కమిషనర్‌పై బదిలీ వేటు ?
సాక్షి, బెంగళూరు: ఐఏఎస్ అధికారి డి.కె.రవి అనుమానాస్పద మృతికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఐఏఎస్ అధికారి డి.కె.రవి గత సోమవారం కోరమంగళలోని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో డి.కె.రవి నివాసానికి చేరుకున్న నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి ఆ వెంటనే అక్కడి విలేకరులతో మాట్లాడుతూ...‘ఘటనా స్థలంలో లభించిన కొన్ని ఆధారాలను బట్టి డి.కె.రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది’ అని ప్రకటించేశారు.
దీంతో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ కేసులో అసలేమీ దర్యాప్తు జరగకుండానే డి.కె.రవి ఆత్మహత్యకు పాల్పడ్డారని నగర పోలీస్ కమిషనర్ స్థాయి వ్యక్తి ప్రకటన చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు డి.కె.రవి తల్లిదండ్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కేసును పక్కదారి పట్టించేందుకే సంఘటన జరిగిన కాసేపటికే డి.కె.రవి మృతిని ఆత్మహత్యగా చిత్రిస్తూ కమిషనర్‌తో ప్రకటన చేయించారని విపక్షాలు సైతం విమర్శించాయి.
ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది. కమిషనర్ స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఓ కేసులో ఇలాంటి బాధ్యతా రహిత వ్యాఖ్యలను ఎలా చేశారంటూ విపక్షాలు శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిని సమర్థించేందుకు స్వయానా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ ప్రయత్నించినా విపక్షాలను ఒప్పించ లేకపోయారు. ఇక గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో సైతం అనేక మంది మంత్రులు సైతం ఎం.ఎన్.రెడ్డిని బదిలీ చేయాల్సిందేనని ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
దీంతో నగర పోలీస్ కమిషనర్ ఎం.ఎన్.రెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఇక హోం శాఖ నిర్వహణలో పూర్తిగా విఫలమవుతుండడంతో పాటు డి.కె.రవి మృతి కేసులో ఆరోపణలు సైతం ఎదుర్కొంటున్న కె.జె.జార్జ్‌ను సైతం హోం శాఖ బాధ్యతల నుంచి తప్పించి వేరే ఏదైనా అప్రాధాన్య శాఖను కట్టబెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్‌ను ఇప్పుడే ఆ శాఖ బాధ్యతల నుంచి తప్పిస్తే విపక్షాలకు విమర్శలు చేసేందుకు మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్న సిద్ధరామయ్య జార్జ్ శాఖ మార్పునకు సంబంధించి మరికొంత కాలం వేచి చూసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.