జోన్–4 ఎక్సైజ్ సీఐల బదిలీల్లో ప్రతిష్టంభన
చినబాబు ‘సైగ’ కోసం కమిషనర్ కార్యాలయం నిరీక్షణ
‘సీమ’ బదిలీలు పూర్తయితేనే కొత్త మద్యం పాలసీ ప్రకటన
మూడు జోన్లలో ఇప్పటికే బదిలీలు పూర్తి
చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీ అటు సర్కారు ఖజానా నింపడమే కాదు.. కూటమి నేతలకూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో జరుగుతున్న సీఐ బదిలీలే ఇందుకు కారణం. ఈ వారంలోనే నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతకుముందే ఎక్సైజ్ సీఐల బదిలీలు పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో మద్యం అమ్మకాల్లో రాష్ట్రస్థాయిలోనే పేరున్న సర్కిళ్ల కోసం అధికారులు పోటీపడుతున్నారు. ఎందుకంటే.. మద్యం అమ్మకాలు బాగా జరిగితేనే సిండికేట్ల ఏర్పాటు, ఎమ్మారీ్పకి గండి కొట్టడం సాధ్యమవుతుంది.
ఈ పనులన్నీ జరగాలంటే తాము చెప్పిన సీఐ ఉంటేనే సాధ్యమని ప్రజాప్రతినిధులు ఈ బదిలీల్లో తలదూరుస్తున్నారు. కానీ, రాయలసీమలోని జోన్–4 పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల సీఐల బదిలీలు కొలిక్కిరాలేదు. నాయకులకు ముట్టాల్సిన ముడుపులు ముట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పంచాయతీ తేలకపోవడంతో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం బదిలీల ఉత్తర్వులు ఇచ్చేయడానికి సిద్ధపడింది. అయితే, సీమలోని కూటమి నేతల నుంచి కమిషనర్ కార్యాలయానికి హెచ్చరికలు వెళ్లినట్లు ఎక్సైజ్ శాఖలో చర్చించుకుంటున్నారు.
తేలని సీఐల పోస్టింగ్‌లు
ఇక రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, కృష్ణాలోని మూడు జోన్లలో శనివారం రాత్రి బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలింది జోన్–4 మాత్రమే. మూడు జోన్లతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో సీఐల బదిలీల ఉత్తర్వులు సైతం శనివారమే విడుదల కావాల్సింది. కానీ, కూటమి నేతలు తమకు అనుకున్న స్థాయిలో ముడుపులు రాలేదన్న కారణంతో సీఐల పోస్టింగులపై తేల్చలేదు. ప్రధానంగా తిరుపతి అర్బన్, చంద్రగిరి, డిస్టిలరీ, పలమనేరు, నగరి, గూడూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు భారీ ధర పలుకుతోంది. ఇక కడప అర్బన్, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కర్నూలు అర్బన్, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, అనంతపురం అర్బన్, హిందూపురం, కదిరి, ధర్మవరం, ఉరవకొండ సర్కిళ్లకు సైతం డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి పలువురు సీఐలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.
ఫలితంగా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్లకు కావాల్సింది తీసుకుని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు సిఫార్సు లేఖలపరంగా.. కొన్నిచోట్ల మంత్రులు వాటికి అడ్డుకట్ట వేస్తూ తమ సిఫార్సు లేఖలు ఇచ్చేశారు. దీంతో ఎవర్ని ఎక్కడ వేయాలో తెలీక కమిషనర్ కార్యాలయం తల పట్టుకుంటోంది. ఇప్పటికే అనంతపురంలోని ఓ ఎమ్మెల్యేను కమిషనర్ కార్యాలయంలోని ఓ అధికారి సంప్రదించి, మంత్రి చెప్పిన వాళ్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అగ్గిమీద గుగ్గిలమైన ఆ నేత, తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని చీవాట్లు పెట్టినట్లు సమాచారం.
దీంతో.. రాయలసీమలోని బదిలీల వ్యవహారం తేల్చడం తమవల్ల కాదంటూ కమిషనర్ కార్యాలయం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఆబ్కారీ శాఖ మంత్రి దృష్టికి వెళ్లినా ఆయన మాట కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు వినడంలేదని తెలుస్తోంది. మరికొన్ని సర్కిళ్లలో నేతల రేటుకు సీఐలు సరితూగకపోవడంతో బదిలీల్లో సందిగ్థత నెలకొంది. ఆదివారం ఈ పంచాయతీ చినబాబు వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సర్కిళ్లకు నిర్ణయించిన ధరలు తగ్గుతాయా, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖల్లో ఎవరివి చెల్లుతాయో అన్న దానిపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment