దొంగల బండి
రాంగ్ రూట్లలోనే వెళుతుందండి!
మెక్సికో సిటీలోకి కొత్తగా ఈ దొంగల బండి వచ్చింది! దీని పేరు ‘కరెప్టూర్’ (కరెప్ట్ + టూర్). దీన్నెక్కి కూర్చుంటే మెక్సికో సిటీలోని అందమైన సందర్శనీయ స్థలాలను చూడనే చూడలేం. అసలీ బండి అటువైపే వెళ్లనివ్వదు. దీని రూటే సపరేటు! రాంగ్ రూట్లో వెళుతుంది. అంటే అడ్డదిడ్డంగా, వన్ వేలలో వెళుతుందని కాదు. సిటీలోని రాంగ్ ప్లేసెస్‌లోకి వెళుతుంది. రాంగ్ టూర్ అన్నమాట. విషయం ఏంటంటే.. మెక్సికో సిటీలోని కరెప్టెడ్ ఏరియాస్‌కి ఇది మనల్ని తిప్పుతుంది. ఇదిగో ఇక్కడే ఆ మర్డర్ జరిగింది, అక్కడుంది చూశారా.. ఆ బిల్డింగ్‌లోనే కోట్ల డాలర్ల స్కామ్ జరిగింది, ఇక ఇది.. అక్రమ రవాణా అడ్డా, అదేమో చీకటి పనుల ప్రధాన కేంద్రం.. ఇలా మెక్సికో ప్రతిష్టను దెబ్బతీస్తున్న 27 పాడు సైట్లకు ఈ దొంగల బండి మనల్ని తిప్పుతుంది. దారి మధ్యలో కూడా ఆపి ఎక్కొచ్చు. వెంకన్న దర్శనానికి మెల్లిగా కదులుతున్న క్యూలో.. మధ్యమధ్య ‘గోవిందా.. గోవిందా’ అని భక్తులు గోవింద జపం చేస్తుంటారు కదా.
అదే విధంగా రోడ్డు మీద ఈ బండి వెళుతున్నప్పుడు పక్క వాహనాల వాళ్లు ‘నో మోర్ కరప్షన్... నో మోర్ కరప్షన్’ అని గట్టిగా స్లోగన్స్ ఇవ్వాలని ఈ దొంగల బండి ఆపరేటర్లు ఉత్సాహపరుస్తుంటారు. లోపల కూర్చున్నవాళ్లు కూడా మూవింగ్‌లో అరుచుకుంటూ వెళ్లొచ్చు. విరాళాలు పోగేసి, 5000 డాలర్లతో ఈ వాహనాన్ని తయారు చేశారు. అవినీతి ప్రదేశాల వివరాలను బండిపై పెయింట్ చేశారు. దీన్నింకా ఆకర్షణీయంగా డెవలప్ చేస్తారట. మెక్సికోలో దాపరికాలు ఉండవు అని చాటి చెప్పడం ఈ కరెప్టూర్ ఉద్దేశం. ఇటీవలే విడుదలైన 2016 పారదర్శక సూచిక (ట్రాన్స్పరెన్సీ ఇండెక్స్)లో మొత్తం 176 దేశాలలో మెక్సికో 123వ స్థానంలో నిలిచింది. దాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం కావచ్చు ఈ కరెప్టూర్!
మెక్సికో సిటీ రోడ్లపై కరెప్టూర్; (ఇన్సెట్) : నగర సందర్శకులు