రైలు కింద పడి ట్రాక్‌మన్ ఆత్మహత్య
సామర్లకోట, న్యూస్‌లైన్ : భార్యాబిడ్డలకు దూరంగా, ఒంటరిగా నివసిస్తున్న ఓ రైల్వే ఉద్యోగి శనివారం స్థానిక రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు, సహ ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా కాజీపేటకు చెందిన సీహెచ్ సత్యనారాయణ(52) గత 15 ఏళ్లుగా సామర్లకోటలో పని చేస్తున్నాడు. గ్యాంగ్‌మన్‌గా విధుల్లో చేరిన ఇతడికి స్పెషల్ ట్రాక్‌మన్‌గా పదోన్నతి లభించింది. ఇతడికి భార్య రమ, కుమారుడు శ్రావణ్, కుమార్తె శిరీష ఉన్నారు. ఇటీవల కుమార్తెకు వివాహం చేశాడు. కుమారుడు ఇంజనీరింగ్ చదువుతుండడంతో భార్య రమ, శ్రావణ్ కాజీపేటలో నివసిస్తున్నారు. దీంతో స్థానిక రైల్వే క్వార్టర్సలో సత్యనారాయణ ఒంటరిగా ఉంటున్నాడు. శనివారం విధులకు హాజరుకావాల్సిన సత్యనారాయణ.. తెల్లవారుజామున రైల్వే స్టేషన్‌లోని మూడో నంబరు ప్లాట్‌ఫాం పట్టాలపై సామర్లకోట నుంచి రాజమండ్రి వైపు వెళుతున్న రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనలో అతడి తల, మొండెం, చేతులు వేరయ్యాయి. సత్యనారాయణకు కుటుంబ సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ లేవని, అందరితోను కలిసిమెలిసి ఉండే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అర్ధం కావడం లేదని సహ ఉద్యోగులు తెలిపారు. రైల్వే ఎస్సై గోవిందరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.