Transportation Services
-
రవాణా సేవలకూ ‘ఆధార’మే!
ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ నిర్ణయం - మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కూడా.. నేటి నుంచే అమల్లోకి.. - వాహనం రిజిస్ట్రేషన్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్ వరకు.. - అన్ని రకాల సేవలకూ వర్తింపు సాక్షి, హైదరాబాద్: మీ వాహనం రిజిస్ట్రేషన్ కావాలా.. యాజమాన్యం మార్పు జరగాలా.. డ్రైవింగ్ లైసెన్సు కావాలా.. అయితే ఆధార్ కార్డు ఉండాల్సిందే. తమ పరిధిలోని అన్ని సేవలను ఆధార్‌తో అనుసంధానిస్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే ఇది అమల్లోకి వస్తోంది. అంటే ఇక నుంచి ఆధార్‌కార్డు ఉంటేనే రవాణా శాఖ సేవలు పొందే అవకాశం ఉంటుంది. నేటి నుంచే.. ప్రభుత్వపరంగా ప్రతి లావాదేవీకి ఆధార్‌ను తప్పనిసరి చేయాలని కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, విభాగాలకు సూచించింది కూడా. ఈ క్రమంలో రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్, లైసెన్సుల జారీ, యాజమాన్య హక్కు బదలాయింపు, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ తదితర రవాణా సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దాంతో రవాణా సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా అమలు చేయడానికి రవాణా శాఖ వెనకడుగు వేసింది.ఇలా రెండు సార్లు జరిగింది. తాజాగా మళ్లీ రవాణా శాఖ సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని వెంటనే అంటే బుధవారం నుంచే అమల్లోకి తెచ్చింది. వన్‌టైం పాస్వర్డ్ కూడా.. ప్రతి లావాదేవీకి వన్‌టైం పాస్వర్డ్ (ఓటీపీ) విధానాన్ని కూడా అమలుచేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. రవాణా శాఖ సేవలు పొందేటప్పుడు కొంతమంది తప్పుడు ఫోన్ నంబర్లను పొందుపరుస్తున్నారని.. దాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రఘునాథ్ తెలిపారు. ఏదైనా సేవ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే.. అందులో పేర్కొన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుందని, దానిని నమోదు చేస్తేనే దరఖాస్తును పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. ఆధార్ నంబర్‌ను అనుసంధానించాలని, తప్పుడు ఫోన్ నంబర్ నమోదు కాకుండా ఓటీపీ విధానాన్ని అమలు చేయాలని పోలీసు శాఖ కూడా కోరడంతో రవాణా శాఖ ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇటీవల రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించేవారికి పెనాల్టీ పాయింట్ల విధింపును చేపట్టిన విషయం తెలిసిందే. నిర్ధారిత మొత్తానికి పాయింట్లు చేరుకుంటే.. ఏడాదిపాటు డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయా లని నిర్ణయించారు. కానీ దీనికి సంబంధించి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి ని అధిగమించేందుకు పోలీసు శాఖ ఆధార్, ఓటీపీ విధానంపై దృష్టి సారించింది. -
ఇక ఆన్లైన్లో ‘రవాణా’ సేవలు
♦ డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ సహా 15 రకాల పౌరసేవలు ఆన్లైన్లోనే ♦ మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం ♦ ఈసేవ, ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా బుకింగ్ ♦ ఆర్టీఏ కార్యాలయాల్లోనూ నమోదుకు అవకాశం సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్సు కోసం లేదా వాహన రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన పనిలేదు. ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో ఈ సేవలను పొందేందుకు రవాణా శాఖ అవకాశం కల్పిస్తోంది. మధ్యవర్తులు, ఏజెంట్ల ప్రమేయం లేకుండా రవాణా శాఖ అందజేసే 15 రకాల పౌరసేవలను నేరుగా పొందేందుకు వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా నమోదు చేసుకునే సదుపాయం ఉంటుంది. రవాణా సేవలను పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. చాంద్రాయణగుట్టలో నిర్మించిన ఆర్టీఏ దక్షిణ మండలం నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆన్లైన్ సేవలను వీరు లాంఛనంగా ప్రారంభించారు. వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా సత్వరమే పౌరసేవలను పొందేందుకు ఈ సదుపాయం దోహదం చేస్తుందని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా ఇక నుంచి వాహనదారులు డ్రైవింగ్ లెసైన్స్, వాహనాలకు సంబంధించిన సేవలను పొందేందుకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన పౌర సేవలను అందజేసేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టామని, వాహనదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా సూచించారు. ఆన్లైన్ నమోదు ఎలా.. ► ఇంటర్నెట్ ఉంటే ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఈసేవా కేంద్రాలకు, ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. 24 గంటల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ► ట్రాన్స్పోర్ట్డాట్తెలంగాణడాట్జీవోవీడాట్ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే.. కుడివైపున ‘ఫర్ ఆన్లైన్ సర్వీసెస్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ‘ఆన్లైన్ లెసైన్స్ ట్రాన్సాక్షన్స్’ ‘ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్’ అనే ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో వినియోగదారులు తమకు కావలసింది ఎంపిక చేసుకోవచ్చు. అందులో కావలసిన సేవలను వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు. ► నమోదు చేసుకున్న వెంటనే వినియోగదారుల సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. సర్వీసును పొందేందుకు ఆర్టీఏ కార్యాలయానికి రావలసిన తేదీ, సమయం, తీసుకురావాల్సిన పత్రాల వివరాలు, వినియోగదారుడికి కేటాయించిన ట్రాన్సాక్షన్ నంబర్ అందులో ఉంటాయి. ► ఆన్లైన్లో నమోదు చేసుకున్న 24 గంటలలోపు నెట్‌బ్యాంకింగ్, ఈసేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఆన్లైన్లో లభించే సేవలు డ్రైవింగ్ లెసైన్సుకు సంబంధించి.. 1) డ్రైవింగ్ లెసైన్స్ రె న్యువల్ 2) డూప్లికేట్ లెసైన్స్ 3) ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్ 4) బ్యాడ్జ్ 5) డ్రైవింగ్ లెసైన్స్‌లో చిరునామా మార్పు 6) డ్రైవింగ్ లెసైన్సు రద్దు వాహనానికి సంబంధించి.. 7) హైర్‌పర్చేజ్ అగ్రిమెంట్ (వాహనాలపై రుణ ఒప్పందం) 8) హైర్‌పర్చేజ్ టెర్మినేషన్(రుణం రద్దు) 9) వాహన యాజమాన్య బదిలీ 10) డూప్లికేట్ ఆర్సీ 11) ఆర్సీ రన్యువల్(పునరుద్ధరణ) 12) చిరునామా మార్పు 13)ఆల్టరేషన్ ఆఫ్ వెహికల్ 14) ఎన్ఓసీ జారీ (నిరభ్యంతర పత్రం) 15) నిరభ్యంతర పత్రం రద్దు -
చెన్నై మళ్లీ చిత్తడి!
ఆదివారం రోజంతా కురిసిన వాన..రోడ్లన్నీ జలమయం ♦ నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి ♦ రెండ్రోజులపాటు వర్షాలు: వాతావరణశాఖ వెల్లడి ♦ సహాయ కార్యక్రమాలకు ఆటంకంగా వాన చెన్నై నుంచి నందగోపాల్, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరం కోలుకుంటోంది.. కుదుటపడుతోంది.. అనే మాటలు వినిపిస్తున్నా స్థానికుల్లో మాత్రం ఆ భావన కనిపించడంలేదు. తామెప్పటికి కోలుకుంటామో కూడా చెప్పలేకపోతున్నారు. ఇల్లు.. వీధి అనే తేడాలేదు అంతటా మురుగే. వరదకు కొట్టుకొచ్చిన చెత్తాచెదారం అలాగే పడిఉంది. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 500 మంది మృతిచెంది ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితిలో ఆదివారం మళ్లీ రోజంతా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ మళ్లీ జలమయమయ్యాయి. ఒక్కొక్కటిగా సేవలు పునరుద్ధరిస్తున్నా.. అన్నిచోట్లా జనం బారులు తీరుతున్నారు. లగ్జరీగా బతికినవాళ్లుసైతం తాగునీరు, ఆహారం కోసం ఇప్పటికీ సహాయబృందాల వద్ద చేయిచాస్తున్నారు. నగరం నుంచి మరోచోటుకు వెళ్లడానికి బస్సు, రైలు, విమానసేవలు మొదలుకావడం కొంత ఊరటనిస్తోంది. కాగా నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడన ద్రోణి ఏర్పడనుందనే వార్త తమిళనాడుతోపాటు పుదుచ్చేరివాసులను కలవరానికి గురిచేస్తోంది. దీనికారణంగా రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. చురుగ్గా సహాయ కార్యక్రమాలు.. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది చురుగ్గా పాల్గొంటోంది. మొత్తం 50 బృందాలుగా విడిపోయి నగరవ్యాప్తంగా సాయమందిస్తున్నాయి. ఇప్పటిదాకా దాదాపు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 50 వేల ఆహారపదార్థాల పొట్లాలు, మరో 50 వేల నీళ్ల సీసాలను బాధితులకు సరఫరా చేశాయి. ఎన్డీఆర్ ఎఫ్ వైద్య బృందాలు 200 మందిని ప్రాణాపాయం నుంచి బయటపడేశాయి. కాగా నగరవ్యాప్తంగా 1,27,580 మంది 114 పునరావాసకేంద్రాల్లోనే గడుపుతున్నారు. ఇప్పటికిప్పుడు తాగునీరు అందించలేం: చెన్నై కార్పొరేషన్ వరదల కారణంగా సర్వం కోల్పోయిన నగరవాసులకు కనీసం తాగునీటిని అందించే పరిస్థితి కూడా లేదని చెన్నై కార్పొరేషన్ నిస్సహాయతను వ్యక్తం చేస్తోంది. అందుబాటులో ఉంచిన తాగునీరు మొత్తం కలుషితమైందని, నీటిని శుద్ధిచేసే వ్యవస్థ కూడా దెబ్బతిన్నందున ఇప్పటికిప్పుడు మంచినీటిని అందించే పరిస్థితి లేదని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక అధికారులు సహకరించడంలేదు: ఆర్మీ సహాయచర్యల కోసం కేంద్రప్రభుత్వం మరిన్ని విపత్తు సహాయక బృందాలను, ఆర్మీ, వైమానిక సిబ్బందిని నగరానికి పంపింది. విమానం దిగిన బృందాలు నగరంలోని ఏ ప్రాంతానికి వె ళ్లాలో, ఎక్కడ తమ సాయం అవసరమో చెప్పేవారు లేక దాదాపు ఐదారుగంటలు సహాయకచర్యల్లో పాల్గొనలేకపోయారు. ఆ తర్వాత టీనగర్‌కు చేరుకున్నాక కూడా స్థానిక అధికారుల నుంచి వారికి ఎటువంటి సహకారమూ అందలేదు. వారే చొరవ తీసుకొని వెళ్లి అడిగినా అధికారుల నుంచి సరైన స్పందన రాలేదు. స్థానిక అధికారుల తీరుపై ఆర్మీ అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వరద బీభత్సానికి స్తంభించిన రవాణా సేవలు కాస్త ఊపందుకున్నాయి. నగరవ్యాప్తంగా ఉచిత బస్సుసేవలు కొనసాగుతుండగా సోమవారం నుంచి అన్ని రైళ్లను పునరుద్ధరించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.