Transfer officers
-
ముడుపులు తేలక మల్లగుల్లాలు
చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీ అటు సర్కారు ఖజానా నింపడమే కాదు.. కూటమి నేతలకూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో జరుగుతున్న సీఐ బదిలీలే ఇందుకు కారణం. ఈ వారంలోనే నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతకుముందే ఎక్సైజ్ సీఐల బదిలీలు పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో మద్యం అమ్మకాల్లో రాష్ట్రస్థాయిలోనే పేరున్న సర్కిళ్ల కోసం అధికారులు పోటీపడుతున్నారు. ఎందుకంటే.. మద్యం అమ్మకాలు బాగా జరిగితేనే సిండికేట్ల ఏర్పాటు, ఎమ్మారీ్పకి గండి కొట్టడం సాధ్యమవుతుంది.ఈ పనులన్నీ జరగాలంటే తాము చెప్పిన సీఐ ఉంటేనే సాధ్యమని ప్రజాప్రతినిధులు ఈ బదిలీల్లో తలదూరుస్తున్నారు. కానీ, రాయలసీమలోని జోన్–4 పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల సీఐల బదిలీలు కొలిక్కిరాలేదు. నాయకులకు ముట్టాల్సిన ముడుపులు ముట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పంచాయతీ తేలకపోవడంతో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం బదిలీల ఉత్తర్వులు ఇచ్చేయడానికి సిద్ధపడింది. అయితే, సీమలోని కూటమి నేతల నుంచి కమిషనర్ కార్యాలయానికి హెచ్చరికలు వెళ్లినట్లు ఎక్సైజ్ శాఖలో చర్చించుకుంటున్నారు.తేలని సీఐల పోస్టింగ్లుఇక రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, కృష్ణాలోని మూడు జోన్లలో శనివారం రాత్రి బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలింది జోన్–4 మాత్రమే. మూడు జోన్లతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో సీఐల బదిలీల ఉత్తర్వులు సైతం శనివారమే విడుదల కావాల్సింది. కానీ, కూటమి నేతలు తమకు అనుకున్న స్థాయిలో ముడుపులు రాలేదన్న కారణంతో సీఐల పోస్టింగులపై తేల్చలేదు. ప్రధానంగా తిరుపతి అర్బన్, చంద్రగిరి, డిస్టిలరీ, పలమనేరు, నగరి, గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు భారీ ధర పలుకుతోంది. ఇక కడప అర్బన్, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కర్నూలు అర్బన్, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, అనంతపురం అర్బన్, హిందూపురం, కదిరి, ధర్మవరం, ఉరవకొండ సర్కిళ్లకు సైతం డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి పలువురు సీఐలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.ఫలితంగా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్లకు కావాల్సింది తీసుకుని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు సిఫార్సు లేఖలపరంగా.. కొన్నిచోట్ల మంత్రులు వాటికి అడ్డుకట్ట వేస్తూ తమ సిఫార్సు లేఖలు ఇచ్చేశారు. దీంతో ఎవర్ని ఎక్కడ వేయాలో తెలీక కమిషనర్ కార్యాలయం తల పట్టుకుంటోంది. ఇప్పటికే అనంతపురంలోని ఓ ఎమ్మెల్యేను కమిషనర్ కార్యాలయంలోని ఓ అధికారి సంప్రదించి, మంత్రి చెప్పిన వాళ్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అగ్గిమీద గుగ్గిలమైన ఆ నేత, తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని చీవాట్లు పెట్టినట్లు సమాచారం.దీంతో.. రాయలసీమలోని బదిలీల వ్యవహారం తేల్చడం తమవల్ల కాదంటూ కమిషనర్ కార్యాలయం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఆబ్కారీ శాఖ మంత్రి దృష్టికి వెళ్లినా ఆయన మాట కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు వినడంలేదని తెలుస్తోంది. మరికొన్ని సర్కిళ్లలో నేతల రేటుకు సీఐలు సరితూగకపోవడంతో బదిలీల్లో సందిగ్థత నెలకొంది. ఆదివారం ఈ పంచాయతీ చినబాబు వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సర్కిళ్లకు నిర్ణయించిన ధరలు తగ్గుతాయా, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖల్లో ఎవరివి చెల్లుతాయో అన్న దానిపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తి నెలకొంది. -
రాజాంలో రచ్చ!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో అధికారుల బదిలీల నుంచి ప్రభుత్వపరంగా తీసుకొనే నిర్ణయాల వరకూ ప్రతి విషయంలో తమదే పైచేయి అని నిరూపించుకునేందుకు ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు వర్గం, మరోవైపు కిమిడి కళా వెంకటరావు వర్గం యథాశక్త్తి ప్రయత్నం చేస్తున్నాయి. మంత్రి ప్రత్యర్థి వర్గం తమ పంతం నెగ్గించుకునేందుకు వీలైతే పొరుగు జిల్లా నేతల సహకారం కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో రాజాం నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలు అందుకు బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల రాజాంలోని శ్రీవేదగాయత్రి జూనియర్ కళాశాలను జీఎన్ఆర్ జూనియర్ కళాశాలకు సమీపంలోకి తరలించారు. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ జీఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అధికారులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో యాజమాన్య ప్రతినిధులు సంతకవిటి మండల నాయకుడు కొల్ల అప్పలనాయుడు ద్వారా మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. మంత్రి ఆదేశాలతో ఆర్ఐవో వి.పాపారావు గత ఆదివారం శ్రీవేద గాయత్రి కళాశాలను సీజ్ చేశారు. దీంతో ఈ కళాశాల ప్రతినిధులు కళావెంకట రావును ఆశ్రయించారు. ఆయన సూచనలతో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావును కలిశారు. ఆయన ఆదేశాలతో 24 గంటలు తిరగకముందే కళాశాలను తిరిగి తెరిచారు. రాజాం నగరపంచాయతీ కమిషనర్ పి.సింహాచలం ఎమ్మెల్సీ ప్రతిభాభారతికి అనునూయుడి ముద్రపడిపోయింది. ఏ పని జరగాలన్నా, చివరికి కుళాయి కనెక్షన్ కావాలన్నా ఎమ్మెల్సీకి తెలియకుండా జరగవనే ప్రచారం కూడా జరిగింది. కమిషనర్ తీరు బాగాలేదంటూ ఇటీవల రాజాం, సంతకవిటి మండలాలకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఇదే అదనుగా భావించిన మంత్రి... తక్షణమే రాజాం కమిషనర్‌ను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేగాకుండా ఎంతటి స్థాయి నాయకుడు అడ్డుపడినా బదిలీని ఆపొద్దని మరీ ఆదేశాలిచ్చారట. కానీ కళావెంకటరావు, ప్రతిభాభారతి పట్టుబట్టి మరీ కమిషనర్ బదిలీని నిలుపుదల చేయించేశారు. రాజాం ఏఎంసీ చైర్మన్ పదవి విషయంలోనూ మంత్రి అచ్చెన్నాయుడికి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పదవికి వంగర మండలానికి చెందిన పైల వెంకటరమణ పేరును ఎమ్మెల్సీ ప్రతిభాభారతి సూచించారు. మంత్రి మాత్రం సంతకవిటి మండలంలో తన అనుచరుడైన కొల్ల అప్పలనాయుడు పేరును తెరపైకి తెచ్చారు. ఇది ఇరువర్గాల మధ్య పంచాయతీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ వెళ్లింది. చివరకు ప్రతిభాభారతి మాట కే సీఎం ప్రాధాన్యం ఇచ్చారనే గుసగుసలు అధికార పార్టీలో వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలే గాకుండా రాజాం నియోజకవర్గంలోని అధికారులు కూడా మంత్రి సిఫారసు లేఖలకు విలువ ఇవ్వట్లేదనే ప్రచారం జరుగుతోంది. రాజాంలోని గాయత్రీ కాలనీలో స్థల వివాదం ఒక్కటి మంత్రి అచ్చెన్నాయుడి వద్దకు ఇటీవల వెళ్లింది. తనను ఆశ్రయించిన వర్గానికి అనుగుణంగా వివాదం పరిష్కరించాలని సూచిస్తూ మంత్రి ఒక లేఖ ఇచ్చారట. తీరా దాన్ని తహసిల్దారు పక్కనబెట్టేయడంతో ఆ వర్గం ఖంగుతిన్నారని తెలిసింది. అవతల వర్గానికి ప్రతిభాభారతి అండదండలు ఉండటమే దీనికి కారణమని ప్రచారం జరిగింది. -
ఇక బది‘లీల’లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :అధికారుల్లో బదిలీ ఫీవర్ మొదలైంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో తమకు కావల్సిన చోట పోస్టింగ్ కోసం అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద క్యూ కడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం సిఫార్సు లేఖలకు తెరదీశారు. ఇప్పటికే జిల్లా మంత్రి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లేఖలు ఇవ్వడం ప్రారంభించారు. జిల్లాలో అత్యున్నత అధికారి నుంచి కిందిస్థాయి వరకూ బదిలీలు జరిగే అవకాశం ఉంది. రెవెన్యూలో అన్ని కేడర్ల అధికారులను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ముగ్గురు ఆర్డీవోలను మార్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఒంగోలుకు ఒక మాజీ ప్రజాప్రతినిధి ఆశీస్సులతో వచ్చేందుకు ఒక అధికారి ప్రయత్నిస్తుండగా, కందుకూరు, మార్కాపురానికి ఒక ఉన్నత ప్రజాప్రతినిధి తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని ఇప్పటికే రెవెన్యూ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. మిగిలిన విభాగాధిపతులు కూడా తమకు ప్రాధాన్యం ఉన్న పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ఇప్పుడు పనిచేస్తున్న వారికి ఇక్కడి నుంచి సాగనంపి వారి స్థానంలో వచ్చేందుకు అధికార పార్టీ ద్వారా పావులు కదుపుతున్నారు. పోలీసు విభాగంలో కూడా తమకు అనుకూలమైన ఎస్ఐలు, సీఐలను తెచ్చుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కొరకరాని కొయ్యగా మారిన వారిని పంపించి వేయాలని ఉన్నతాధికారులపై వత్తిళ్లు తెస్తున్నారు. ఆయా శాఖలలో ప్రభుత్వం ద్వారా జరిగే పనులన్నింటినీ తమ అనుచరులకు, బినామీలకు ఇవ్వాలని పైరవీలు ప్రారంభమయ్యాయి. ఇవ్వని అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మాట వినకపోతే బదిలీ వేటు వేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు కూడా చేస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయాల్లో తెలుగు తమ్ముళ్ల జోక్యం శృతి మించుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండా ఏ ఎన్ఓసీ, పట్టాదార్ పాసుపుస్తకం కూడా ఇవ్వకూడదని మండలస్థాయి నేతలు హుకుం జారీ చేస్తున్నారు. పట్టాదార్ పాసుపుస్తకం ఇవ్వాలంటే ముందు ఆ నేతకు ఐదు వేలు సమర్పించుకుంటేగానీ రాని పరిస్థితి కొన్ని మండలాల్లో ఉంది. దీంతో విసిగిపోయిన అధికారులు కూడా తమను ఎక్కడికి బదిలీ చేసినా వెళ్లిపోవడానికి సిద్ధం కాగా, మరికొందరు తమకు ఉపయోగపడే పోస్టింగ్‌ల కోసం లాబీయింగ్‌లు ప్రారంభించారు. బదిలీల కారణంగా ఆయా కార్యాలయాల్లో పనులు కుంటుపడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.