‘అనంత’కు పరీక్షేనా?
- చిత్తూరు డీఈఓగా శామ్యూల్!
- ‘అనంత’ డీఈఓపై స్పష్టత ఇవ్వని వైనం
- ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం
- విద్యాశాఖలో ‘పది’ంతల ఆందోళన
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘పది’ వార్షిక పరీక్షల సమయం దగ్గర పడుతోంది.. జిల్లాలో ఉత్తీర్ణత శాతంపైనా ఎన్నో ఆశలు పెట్టుకున్న సమయం ఇది.. ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తేనే మెరుగైన ఫలితాల సాధనకు అవకాశం ఉంటుంది. ఈ నేపధ్యంలో జిల్లా విద్యాధికారి శామ్యూల్‌ను చిత్తూరు డీఈఓ (ఎఫ్ఏసీ)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదివారం ఆయన అక్కడ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఇదిలా ఉండగా గతేడాది నవంబర్ 1న అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారిగా (ఎఫ్ఏసీ) శామ్యూల్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న అనతికాలంలోనే జిల్లాపై తనదైన ముద్ర వేసుకున్నారు. గాడితప్పిన విద్యాశాఖను ప్రక్షాళన చేసేందుకు పూనుకున్న సమయంలో ఈయనను చిత్తూరుకు బదిలీ కావడం విద్యాశాఖలో చర్చాంశనీయమైంది.
‘అనంత’ డీఈఓపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
అనంతపురం డీఈఓ ఎవరనేదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశం జరిగితే పలువురికి రెగ్యులర్ డీఈఓలుగా పదోన్నతులు లభిస్తాయి. దీంతో ఖాళీ స్థానాలన్నీ భర్తీ అవుతాయి. ఇప్పటికే జరగాల్సిన డీపీసీ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర సమస్యల కారణంగా మరో రెణ్నెళ్ల దాకా జరగకపోవచ్చని అంచనా. అప్పటిదాకా చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఒకే అధికారిని కొనసాగించే వీలులేదు. ఈ పరిస్థితుల్లో శామ్యూల్‌ను చిత్తూరుకే తీసుకోవాలని అక్కడి కలెక్టర్ చొరవ తీసుకుంటున్నారు. మరి అనంతపురం డీఈఓ బాధ్యతలు ఎవరికి ఇస్తారనేదానిపై చర్చ జరుగుతోంది. డీపీసీ జరిగేదాకా అసిస్టెంట్ డైరెక్టర్ పగడాల లక్ష్మీనారాయణకు డీఈఓ బాధ్యతలు అప్పగించే వీలుంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
అక్కడి కలెక్టర్ చొరవతోనే... :
చిత్తూరు కలెక్టర్ సిద్ధార్థజైన్‌కు శామ్యూల్ పట్ల ప్రత్యేక అభిప్రాయం ఉంది. అక్కడి డీఈఓగా పని చేస్తున్న నాగేశ్వరావు, కలెక్టర్ మధ్య ఇటీవల బాగా ఎడం పెరిగినట్లు తెలిసింది. ఈ పరిస్థితులే నాగేశ్వరరావు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేలా చేశాయని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో శామ్యూల్‌కు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం వెనుక కలెక్టర్ చొరవ ఉన్నట్లు సమాచారం. దీంతో ఆగమేఘాల మీద శనివారం రాత్రి శామ్యూల్‌ను ఇన్చార్జ్గా నియమించడం ఆదివారం ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి.