మూడు రైళ్లు...మహా విషాదం!
భువనేశ్వర్/బాలాసోర్/హౌరా/సాక్షి, అమరావతి: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి ఒకే చోటఏకంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ దారుణంలో కనీసం వంద మందికిపైగా దుర్మరణం పాలైనట్టు భావిస్తున్నారు. ఇప్పటిదాకా 70కి పైగా మృతదేహాలను వెలికి తీశారు. 350 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
వందలాది మంది బోగీల్లో చిక్కుబడి ఉండటంతో మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కన్పిస్తోంది. సహాయక చర్యలకు పెను చీకటి అడ్డంకిగా మారింది. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. మృతులు, క్షతగాత్రుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు కూడా ఉండొచ్చని చెబుతున్నారు.
ఏం జరిగింది...?
రాత్రి ఏడింటి ప్రాంతంలో బెంగుళూర్ నుంచి హౌరా వెళ్తున్న 12864 ఎక్స్‌ప్రెస్ బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు తప్పిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దాని తాలూకు బోగీలను ఢీకొని షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పిందని, దాని బోగీలు మరో ట్రాక్‌పై ఉన్న గూడ్స్‌పైకి దూసుకెళ్లాయని అంటున్నారు. కానీ వాస్తవానికి తొలుత ప్రమాదానికి గురైంది కోరమండల్ ఎక్స్ప్రెసేనన్నది ప్రత్యక్ష సాక్షుల కథనం.
దానికి పొరపాటున లూప్ లైన్లోకి సిగ్నల్ ఇవ్వడంతో ఆ ట్రాక్‌పై నిలిచి ఉన్న గూడ్స్‌ను శరవేగంగా ఢీకొట్టిందన్నది వారు చెబుతున్నారు. ‘‘ప్రమాద ధాటికి కనీసం ఏకంగా 14 బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పలు బోగీలు గూడ్స్ బోగీల్లోకి దూసుకెళ్లాయి. దాంతో ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ రైలు దిగి పరుగులు తీశారు. మరికొన్ని బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. ఆ ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న హౌరా ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొని పట్టాలు తప్పింది’’ అని వారంటున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై రైల్వే అధికారులు సరైన సమాచరం ఇవ్వకపోవడం, దాంతో సైట్లు, వార్తా సంస్థలు ఒక్కోటీ ఒకోలా రిపోర్టు చేయడం మరింత గందరగోళానికి దారితీసింది.
హుటాహుటిన సహాయ చర్యలు
ప్రమాద సమాచారం తెలియగా>నే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. కోచ్‌ల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. చీకటి వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెప్పారు. 132 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్టు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు.
మిగతా వారిని సొరో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, గోపాల్పూర్ కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, ఖొంటపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. జాతీయ విపత్తు స్పందన దళం కూడా రంగంలోకి దిగింది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం ఆయన ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదంపై పరిస్థితిని తాను వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు.
హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే
కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. రైల్వేస్టేషన్లు.. విజయవాడలో 0866 2576924, రాజమండ్రిలో 0883 2420541, రేణిగుంటలో 9949198414, తిరుపతిలో 7815915571, నెల్లూరులో 0861 2342028, సామర్లకోటలో 7780741268, ఒంగోలులో 7815909489, గూడూరులో 08624250795, ఏలూరులో 08812232267 నంబర్లను అందుబాటులో ఉంచింది. అలాగే తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో 040 27788516 నంబర్‌ను ఏర్పాటు చేసింది.
రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమాచారం తెలుసుకోవడానికి ఈ నంబర్లకు ఫోన్ చేయొచ్చని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది. అలాగే హౌరాలో 033 2638227, ఖరగ్‌పూర్‌లో 8972073925, 9332392339, బాలాసోర్‌లో 8249591559, 7978418322, 858 5039521, షాలిమార్‌లో 9903370746, సంత్రాగచ్చిలో 8109289460, 8340649469 నంబర్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం..
రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీగా ప్రయాణికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ప్రధాని మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు సాధ్యమైన సహాయం అందించనున్నట్లు c. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వెలిబుచ్చారు.
రూ.10 లక్షల పరిహారం..
ప్రమాద బాధితులకు రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. మృతుల కు టుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.
మాటలకందని విషాదం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఒడిశా రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వెలిబుచ్చారు. ‘‘ఇది మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు దేవుడు ఆ కష్టాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అందరూ కృషి చేయాలి’ అని పేర్కొన్నారు. మృతులకు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగేలా అందరూ సహకరించాలని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు తోడుగా నిలవాలని ట్వీట్ చేశారు.
రద్దయిన రైళ్లు ఇవే...
12837 హౌరా–పూరీ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12863 హౌరా–సర్ ఎం.విశ్వేశ్వరయ్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 12839 హౌరా–చెన్నై మెయిల్ (02.06.2023); 12895 షాలిమార్–పూరీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 20831 షాలిమార్–సంబల్పూర్ ఎక్స్‌ప్రెస్ (02.06.2023); 02837 సంత్రాగచ్చి–పూరి (02.06.2023); 22201 సీల్దా–పూరీ దురంతో ఎక్స్‌ప్రెస్ 0(2.06.2023); 12074 భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12073 హౌరా–భువనేశ్వర్ జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12278 పూరీ–హౌరా శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12277 హౌరా–పూరీ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12822 పూరీ–షాలిమార్ ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 2821 షాలిమార్ – పూరి ధౌలీ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12892 పూరి–బంగిరిపోసి (03.06.2023), 12891 బంగిరిపోసి–పూరి ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 02838 పూరీ–సంత్రగచ్చి స్పెషల్ (03.06.2023); 12842 చెన్నై–షాలిమార్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ (03.06.2023); 12509 ఎస్ఎంవీటీ బెంగళూరు–గౌహతి (02.06.2023).