మనోళ్లు ముంబైకి... బీహారీయులు హైదరాబాద్‌కు
సిటీ బస్సుల నిర్వహణపై
అధ్యయనం పేరిట పర్యటనలు
ఇటీవలే ముంబై వెళ్లొచ్చిన తెలంగాణ బృందం
హైదరాబాద్‌లో పరిశీలన కోసం
నేడు బీహార్ బృందం రాక
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సుల తీరు అస్తవ్యస్తంగా ఉందని, ట్రాఫిక్ గందరగోళంగా ఉందని కొద్దిరోజుల క్రితం ఇక్కడి మంత్రులు, అధికారుల బృందం ముంబైలో అధ్యయనం చేయడానికి వెళితే... హైదరాబాద్‌లో ఆర్టీసీ సిటీ బస్సుల నిర్వహణ బాగుందంటూ బీహార్ మంత్రి, అధికారుల బృందం బుధవారం ఇక్కడకు వస్తోంది. దేశంలోనే మంచి రోడ్డు రవాణా సంస్థగా పేరొందిన ఏపీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నగరంలో గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. దీంతో బస్సుల నిర్వహణ, ప్రయాణికులకు వసతులు, ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, జీపీఎస్ వంటి ఆధునిక వ్యవస్థల సేవలు పొందే విషయాల్లో ముంబై ఆదర్శంగా ఉందంటూ దాన్ని అధ్యయనం చేసేందుకు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఆర్టీసీ, ఆర్టీఏ, పోలీసు విభాగాల ఉన్నతాధికారులు ఈనెల 21, 22 తేదీల్లో ముంబైలో పర్యటించి వచ్చారు.
అక్కడి వ్యవస్థ బాగా ఉందని గుర్తించి వాటిని హైదరాబాద్‌లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పనుల్లో వారు బిజీగా ఉండగా హైదరాబాద్‌లో సిటీ బస్సుల నిర్వహణను పరిశీలించేందుకు బుధవారం తన ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి బృందం వస్తుందంటూ బీహార్ రవాణాశాఖ మంత్రి రామై రామ్ నుంచి సోమవారం ప్రభుత్వానికి లేఖ అందింది. దీంతో అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేశారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డితో బీహార్ బృందం భేటీ ఏర్పాటుచేశారు.