తి ఏర్పడింది. క్రమశిక్షణతో తమను తాము తీర్చిదిద్దుకుంటున్నారు’ అంటారు విజయ్‌ గంధం. గత కొంత కాలంగా అనేక అగ్రస్థాయి బ్రాండెడ్‌ జిమ్స్‌లో ట్రైనర్‌గా పనిచేసిన విజయ్‌.. టాలీవుడ్‌ తారలు మాత్రమే కాకుండా నగరంలో పలువురు వ్యాపార ప్రముఖులకూ ట్రైనర్‌గా 
పేరొందారు.

వారి ఆసక్తినిబట్టే.. 
‘తెరపై తారలు పోషించాల్సిన పాత్రలు, వారి ఇష్టాలు, శరీర తీరుతెన్నులకు అనుగుణంగా వర్కవుట్‌లను సృష్టించడానికి ఇష్టపడతాను, ఉదాహరణకు హీరో అఖిల్‌ అక్కినేని క్రీడా అభిమాని. క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడతాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆయన వర్కవుట్‌లు చాలా వరకూ క్రీడల చుట్టూ డిజైన్‌ చేశా.  అదే విధంగా కొందరికి సైక్లింగ్, బ్యాడ్మింటన్‌ అంటే చాలా ఇష్టం. నేను అలాంటి ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. వ్యాయామం సరదాగా ఉండాలి తప్ప బాధపెట్టకూడదు. సమంత చూడడానికి సున్నితంగా కనిపిస్తుంది. కానీ వర్కవుట్‌ చేసే టైమ్‌లో బలమైన శక్తిగా మారుతుంది. అందుకే ఆమె నా ఫేవరెట్‌ క్లయింట్‌.’ 
– జునైద్‌ షేక్, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement