హిజ్రాల నియామకాలపై ట్రంప్ నిషేధం
న్యూయార్క్ : హిజ్రాల ఆవేదనను పట్టించుకోని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్నంత పని చేశారు. ఆ దేశ మిలటరీ రంగంలో హిజ్రాలు చేరకుండా నిషేధం విధిస్తూ ఓ మెమోపై సంతకం చేశారు. ఈ మెమోతో ఇక మిలటరీ సేవల్లో ట్రాన్సజెండర్ల నియామకాలు రద్దు అవుతాయి. ఈ మెమోను వైట్‌హౌజ్ విడుదల చేసింది. దేశీయ మిలటరీ రంగంలో పనిచేయడానికి హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందంటూ వారిపై ట్రంప్ గత నెలలో ఓ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్ చేసిన అనంతరం ఒక్క నెలలోనే ఈ నోటీసులు జారీచేశారు. హిజ్రాలకు కేటాయిస్తున్న ప్రభుత్వం ఫండ్లను ఆపివేయాలని దేశీయ డిఫెన్స్ డిపార్ట్మెంట్, హోమ్‌లాండ్ సెక్యురిటీ డిపార్ట్మెంట్కు ట్రంప్ ఆదేశాలు జారీచేశారు.
గత నెలలోనే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిఘటన మొదలైంది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్మెంట్ సెంటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హిజ్రాలు కన్నీరు కారుస్తూ 'ఈ ప్రెసిడెంట్ మాకొద్దూ అంటూ నినదించారు'. ఏం తప్పు చేస్తే మాపై నిషేధం విధించారంటూ ప్రశ్నించారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని పేర్కొన్నారు.
ట్రంప్ ఏమన్నారు
మిలటరీలోని జనరల్స్, నిపుణులను సంప్రదించిన అనంతరమే తాను హిజ్రాలపై నిషేధాన్ని విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్ చెప్పారు. మిలటరీ విజయాలపై దృష్టి సారించాలంటే హిజ్రా సైనికుల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోక తప్పదని పేర్కొన్నారు.