ఇక ఆన్‌లైన్‌లో ‘రవాణా’ సేవలు
♦ డ్రైవింగ్ లెసైన్స్, రిజిస్ట్రేషన్ సహా 15 రకాల పౌరసేవలు ఆన్‌లైన్‌లోనే
♦ మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
♦ ఈసేవ, ఇంటర్నెట్ కేంద్రాల ద్వారా బుకింగ్
♦ ఆర్టీఏ కార్యాలయాల్లోనూ నమోదుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: డ్రైవింగ్ లెసైన్సు కోసం లేదా వాహన రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడాల్సిన పనిలేదు. ఇంటి దగ్గర నుంచే ఆన్‌లైన్‌లో ఈ సేవలను పొందేందుకు రవాణా శాఖ అవకాశం కల్పిస్తోంది. మధ్యవర్తులు, ఏజెంట్‌ల ప్రమేయం లేకుండా రవాణా శాఖ అందజేసే 15 రకాల పౌరసేవలను నేరుగా పొందేందుకు వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈసేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్‌ల నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్టీఏ కార్యాలయాల్లో కూడా నమోదు చేసుకునే సదుపాయం ఉంటుంది. రవాణా సేవలను పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీఆర్‌తో కలసి మంగళవారం ప్రారంభించారు. చాంద్రాయణగుట్టలో నిర్మించిన ఆర్టీఏ దక్షిణ మండలం నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆన్‌లైన్ సేవలను వీరు లాంఛనంగా ప్రారంభించారు.
వాహనదారులు ఆర్టీఏ కార్యాలయాల్లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా సత్వరమే పౌరసేవలను పొందేందుకు ఈ సదుపాయం దోహదం చేస్తుందని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా ఇక నుంచి వాహనదారులు డ్రైవింగ్ లెసైన్స్, వాహనాలకు సంబంధించిన సేవలను పొందేందుకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన పౌర సేవలను అందజేసేందుకు ఆన్‌లైన్ సదుపాయాన్ని ప్రవేశపెట్టామని, వాహనదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా సూచించారు.
ఆన్‌లైన్ నమోదు ఎలా..
► ఇంటర్నెట్ ఉంటే ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఈసేవా కేంద్రాలకు, ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. 24 గంటల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
► ట్రాన్స్‌పోర్ట్‌డాట్‌తెలంగాణడాట్‌జీవోవీడాట్‌ఇన్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే.. కుడివైపున ‘ఫర్ ఆన్‌లైన్ సర్వీసెస్’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే.. ‘ఆన్‌లైన్ లెసైన్స్ ట్రాన్సాక్షన్స్’ ‘ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్’ అనే ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో వినియోగదారులు తమకు కావలసింది ఎంపిక చేసుకోవచ్చు. అందులో కావలసిన సేవలను వినియోగదారులు బుక్ చేసుకోవచ్చు.
► నమోదు చేసుకున్న వెంటనే వినియోగదారుల సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ వస్తుంది. సర్వీసును పొందేందుకు ఆర్టీఏ కార్యాలయానికి రావలసిన తేదీ, సమయం, తీసుకురావాల్సిన పత్రాల వివరాలు, వినియోగదారుడికి కేటాయించిన ట్రాన్సాక్షన్ నంబర్ అందులో ఉంటాయి.
► ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న 24 గంటలలోపు నెట్‌బ్యాంకింగ్, ఈసేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఆన్‌లైన్‌లో లభించే సేవలు
డ్రైవింగ్ లెసైన్సుకు సంబంధించి..
1) డ్రైవింగ్ లెసైన్స్ రె న్యువల్
2) డూప్లికేట్ లెసైన్స్
3) ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్ 4) బ్యాడ్జ్ 5) డ్రైవింగ్ లెసైన్స్‌లో చిరునామా మార్పు 6) డ్రైవింగ్ లెసైన్సు రద్దు
వాహనానికి సంబంధించి..
7) హైర్‌పర్చేజ్ అగ్రిమెంట్ (వాహనాలపై రుణ ఒప్పందం)
8) హైర్‌పర్చేజ్ టెర్మినేషన్(రుణం రద్దు)
9) వాహన యాజమాన్య బదిలీ
10) డూప్లికేట్ ఆర్‌సీ
11) ఆర్‌సీ రన్యువల్(పునరుద్ధరణ)
12) చిరునామా మార్పు
13)ఆల్టరేషన్ ఆఫ్ వెహికల్
14) ఎన్‌ఓసీ జారీ (నిరభ్యంతర పత్రం)
15) నిరభ్యంతర పత్రం రద్దు