నవీన్ మిట్టల్ పీఎస్ పద్మావతిపై బదిలీ వేటు
ఆర్థిక శాఖలో ముదిరిన వివాదం
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పద్మావతిపై బదిలీ వేటు పడింది. ప్రభుత్వ సలహాదారులు జీఆర్ రెడ్డి పేషీకి ఆమెను బదిలీ చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మావతి తెలంగాణ ఉద్యోగులంటేనే చీదరింపుగా వ్యవహరిస్తున్నారని, వేధిస్తున్నారని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇటీవల ఆందోళనకు దిగింది. సంఘం నాయకులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఆర్థిక శాఖలో మరోసారి వివాదం చెలరేగింది. ఆర్థికశాఖ చాంబర్ నుంచి సీఎం బ్లాక్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పద్మావతి గో బ్యాక్ అంటూ పేషీలో ఆమె కూచోకుండా అడ్డుకున్నారు. ఆమె కుర్చీని బయట పడేశారు. పద్మావతిని వెయిటింగ్లో పెట్టాలని, ఏపీకి చెందిన పద్మావతిని ఇక్కణ్నుంచి తొలగించాలని సంఘం ఉపాధ్యక్షులు నేతి మంగమ్మ డిమాండ్ చేశారు.
పదోన్నతి విషయంలో తెలంగాణ ఉద్యోగులు తనను ఏమీ చేయలేరని, తనకు పదోన్నతి ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పదోన్నతుల రివ్యూ డీపీసీ వద్దని, ఒరిజినల్ డీపీసీనే పెట్టాలని మంగమ్మ కోరారు. తనకు రావాల్సిన ప్రమోషన్‌ను అడ్డుకునేందుకే ఆందోళన చేస్తున్నారని, తన తప్పేమీ లేదని పద్మావతి వివరణ ఇచ్చారు. తన విధులకు ఆటంకం కల్పించటంతోపాటు కుర్చీ బయటకు విసిరేసిన సంఘటనపై ఏపీ సీఎస్ ఠక్కర్‌కు, తెలంగాణ సీఎస్‌కు రాజీవ్‌శర్మను కలసి ఫిర్యాదు చేశారు.