కృష్ణపట్నం పోర్టు టు సింగపూర్...
కంటైనర్ల రవాణా ప్రారంభం
ముత్తుకూరు(సర్వేపల్లి): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంపోర్టు నుంచి సరాసరి సింగపూరుకు కంటైనర్ల రవాణా చేయడం వల్ల ఎంతో ఖర్చు, సమయం ఆదా అవుతుందని కృష్ణపట్నంపోర్టు సీఈఓ అనీల్ ఎండ్లూరి పేర్కొన్నారు. పోర్టు నుంచి సింగపూరు, మలేషియా, దక్షిణ కొరియా పాస్ట్ ఈస్ట్, సౌత్ ఈస్ట్‌లకు సరాసరి ప్రయాణించే ‘హుండాయ్ ప్రిస్టేజ్–039’ నౌకను శుక్రవారం పోర్టులో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పోర్టు సీఈఓతో పాటు హెచ్ఎంఎం మేనేజింగ్ వైడీ పార్క్‌తో కలసి ఆయన కేక్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సీఈఓ అనీల్ ఎండ్లూరి మాట్లాడుతూ పోర్టు నుంచి చైనా, మలేసియా, సింగపూరు, సౌత్‌కొరియాలకు నేరుగా సరుకుల రవాణా చేయడం వల్ల ఎగుమతి–దిగుమతుల కార్యకలాపాలు పెరుగుతాయన్నారు.
4 లక్షల కంటైనర్ల ఎగుమతి–దిగుమతి లక్ష్యం
గత సంవత్సరం పోర్టు నుంచి 1.18 కంటైనర్ల ఎగుమతి–దిగుమతులు జరిగాయని సీఈఓ పేర్కొన్నారు. ఈ సంవత్సరం 2.40 లక్షలకు పెరిగిందని తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో 4 లక్షల కంటైనర్ల ఎగుమతి–దిగుమతి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వల్ల పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కస్టమ్స్ జాయింట్ కమిషనర్ రామ్మోహన్రావు, కేపీసీటీ సీఓఓ జితేంద్ర పాల్గొన్నారు.