4 కోట్లకు జన ధన ఖాతాలు
ఖాతాల్లోకి నేరుగా సబ్సిడీల బదిలీ యోచన
న్యూఢిల్లీ: జన ధన యోజన పథకం కింద ఇప్పటివరకూ 4 కోట్ల ఖాతాలను ప్రారంభించినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. తద్వారా రూ. 3,700 కోట్ల డిపాజిట్లను సమీకరించినట్లు వెల్లడించింది. వెరసి ఒక్కో ఖాతాపైనా సుమారుగా రూ. 900 జమ అయినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి జీఎస్ సంధు చెప్పారు. ప్రధాని మోదీ ఆగస్ట్ 28న ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ఉన్న ఖాతాను వినియోగించుకునే సౌకర్యాన్ని సైతం ప్రభుత్వం కల్పించింది.
ఆధార్‌తో అనుసంధానించే ఈ పథకంలో ప్రధానంగా రూ. 5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని బ్యాంకులు కల్పించనున్నాయి. ఇక రుపే డెబిట్ కార్డ్ ద్వారా రూ. లక్ష వరకూ ప్రమాద బీమా లభిస్తుంది. ఇవికాకుండా రూ. 30,000 వరకూ జీవిత బీమాను కూడా ప్రభుత్వం కల్పించింది. కాగా, వినియోగదారులు కొనుగోలు చేసే కిరోసిన్, వంటగ్యాస్‌పై సబ్సిడీలను నేరుగా జన ధన యోజన ఖాతాలలోకి బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సంధు చెప్పారు. తద్వారా మార్కెట్ ధరలకే వినియోగదారులు కిరోసిస్, వంటగ్యాస్‌లను కొనుగోలు చేసేందుకు వీలు చిక్కనుంది.