‘షేప్’ కావాలంటే.. టైమ్ ఇవ్వాల్సిందే.. | many precautions to fitness | Sakshi
Sakshi News home page

‘షేప్’ కావాలంటే.. టైమ్ ఇవ్వాల్సిందే..

Published Mon, Aug 24 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

‘షేప్’ కావాలంటే..  టైమ్ ఇవ్వాల్సిందే..

‘షేప్’ కావాలంటే.. టైమ్ ఇవ్వాల్సిందే..

ఫిట్‌నెస్‌కు ఎన్నో జాగ్రత్తలు తప్పవు..
సినీమోజు పనికిరాదంటున్న ట్రైనర్స్

 
సిటీ యూత్‌కి జిమ్‌లు, ఎక్సర్‌సైజ్‌లు క్రేజీగా మారాయి. సినిమా హీరో, హీరోయిన్లను చూసి పెంచుకుంటున్న మోజుతో అచ్చం వారిలాగే వేగంగా తమ బాడీ ‘షేప్’ కూడా మార్చుకోవాలనుకుంటున్నారు. కండరాలు.. అవి పనిచేసే విధానంపై సరైన అవగాహన లేక లేనిపోని సమస్యలతో ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల మెహదీపట్నం, గతంలో ఎల్‌బీనగర్ జిమ్‌లలో యువకులు వర్కవుట్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వ్యాయామం సరైన విధంగా సాగాలంటే మజిల్స్ మీద కనీస అవగాహన ఉండాలంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్స్.  - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
మనం తినే ఆహారం, చేసే శారీరక శ్రమ కండరాల లుక్‌ని, షేప్‌ని నిర్ణయిస్తాయి. ఈ కండరాల్లో మార్పులు వేగంగా రావాలనుకుంటే సప్లిమెంట్స్, శస్త్రచికిత్సలు చేయాలి. వీటికన్నా తగిన సమయం తీసుకుని వచ్చే ఆరోగ్యకరమైన షేప్‌ని మాత్రమే మనం ఆహ్వానించాలి. అందుకు ముందుగా కండరాలపై, వాటికి ఇచ్చే వ్యాయామంపై అవగాహన పెంచుకోవాలంటున్నారు సోల్ జిమ్‌కు చెందిన ఫిట్‌నెస్ ట్రైనర్ వెంకట్.

డెల్టాయిడ్స్: భుజ కండరాల ఎక్సర్‌సైజ్‌లో స్పందించే కండరమే డెల్టాయిడ్. షోల్డర్‌కు ఓ పక్కగా ఉన్న భాగాన్ని మెడిలియల్ డెల్టాయిడ్, ప్రముఖంగా కనబడే భాగాన్ని యాంటిరియర్ డెల్టాయిడ్ అంటారు. వీటిని తీరైన విధంగా తీర్చిదిద్దాలంటే.. 4 నుంచి 8 నెలల సమయం పడుతుంది.

ట్రైసప్స్: భుజాలకు దిగువన చేతికి వెనుక భాగంలో ఉండే కండరం ఇది మూడు మజిల్స్‌తో ఏర్పడుతుంది కాబట్టి ట్రైసప్స్ అంటారు. ఆలస్యంగా వెలుగు చూసి తొందరగా మాయమయే స్వభావం దీనిది. వ్యాయామ ప్రియులు ‘హార్స్‌షూ’గా అభివర్ణించే ఈ షేప్ రావాలంటే కనీసం ఆర్నెల్లు పడుతుంది.

అప్పర్-లోయర్ బ్యాక్  వీపునకు రెండు వైపులా భుజాలకు దిగువన ఉండే కండరాలను లెటిజమ్ మజిల్ అంటారు. దీనికి సరైన విధంగా ఎక్సర్‌సైజ్ అందిస్తే విషేప్ వస్తుంది. గ్రీకు వీరుడి రూపానికి అంత ప్రాచుర్యం రావడానికి కారణమైన కార వి-షేప్ కావాలంటే ఏడాదిన్నర పడుతుంది. ఈ పార్ట్ మంచి షేప్ తిరిగితే ‘క్రిస్మస్ ట్రీ షేప్’ అంటూ ఫిట్‌నెస్ లవర్స్ వర్ణిస్తారు.

బైసప్స్: ముందు వైపు చేతుల భుజం కిందుగా మోచేయికి పైన ఉండే కండరాలు. నేను బలవంతుడిని అని చూపించడానికి తరచుగా ప్రతి ఒక్కరూ చేతులు పైకి మడిచి చూపించే కండరాలివే. రెండు కండరాలు జత కారణంగా దీన్ని బైసప్స్ అంటారు. మూడు నుంచి 8 నెలల సమయంలో బైసప్స్‌ను షేప్‌కు తేవచ్చు.

పెక్టొరాలిస్: ఛాతి ప్రాంతంలో ఉండేవి పెక్టొరాలిస్ మజిల్స్. వీటిలోనే మైనర్, మేజర్ పెక్టొరాలిస్ అని రెండు రకాల మజిల్స్ ఉంటాయి. ఛాతిని తీర్చిదిద్దే పెద్ద సైజ్ కండరాలివి. అప్పర్, మిడిల్, లోయర్, అవుటర్.. ఇలా 4 రకాలుగా విభజించి దానికి తగ్గట్టుగా ఛాతికి వ్యాయామం అందివ్వాలి. తొందరగా పెరిగే లక్షణం ఛాతి మజిల్ కి ఉన్నప్పటికీ కనీసం 6 నెలల టైమ్ ఇవ్వాల్సిందే.

రెక్టస్ మజిల్: ఛాతికి దిగువన ఉంటాయి. దీనిలో రెక్టస్ అబ్డామినల్ మజిల్స్‌ను పైకి కనిపించేలా చేయడానికి వ్యాయామ ప్రియలు ప్రయత్నిస్తుంటారు. ఇందులో కూడా అప్పర్ , లోయర్, మిడిల్ భాగాలుంటాయి. ఈ మూడింటికి సమానంగా ఇచ్చే వ్యాయామం ద్వారా అందంగా కొలువుతీరే కండరాలనే సిక్స్‌ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ వర్ణిస్తున్నారు. అత్యంత కఠినమైన వ్యాయామాలతో ఏడాది పైన సమయం పడుతుంది.

క్వార్డ్రయిసప్స్: తొడకు ముందు భాగంలో ఉండే ఈ మజిల్ సైజ్ పరంగా పెద్దది. మొత్తం 4 కండరాలతో నిర్మితమైంది కాబట్టి దీన్ని క్వార్డ్రయిసప్స్‌గా వ్యవహరిస్తారు. దీనిని బలంగా మార్చాలంటే కనీసం ఆర్నెల్ల సాధన అవసరం.
 
కాఫ్స్: కాలి దిగువ భాగంలో ఉండే కండరాలివి. మనం పిక్కలని పిలుస్తాం. ప్రతిరోజూ ఎక్కువగా వాడే కండరం ఇది. దీనిలో కూడా ఇన్నర్, అవుటర్, రియర్.. అంటూ 3 రకాలుంటాయి. దీనికి ఆర్నెల్లలో మంచి షేప్ తీసుకురావచ్చు.
 
ఒక ప్రత్యేక భాగాన్ని షేపప్ చేయాలంటే.. వ్యక్తి వయసు, దేహం శైలి, ఆహారపు అలవాట్లను అనుసరించి ఉంటుంది. ఆరోగ్యకరమైన పద్ధతుల్లో మాత్రమే ఫిజిక్ షేప్ చేసుకోవాలనేది గుర్తించాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement