శిక్ష పడేనా?
* ట్రాన్స్‌కో స్టోర్‌లో కాపర్,అల్యూమినియం మాయం
* నేడు విచారణకు రానున్న ఎస్ఈ
* గతంలోనే నలుగురు అధికారుల సస్పెన్షన్
* సిబ్బంది, అధికారులలో చర్చ
నిజామాబాద్ నాగారం: ట్రాన్స్‌కో స్టోర్‌లో లక్షల రూపాయల విలువ చే సే కాపర్, అల్యూమినియం మాయమైంది. ఏడు నెల ల క్రితం ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు సస్పెండ్ అ య్యారు. శుక్రవారం ఎస్ఈ విచారణకు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ కుంభకోణం ట్రాన్స్‌కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షిస్తారా.. బయట పడేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే, ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులలో వెలువడిన కాపర్, అల్యూమినియంను అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు స్టోర్ రూమ్‌కు అప్పజెప్పి రసీదు తీసుకోవాలి.
అప్పుడే మరమ్మతులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తారు. అయితే కాంట్రాక్టర్లు కాపర్, అల్యూమినియంను స్టోర్‌రూమ్‌కు అందజేయకున్నప్పటికీ ముట్టజెప్పినట్లుగా రశీదు తీసుకున్నారు. కాంట్రాక్టర్లకు, అధికారుల మధ్య అవగాహన ప్రకారమే ఈ తతంగం చా లా రోజులుగా కొనసాగినట్లు తెలిసింది. కాపర్‌ను బయటే అమ్ముకుని డబ్బులను పంచుకునేవారు. ఈ క్రమంలో 2011-12లో నిజామాబాద్‌లోని స్టోర్ ఏఈగా పని చేస్తున్న శ్రీహరి బదిలీపై కరీంనగర్ జిల్లాకు వెళ్లారు. జిల్లాలోని నవీ పేట మండలం ఏఈగా పని చేస్తున్న ప్రశాంత్‌రెడ్డికి స్టోర్ ఏఈగా బదీలీ చేశారు. బాధ్యతలు తీసుకునే సమయంలో రికార్టులు అన్నీ సరి చూసుకుంటుండగా కాపర్, అల్యుమిని యం స్టాక్ తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీంతో బాధ్యత లు తీసుకోవడానికి ప్రశాంత్‌రెడ్డి నిరాకరించారు.
ఒప్పందం ప్రకారం
విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం, కరీంనగర్ స్టోర్ ఏడీఈ ప్రకాశం, నిజామాబాద్ స్టోర్ ఏడీఈగా పనిచేస్తున్న రఘుకుమార్ రంగంలోకి దిగి, శ్రీహరి,ప్రశాంత్‌రెడ్డి మధ్య ఒప్పందం కుదిర్చారు. ఈ మేరకు శ్రీహరి రూ.10 లక్షలు ఇవ్వాలి. దీంతో పూర్తి బాధ్యత ప్రశాంత్‌రెడ్డి తీసుకుంటారు. ఒప్పందం ప్రకారం ముందుగా రూ.5 లక్షలు ప్రశాంత్ రెడ్డికి ముట్టాయి. ఇప్పటి వరకు కథ బాగానే నడిచింది. మిగతా రూ. 5 లక్షల చెల్లింపులో తీవ్ర జ్యాపం జరగడంతో ఇద్దరి మధ్య రగడ మొదలైంది. మళ్లీ కరీంనగర్ ఏడీఈ, నిజామాబాద్ స్టోర్ ఏడీఈ, ఏఈ శ్రీహరి, ఏఈ ప్రశాంత్‌రెడ్డి సమావేశ మయ్యారు. శ్రీహరి మరో రూ.2 లక్షలు ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టర్ అకౌంట్లోకి పంపించారు. ఈలోగా ఇక్కడ స్టోర్ ఏడీఈగా పని చేస్తున్న రఘుకుమార్ కామారెడ్డికి బదీలీపై వెళ్లారు.
దోమకొండలో పనిచేస్తున్న ఏడీఈ వెంకటరమణ స్టోర్ ఏడీఈగా బదీలీపై వచ్చారు. దీంతో కొత్తగా వచ్చిన ఏడీఈకి సదరు కాంట్రాక్టర్ తన అకౌంట్లోకి రూ. రెండు లక్షలు ఏవిధంగా వచ్చాయో చెప్పాడు. స్టోర్ ఏడీఈ బాధ్యతలు తీసుకున్నప్పుడు అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయని సంతకం పెట్టిన వెంకటరమణ, తనకు అందాల్సిన వాటా రాకపోవడంతో అప్పటి ఎస్ఈకి విషయాన్ని చేరవేశారు. అప్పటికే దీనిపై ‘సాక్షి’ లో వరుస కథనాలు రావడంతో ఎస్ఈ విషయాన్ని సీఏండీ దృషికి తీసుకెళ్లారు. వెంటనే నలుగురు ఏఈలు, ఏడీలు, అనంతరం స్టోర్ ఏఈ సస్పెండయ్యారు.
విచారణను నిలిపేందుకు యత్నాలు
ఇదే విషయంలో వెనువెంటనే విచారణ చేయిస్తే మరింత మంది అధికారులు, కాంట్రాక్టర్లు బయటకు వస్తారని తెలి సింది. దీంతో అక్రమాల్లో భాగస్వాములు ఉన్నవారు విచారణను నిలిపేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇంత పెద్దమొత్తంలో కుంభకోణం జరగడం, ఇందులో కేవలం అధికారులను బలి చేయడం జరిగిపోయింది. కాంట్రాక్టర్లు తప్పు లు చేసినట్లు తెలిసినా అప్పటి ఎస్ఈ వారి పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టలేదు. వారిని వెనకేసుకు వచ్చారు. దీంతో సద రు కాంట్రాక్టర్లు అందుకు కానుకగా ఒక ఏసీని, ఒక టీవీ, విలువైన పర్నిచర్‌ను కార్యాలయానికి అందజేశారని సమాచారం. దీంతో పెద్దసారు సంతృప్తి చెంది వారిని ఏమీ అనలేదు. ఎస్ఈ బదీలీ అయ్యేంత వరకు అక్కడే ఉన్న టీవీ, మ రికొన్ని వస్తువులు కొత్త ఎస్ఈ వచ్చేలోగా మాయం చేశారు.
నేడు విచారణలో ఏం జరుగుతుందో..
వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి ఎస్ఈ శుక్రవారం జిల్లాకు రానున్నారు. స్టోర్ ఏడీఈగా ఉన్న వెంకటరమణ, కామారెడ్డి ఎడీఈ రఘుకుమార్, కరీంనగర్ ఏఈ శ్రీ హరి, సస్పెండ్ అయిన ఏఈ ప్రశాంత్‌రెడ్డిపై విచారిస్తారు. అసలు ఏం జరిగింది. ఎంత మొత్తంలో అక్రమాలు జరి గాయి అన్ని విషయాలు తెలియాల్సి ఉంది. విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం లేకపోలేదు.