నిద్రమత్తు వీడిన వాణిజ్యపన్నుల శాఖ
కర్ణాటక సరిహద్దుల్లో 8 రవాణా ట్రక్కుల సీజ్
హైదరాబాద్‌లోని అక్రమ గోడౌన్లు, ట్రాన్స్‌పోర్టు కంపెనీలపైనా దాడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ నిద్రమత్తు వీడింది. దొంగ బిల్లులతో తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్రం మీదుగా ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న సరుకును అరికట్టే చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇటీవలే వాణిజ్యపన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిసెంబర్ 29న జరిపిన సమీక్ష సమావేశంలో అధికార యంత్రాంగానికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో జీరో వ్యాపారంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల మీదుగా పక్క రాష్ట్రాలకు తరలివెళ్తున్న ట్రక్కులపై దాడులు జరపుతున్నారు.
ఈ మేరకు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు. బుధవారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం జాయింట్ కమిషనర్ రేవతి రోహిణి నేతృత్వంలో అసిస్టెంట్ కమిషనర్లు దీప్తి, రాజేశ్‌కుమార్‌లు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లోని కర్ణాటక సరిహద్దుల్లో దాడులు జరిపి తప్పుడు వేబిల్లులతో అంతర్రాష్ట సరకు రవాణా చేస్తున్న 8 లారీలను సీజ్ చేశారు. రూ. లక్షల విలువైన స్టీల్, కందిపప్పు, పంచదార తదితరాలను తరలిస్తున్న లారీ లకు సంబంధించి అన్నీ దొంగబిల్లు లే కనిపించాయి.
ఛత్తీస్‌గఢ్ వేబిల్లులతో హైదరాబాద్‌కు తరలుతున్న లారీ లతో పాటు హైదరాబాద్ నుంచి కర్ణాటక, మహారాష్ట్రలకు వెళుతున్న లారీలను సీజ్ చేసి కొడంగల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇటీవల హైదరాబాద్‌లోని బేగంపేటలో అక్రమంగా నిర్వహిస్తున్న గోదాములపై దాడులు జరిపి రూ.కోటీ ఇరవై లక్షల విలువైన సరకులను సీజ్ చేశారు. తద్వారా సెక్యూర్ డిపాజిట్ కింద రూ. 17.46 లక్షలు వసూలు చేశారు. చార్మినార్‌లోని కొన్ని ట్రాన్స్‌పోర్టు కంపెనీలపై దాడులు చేసి రూ. 21 లక్షలు ట్యాక్స్ రూపంలో, మరో రూ.20 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ విభాగం జాయింట్ కమిషనర్ రేవతి రోహిణి ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా దాడులు జరుపుతున్నామని, అక్రమ సరుకు రవాణా, జీరో వ్యాపారాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.