పొగమంచు కారణంగా 89 రైలు సర్వీసులు రద్దు
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో చలి మరింత పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా అక్కడ 89 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. చలి తీవ్రతకు తట్టుకోలేక బుధవారం రాజస్థాన్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందినట్లు వివరించారు. ఢిల్లీకి వెళ్లే 9 రైళ్లను రద్దుచేశారు. గౌహతి రాజధాని ఎక్స్ప్రెస్, విక్రమశిలా ఎక్స్ ప్రెస్, మగధ ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసులను నిలిపివేశారు. పగటిపూట అధికంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, ఉదయం వేళల్లో 12 డిగ్రీలే ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.
రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో అత్యల్పంగా 7.8 డిగ్రీలు ఉండగా, అజ్మీర్, జోధ్పూర్ 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉన్నాయి. కశ్మీర్ లోయ ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు, వ్యక్తులు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. విమాన సర్వీసులు యథాతథంగా కొనసాగుతాయని శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ అధికారులు వెల్లడించారు.