
వ్యవసాయ పరిశోధనలకు మరో వెయ్యి కోట్లు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ
♦ స్వామినాథన్ సిఫార్సులపై కేంద్రం సానుకూలంగా ఉందని స్పష్టీకరణ
♦ వ్యవసాయం లాభసాటిగా లేదని ఇక్రిశాట్ డీజీ ఆవేదన
♦ జన్యుమార్పిడి ప్రయోగాలు అవసరమన్న ఐకార్ డీడీజీ
♦ హైదరాబాద్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ వరి సదస్సు
సాక్షి, హైదరాబాద్: వచ్చే కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ పరిశోధనలకు అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించేందుకు కృషిచేస్తానని... ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రూ.7 వేల కోట్లు పరిశోధనలకు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ హామీనిచ్చారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), భారత వరి పరిశోధన సంస్థ (ఐఐఆర్‌ఆర్) సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వరి సదస్సు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రపంచ ఆహార భద్రతకు హామీయిచ్చేలా రైతులు వరి పండించాలని ఈ సదస్సులో ప్రసంగిస్తూ దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. రైతులకు కేవలం మద్దతు ధర ఇస్తే సరిపోదని... వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని పేర్కొన్నారు.
వ్యవసాయరంగానికి ఎంతో కీలకమైన స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తోందన్నారు. సిఫార్సులపై సానుకూలంగా ఉందన్నారు. దేశ విత్తన రాజధానిగా హైదరాబాద్ వెలుగొందుతుందని... వివిధ రాష్ట్రాలు, దేశాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నామని అన్నారు. గత 50 ఏళ్లలో ఐఐఆర్‌ఆర్ 1090 వరి హైబ్రీడ్ వంగడాలను తయారుచేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం 95 శాతం హైబ్రీడ్ విత్తనాన్ని సరఫరా చేస్తోందన్నారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి
ప్రపంచంలో వ్యవసాయం ఎక్కడా లాభసాటిగా లేదని ఇక్రిశాట్ డెరైక్టర్ జనరల్ డేవిడ్ బెర్గ్‌విన్సన్ ఆవేదన వ్యక్తంచేశారు. సదస్సులోనూ... ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగును లాభసాటిగా మార్చే ప్రధాన లక్ష్యంతో శాస్త్రవేత్తలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాధార భూముల్లో ఉత్పాదకత పెంచేలా కృషిచేయాలన్నారు. వరి ఉత్పత్తి ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచడమే కాకుండా పోషక విలువలు కలిగి ఉండేలా వరిని రూపొందించాలన్నారు. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఫిలిఫ్పైన్స్) డెరైక్టర్ జనరల్ రాబర్ట్ జిగ్లర్ మాట్లాడుతూ రైతుకు లాభం కలిగించేలా పరిశోధనలు ఉండాలన్నారు. వ్యవసాయం ప్రమాదంతో కూడిన వ్యాపారం లాంటిందన్నారు.
కరువు, వరదలను రెండింటినీ తట్టుకునే ఒకే రకమైన వంగడాన్ని కనుగొనాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. రైతులకు సాయపడేలా పరిశోధనలు ఉండాలని ఐకార్ కార్యదర్శి ఆర్.రాజగోపాల్ పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే 25 శాతం వరకు అదనంగా ఉత్పత్తి చేయగలరన్నారు. ఐకార్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ (డీడీజీ) డాక్టర్ జె.ఎస్.సంధు మాట్లాడుతూ జన్యుమార్పిడి పంట ప్రయోగాలను వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. కొత్త పరిజ్ఞానం వచ్చినప్పుడు ఎంతోకొంత ప్రమాదం ఉంటుందన్నారు. జన్యు మార్పిడి పరీక్షల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దేశ అవసరాల దృష్ట్యా పరీక్షలు అవసరమన్నారు. మొదట్లో పత్తిలో బీటీ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాగే అనుకున్నారని... దాని ద్వారా పత్తి విస్తీర్ణం ఎంతో పెరిగిందన్నారు. గోల్డెన్ రైస్‌పైనా పరిశోధనలు జరుగుతున్న విషయాన్ని ఆయన పేర్కొన్నారు.
రెండో హరిత విప్లవానికి రోడ్‌మ్యాప్...
ఐఐఆర్‌ఆర్ 50 ఏళ్లు పూర్తిచేసుకుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ వి.రవీంద్రబాబు అన్నారు. గత పదేళ్లలో ఆహారధాన్యాల రంగంలో స్తబ్ధత ఏర్పడిందన్నారు. రెండో హరిత విప్లవానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను తయారుచేస్తున్నామన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నేపథ్యంలో తమ సంస్థ రెండ్రోజులపాటు సద్భావన యాత్రలు నిర్వహించిందని చెప్పారు.