క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. వినియోగదారులను ఇబ్బందిపెడుతున్న ఈ కార్డుల లావాదేవీలపై చెల్లించే అదనపు చార్జ్ లను ఇక పైన ప్రభుత్వమే భరిస్తుందట! నగదు రహిత ఎకానమీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసిన అన్ని చెల్లింపుల లావాదేవీల ఖర్చులను ఇకముందు తామే భరించనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వినియోగదారులు ప్రభుత్వానికి చెల్లిస్తున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్( ఎండీఆర్) పేరిట చెల్లిస్తున్న చార్జీలను ఇక ముందు చెల్లించాల్సి అవసరం లేదని ఆర్థికమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులు లేదా డిజిటల్ మార్గాల ద్వారా ప్రజలు ఇక ఎలాంటి వర్తక డిస్కౌంట్ రేటును భరించాల్సిన అవసరం లేదని అని ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం జారీ చేసిన తాఖీదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు మరియు కార్యాచరణ విధివిధానాలను జారీ చేయనున్నామని చెప్పారు.
కాగా గతంలో ప్రభుత్వం డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ ఎసెట్ మేనేజ్ మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి నీరజ్ గుప్తా ఆధ్వర్యంలో ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు మరియు నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించే యోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. క్రెడిట్ కార్డు లావాదేవీలపై 2012 లో రిజర్వ్ బ్యాంక్ రూ .2,000 పైన 0.75 శాతం, ఆ పైన చెల్లింపులపై 1 శాతంగా ఎండీఆర్ అదనపు చార్జీలను తగ్గించింది. అయితే క్రెడిట్ కార్డ్ చెల్లింపులులపై ఎలాంటి కోతను ప్రకటించలేదు. డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై ఎలాంటి అదనపు చార్జీలనూ వసూలు చేయరాదని ఈ ఏడాది మార్చిలో ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. అధికారిక లెక్కల ప్రకారం అక్టోబర్ 2015 నాటికి, దేశంలో 61.5 కోట్ల డెబిట్ కార్డు వినియోగదారులు, 2.3 కోట్ల క్రెడిట్ కార్డు హోల్డర్లు ఉన్నారు.