Transgenic experiments
-
రంగు.. రుచి.. కొత్త కొత్తగా!
ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనే సామెత తెలుసుగా.. ఇదీ అచ్చం అలాంటిదే.. ఇప్పుడు మనం తింటున్నదే.. కానీ సరికొత్తగా వస్తోంది.. శరీరానికి శక్తినేకాదు.. ఆరోగ్యాన్నీ ఇచ్చేలా తయారవుతోంది. జన్యు మార్పిడి సాంకేతికత ఇందుకు మార్గం వేస్తోంది..మరి అలాంటి వినూత్న.. ఉత్తమమైన ఆహారం వివరాలు ఏమిటంటే.. రంగు మారని ఆపిల్... కోసిన కాసేపటికే ఆక్సిడేషన్ వల్ల నలుపెక్కడం ఆపిల్ లక్షణం. కానీ ఎంత సేపైనా తాజాగానే ఉండే ఆపిల్స్ అందుబాటులోకి వచ్చాయి. అమెరి కాలో గతేడాది నుంచి అందుబాటులో ఉన్న ఈ ఆపిల్స్‌ను ఒకనాగన్ స్పెషాలిటీ ఫ్రూట్స్ కంపెనీ అభివృద్ధి చేసింది. మచ్చల్లేని బంగాళాదుంప.. ఎంత జాగ్రత్తగా ఏరుకున్నా బంగాళాదుంపలపై ఒకట్రెండు మచ్చలు ఉండటం, కోసిన కొద్దిసేపటికే రంగు మారడం సహజం. అంతేకాదు బంగాళా దుంపలను వేయిస్తే అక్రిలామైడ్ అనే రసాయనం వెలువడుతుంది. అది కేన్సర్ కారకమనే అభిప్రాయా లున్నాయి. ఈ ఇన్నేట్ పొటాటో అనే సంస్థ ఈ సమస్యకు జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా చెక్ పెట్టింది. ఈ బంగాళ దుంపల్లో నల్లమచ్చలు ఏర్ప డవు సరికదా.. వేయించినప్పుడు వెలువడే అక్రి లామైడ్ చాలా తక్కువగా ఉంటుందని నిర్ధారించారు. ఆరోగ్యనిచ్చే గ్లుటెన్తో గోధుమలు! జీర్ణ సమస్యలు ఉన్న వారిలో కొందరికి గోధుమలు అస్సలు పడవు. గోధుమలో ఉండే గ్లుటెన్ దానికి కారణం. దీంతో కొందరు శాస్త్రవేత్తలు గోధుమల నుంచి గ్లుటె న్ను తొలగించి.. ఆరోగ్యాన్నిచ్చే మరో రకమైన పదా ర్థాన్ని జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రక మైన జన్యుమార్పిడి గోధుమ కోసం రెండు బృం దాలు ప్రయత్నిస్తున్నాయి. స్పెయిన్‌లో కొత్త గోధుమ వంగడంపై పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఇంకోవైపు గోధుమల్లో మరింత ఎక్కువ పీచు పదార్థం ఉండేలా అభివృద్ధి చేస్తున్నారు. అనాస(పైనాపిల్) పండుకు రంగు పడింది! టమాటా పేరు చెప్పగానే ఎరుపు, పైనాపిల్ అనగానే పసుపు రంగు గుర్తుకొస్తాయి. కేన్సర్ నుంచి రక్షణ కల్పించే లక్షణమున్న లైకోపీన్ వల్ల టమాటాలకు ఆ ఎరుపుదనం వస్తుంది. దీంతో పైనాపిల్లోనూ అధిక మోతాదులో లైకోపీన్ అందేలా చేస్తే.. కేన్సర్‌ను మరింత సమర్థంగా ఎదుర్కోవచ్చని కొందరు శాస్త్రవేత్తలకు ఆలోచన వచ్చింది. దీంతో అధిక మొత్తంలో లైకోపీన్ ఉండేలా జన్యుమార్పిడి చేయడంతో.. సరికొత్తగా వంగపండు రంగులో నవనవలాడుతున్న పైనాపిల్ తయారైంది. కొవ్వు తక్కువ నూనెలు... కొవ్వు తగ్గితే ఆరోగ్యం మెరుగవు తుందని అందరికీ తెలుసు. అందుకే అమెరికాలోని క్యాలి క్స్ట్ సంస్థ జన్యు మార్పిడి టెక్నా లజీతో ఆవ నూనెలోని సంతృప్త కొవ్వులను సగానికి తగ్గించేసింది. సాధారణంగా ఆవ నూనెలో ఏడు శాతం వరకూ సంతృప్త కొవ్వులుంటే.. క్యాలిక్స్ట్ అభివృద్ధి చేసిన ఆవ నూనెలో మూడు శాతానికంటే తక్కువే ఉంటుంది. మరోవైపు ఆవ గింజల్లో మరింత ఎక్కువ ఒమేగా–3 కొవ్వులు ఉండేలా నేచర్ బయోటెక్నాలజీ, డౌ ఆగ్రో సైన్సెస్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అరటితో కంటికి మేలు.. ఉగాండాలో ‘మటోకే’ పేరుతో ఓ అరటిపండు రకం ఉంది. అక్కడి వాళ్లు ఇష్టంగా దానిని ‘వండు కుని’ తినేస్తూంటారు. శాస్త్ర వేత్తలు జన్యు మార్పిడి టెక్నాలజీ ద్వారా ఆ అరటిపండులో ప్రొవిటమిన్–ఏ ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేశారు. ఈ విటమిన్ సరిగా అందకపోతే కంటిచూపు సమస్యలు, అంధత్వం వస్తాయి. ఇప్పుడీ అరటిపండుతో అలాంటి సమస్య తొలగిపోయినట్టే మరి. ప్రస్తుతం ఈ కొత్త అరటిని ఉగాండాలో పరీక్షిస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2021 నాటికి అందరికీ అందుబాటులోకి రానుంది. బంగారు బియ్యం... చాలాకాలంగా గోల్డెన్ రైస్ గురించి వింటున్నా ఇప్పటì వరకూ మార్కెట్లోకి రాలేదు. విట మిన్ ఏ ఎక్కువగా ఉండే ఈ వరి వినియోగానికి పనికొస్తుందని ఆస్ట్రేలియా, న్యూజి ల్యాండ్, కెనడా ప్రకటించాయి. దీంతో త్వరలోనే ఈ బియ్యం అందరికీ అందుబాటులోకి రానున్నాయి. -
వ్యవసాయ పరిశోధనలకు మరో వెయ్యి కోట్లు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ♦ స్వామినాథన్ సిఫార్సులపై కేంద్రం సానుకూలంగా ఉందని స్పష్టీకరణ ♦ వ్యవసాయం లాభసాటిగా లేదని ఇక్రిశాట్ డీజీ ఆవేదన ♦ జన్యుమార్పిడి ప్రయోగాలు అవసరమన్న ఐకార్ డీడీజీ ♦ హైదరాబాద్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ వరి సదస్సు సాక్షి, హైదరాబాద్: వచ్చే కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పరిశోధనలకు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించేందుకు కృషిచేస్తానని... ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రూ.7 వేల కోట్లు పరిశోధనలకు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ హామీనిచ్చారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్ఆర్) సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వరి సదస్సు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రపంచ ఆహార భద్రతకు హామీయిచ్చేలా రైతులు వరి పండించాలని ఈ సదస్సులో ప్రసంగిస్తూ దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. రైతులకు కేవలం మద్దతు ధర ఇస్తే సరిపోదని... వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి ఎంతో కీలకమైన స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోందన్నారు. సిఫార్సులపై సానుకూలంగా ఉందన్నారు. దేశ విత్తన రాజధానిగా హైదరాబాద్ వెలుగొందుతుందని... వివిధ రాష్ట్రాలు, దేశాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నామని అన్నారు. గత 50 ఏళ్లలో ఐఐఆర్ఆర్ 1090 వరి హైబ్రీడ్ వంగడాలను తయారుచేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 95 శాతం హైబ్రీడ్ విత్తనాన్ని సరఫరా చేస్తోందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి ప్రపంచంలో వ్యవసాయం ఎక్కడా లాభసాటిగా లేదని ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్‌విన్సన్ ఆవేదన వ్యక్తంచేశారు. సదస్సులోనూ... ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగును లాభసాటిగా మార్చే ప్రధాన లక్ష్యంతో శాస్త్రవేత్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాధార భూముల్లో ఉత్పాదకత పెంచేలా కృషిచేయాలన్నారు. వరి ఉత్పత్తి ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచడమే కాకుండా పోషక విలువలు కలిగి ఉండేలా వరిని రూపొందించాలన్నారు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఫిలిఫ్పైన్స్) డెరైక్టర్ జనరల్ రాబర్ట్ జిగ్లర్ మాట్లాడుతూ రైతుకు లాభం కలిగించేలా పరిశోధనలు ఉండాలన్నారు. వ్యవసాయం ప్రమాదంతో కూడిన వ్యాపారం లాంటిందన్నారు. కరువు, వరదలను రెండింటినీ తట్టుకునే ఒకే రకమైన వంగడాన్ని కనుగొనాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. రైతులకు సాయపడేలా పరిశోధనలు ఉండాలని ఐకార్ కార్యదర్శి ఆర్.రాజగోపాల్ పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే 25 శాతం వరకు అదనంగా ఉత్పత్తి చేయగలరన్నారు. ఐకార్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (డీడీజీ) డాక్టర్ జె.ఎస్.సంధు మాట్లాడుతూ జన్యుమార్పిడి పంట ప్రయోగాలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. కొత్త పరిజ్ఞానం వచ్చినప్పుడు ఎంతోకొంత ప్రమాదం ఉంటుందన్నారు. జన్యు మార్పిడి పరీక్షల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశ అవసరాల దృష్ట్యా పరీక్షలు అవసరమన్నారు. మొదట్లో పత్తిలో బీటీ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాగే అనుకున్నారని... దాని ద్వారా పత్తి విస్తీర్ణం ఎంతో పెరిగిందన్నారు. గోల్డెన్ రైస్పైనా పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని ఆయన పేర్కొన్నారు. రెండో హరిత విప్లవానికి రోడ్‌మ్యాప్... ఐఐఆర్ఆర్ 50 ఏళ్లు పూర్తిచేసుకుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ వి.రవీంద్రబాబు అన్నారు. గత పదేళ్లలో ఆహారధాన్యాల రంగంలో స్తబ్ధత ఏర్పడిందన్నారు. రెండో హరిత విప్లవానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను తయారుచేస్తున్నామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నేపథ్యంలో తమ సంస్థ రెండ్రోజులపాటు సద్భావన యాత్రలు నిర్వహించిందని చెప్పారు.