breaking news
travels buses
-
హైదరాబాద్‌లో ట్రావెల్స్ బస్సులు, వాహనాల తనిఖీలు.. చలాన్లు చెల్లిస్తేనే అనుమతి..
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ రవాణాశాఖ(Telangana Transport Department) అధికారులు అలర్ట్ అయ్యారు. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. డ్రంకన్ డ్రైవ్, బీమా, ఫిట్నెస్, పర్మిట్ పత్రాలు, బస్సు లోపల భద్రతను పరిశీలించారు. పర్మిట్ లేకుండా వెళ్తున్న బస్సులపై, నిబంధనలు పాటించని పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నడుపుతున్న ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.మరోవైపు.. కూకట్పల్లి, హయత్‌నగర్, ఎల్బీనగర్ పరిధిలో కూడా ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, క్యాబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే వాహనాలపై ఉన్న చలాన్లను పోలీసులు వసూలు చేస్తున్నారు. చలాన్లను చెల్లిస్తేనే వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇస్తున్నారు. అలాగే, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రవాణాశాఖ అధికారుల తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోనున్నారు. ఆరు ప్రత్యేక టీమ్‌లతో అధికారులు తనిఖీలు చేపట్టనున్నారు.కాగా, కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత బస్సు దాన్ని 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందారు. అయితే.. ప్రమాదానికి అనేక కారణాలు ఉన్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చారు. బస్సులో అనేక లోపాలు ఉన్నాయని కూడా తేలింది. దీంతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద ఆర్టీఏ అధికారుల సోదాలు నిర్వహించారు. ఏపీ నుంచి వెళ్తున్న ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. బస్సులో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను ఆర్టీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిబంధనలు పాటించని 5 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. అలాగే, ఎల్బీనగర్లోని చింతలకుంట వద్ద కూడా ఆర్టీఏ అధికారుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో నాలుగు బస్సులపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. -
డెత్ ట్రావెల్స్
గాల్లో తేలుతున్నదో... రోడ్డుపై ఉరకలెత్తుతున్నదో తెలియనంత పెనువేగంతో దూసుకు పోయే ట్రావెల్స్ బస్సు శుక్రవారం వేకువజామున కర్నూలు సమీపాన ప్రమాదంలో చిక్కుకుని 19 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. ఇటీవల ఈ రకం బస్సులు తరచూ ప్రమాదాలకు లోనవుతున్నాయి. పదిరోజుల క్రితం రాజస్థాన్‌లో కూడా ఇలాంటి బస్సే తగలబడి 20 మంది మరణించారు. ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో తాజా ప్రమాదం జరిగిందంటున్నారు. చూడటానికి భారీగా కనిపిస్తూ మెరిసే అద్దాలతో, సకల హంగులతో, స్లీపర్ కోచ్‌లుగా ఉండే ఈ బస్సులు తక్కువ వ్యవధిలో గమ్యాన్ని చేరుస్తా యని ఆశిస్తారు. అంత వేగంతో పోవటానికి అవసరమైన ఏర్పాట్లున్నాయో లేదో ఎవరూ గమనించుకోలేరు. ఇవి రోడ్డెక్కింది మొదలుకొని పాదచారుల నుంచి వాహనదారుల వరకూ అందరినీ హడలెత్తిస్తాయి. డిజైన్ రీత్యా చూసినా, బస్సు అంతర్నిర్మాణంఅందంగా కనబడటానికి వాడే మెటీరియల్ గమనించినా అవి ఏమాత్రం సురక్షితం కాదని తెలిసిపోతుంది. సీట్ల మధ్య తక్కువ స్థలం ఉండటంవల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులకు తప్పుకునే వ్యవధి ఉండదు. ఇవి ఎక్కువగా రాత్రివేళల్లో వెళ్తుంటాయి కాబట్టి ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటారు. మెలకువ వచ్చి ఏదో జరిగిందనిగుర్తించేలోపే మంటలు చుట్టుముడతాయి. కనీసం పక్కవారిని అప్రమత్తం చేయటం మాట అటుంచి, గమనించినవారు తప్పుకోవటమే అసాధ్యమవుతుంది. గందరగోళం ఏర్పడి తోపులాట చోటుచేసుకుంటుంది. ఇక సురక్షితంగా బయటపడేదెక్కడ? సుదూర ప్రయాణాల్లో డ్రైవర్లకు తగిన విశ్రాంతికి సమయం చిక్కకపోతే, అలసటకు లోనయితే కునుకుతీసే ప్రమాదం ఉంటుంది. రాత్రివేళ ప్రమాదాలకు ఇదొక కారణం.దానికితోడు బస్సు లోపల సర్వసాధారణంగా బెర్త్‌ల కోసం వాడే ఫైబర్, రెగ్జిన్, తెరల కోసం ఉపయోగించే పాలియెస్టర్, సిల్క్ వగైరాలు మండే స్వభావం ఉండేవి. చిన్న నిప్పురవ్వ చాలు... సెకన్ల వ్యవధిలో భగ్గున మండటానికి! నిప్పంటుకున్నప్పుడు కేబుళ్లు దగ్ధమై ఎమర్జెన్సీ డోర్లు సైతం మొరాయిస్తాయి. అదృష్టవశాత్తూ తెరుచుకునే సందర్భా లున్నా కనీసం 8,9 అడుగుల ఎత్తులో స్లీపర్లపై ఉన్నవారు వాటివద్దకు చేరుకోవటం అయ్యే పనేనా? అద్దాలైనా అంత సులభంగా బద్దలుకావు. ఇవన్నీ ముప్పును మరింత పెంచేవే. ఈ రకం బస్సుల సంక్లిష్ట నిర్మాణం వల్ల ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు బయటి వారు సాయపడాలన్నా అసాధ్యమే. రోడ్డు ప్రమాదాలు సహజంగా జరిగేవికాదని, మనుషుల తప్పిదాల వల్లా, నిర్లక్ష్యంవల్లా అవి చోటుచేసుకుంటాయని గతంలో ఫార్ములా వన్ ఛాంపియన్షిప్ గెలిచిన వ్యాపారి మారియో గాబ్రియెల్ అన్నారు. తాజా ప్రమాదం విషయంలో కూడా అది అక్షరాలా నిజం. స్లీపర్ బస్సులు సాధారణంగా ఏసీ సదుపాయంతో ఉంటాయి. సాధా రణ బస్సులతో పోలిస్తే ఈ బస్సుల్లో అధిక విద్యుత్ అవసరమవుతుంది. ఏసీని కనీసం 24 డిగ్రీల వద్ద ఉంచాలి. కానీ అంతకన్నా తగ్గిస్తే చల్లదనం పెరగొచ్చుగానీ దానివల్ల విద్యుత్ వినియోగం ఎక్కువవుతుంది. ఆ మేరకు కేబుళ్లపై ఒత్తిడి పెరిగి అవి త్వరగా వేడెక్కుతాయి. కంప్రెసర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దానికి మధ్యమధ్యలో విరామం ఇవ్వకపోతే పనితీరు దెబ్బతింటుంది. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు తనిఖీ చేసు కుంటూ అవసరాన్నిబట్టి మారుస్తుండాలి. లేనట్టయితే షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు వీటిని నిశితంగా గమనిస్తున్నారా? ప్రమాదానికి లోనయిన బస్సు ఫిట్నెస్ బాగానే ఉందని రవాణా అధికారులు చెబుతున్నారు. అందులోని నిజానిజాల సంగతటుంచి అంతటి పెనువేగంతో వెళ్లేందుకు అనువుగా మన రోడ్లు ఉంటున్నాయా? అధిక వేగంతో పోయే వాహనాలను నడిపేవారి సామర్థ్యాన్ని కొలిచేందుకు విడిగా పరీక్షలుంటున్నాయా? ఎంతో చురుగ్గా ఉండేవారు చోదకులుగా ఉంటే క్లిష్ట సమయాల్లో తక్షణం స్పందించగలుగుతారు. లేనట్టయితే పెను ప్రమాదాలకు కారణమవుతారు. అసలు ఈ మాదిరి బస్సులపై రెండు దశాబ్దాల క్రితంనుంచే చైనా, జర్మనీ వంటి దేశాల్లో నిషేధం అమలవుతోంది. మన దేశం కూడా ఆ దిశగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనట్టే ఉంది. -
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బస్సు.. ఒకరి మృతి
సాక్షి, నల్గొండ : నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ (ఆరెంజ్ ట్రావెల్స్) బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామానికి చెందిన వీరు.. చెరువు అన్నారం వైపు ట్రాక్టర్‌పై గడ్డి కోసం వెళ్లారు. అదేసమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్లో ఉన్న ఐదుగురిలో ఒకరు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణిస్తున్న వారు మరో బస్సెక్కి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ ఘటనపై కట్టంగూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ఒక్క పర్మిట్.. రెండు బస్సులు
సాక్షి, అమరావతి: ఆటోల నుంచి రోడ్ ట్యాక్స్‌ను, ఫిట్నెస్ ఫీజు జాప్యానికి అపరాధ రుసుమును ముక్కు పిండి వసూలు చేసే రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్స్‌కు మాత్రం మినహాయింపునిస్తోంది. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతూ రోడ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నా చేష్టలుడిగి చూస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల్లో చాలామంది అధికార పార్టీకి చెందిన వారే కావడంతో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదు. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతూ ట్రావెల్స్ నిర్వాహకులు రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాష్ట్రంలో 491 ప్రైవేట్ బస్సులు కాంట్రాక్టు క్యారేజీ కింద అనుమతి పొందగా, ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు మరో 750 వరకు ఉన్నాయి. సాధారణంగా ప్రతి ప్రైవేట్ బస్సు ప్రతి మూడు నెలలకోసారి విధిగా త్రైమాసిక పన్ను చెల్లించాలి. సీటుకు రూ.3,750 చొప్పున చెల్లించాలి. ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులతో కలిపి ఏటా రూ.50 కోట్ల వరకు రోడ్ ట్యాక్స్ వసూలు కావాల్సి ఉండగా, రూ.25 కోట్లే వసూలవుతున్నట్లు రవాణా వర్గాలు పేర్కొనడం గమనార్హం. ఆన్‌లైన్‌పై విముఖత అధికార పార్టీకి చెందిన ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పుతుండడంతో రోడ్ ట్యాక్స్ ఆదాయానికి గండి పడుతోంది. ఉదాహరణకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక పర్మిట్‌తో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరితే, రెండో బస్సు అదే పర్మిట్ నంబరుతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరుతుంది. రవాణా శాఖ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తోంది. ఆన్లైన్లోనే రోడ్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఈ విధానంలో పన్ను చెల్లిస్తే.. ఒకే పర్మిట్‌తో రెండు బస్సులను తిప్పడం కష్టం. దీంతో ఆన్లైన్లో పన్ను చెల్లించేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టపడడం లేదు. -
ఎమ్మెల్యే జేసీ అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత
-
14 ట్రావెల్స్ బస్సుల సీజ్
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపించారు. నగరంలోని పెద్దఅంబర్‌పేట్ వద్ద బుధవారం ఉదయం తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ అధికారులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 14 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు. -
ఎల్బీనగర్లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు
హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని పలు ట్రావెల్స్ బస్సులకు జరిమానా విధించారు. అలాగే మూడు బస్సులను సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. -
ట్రావెల్స్ బస్సులపై దాడులు ఆపండి
అరండల్‌పేట (గుంటూరు), న్యూస్‌లైన్: ప్రైవేటు ట్రావెల్స్‌పై అక్రమ దాడులను వెంటనే నిలిపివేయాలని ట్రావెల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు డిమాండ్‌చేశారు. అక్రమ దాడులతో వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీవో కార్యాలయం ఎదుట కార్మికులు, నిర్వాహకులు ధర్నా చేశారు. బస్సులతోసహా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని, తమ జీవనోపాధికి గండి కొట్టవద్దంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ట్రావెల్స్ అసోసియేషన్ నాయకులు సాంబశివరావు, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ప్రతిరోజూ ప్రైవేటు ట్రావెల్స్‌పై దాడులు చేస్తున్నారని, దీంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో సుమారు 500 కుటుంబాల వరకు ఈ ట్రావెల్స్‌పై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణాశాఖ అధికారుల తీరుతో తమకు ఉపాధి ఉండడం లేదన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని డిమాండ్‌చేశారు. ఈ రంగంలో అనేక మంది మెకానిక్‌లు, క్లీనర్లు, సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. అనంతరం డీటీసీ సుందర్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ అండ.. ట్రావెల్స్ బస్సు కార్మికులు ఆర్టీవో కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా, నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గం కన్వీనర్ నసీర్ అహ్మద్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ గులాం రసూల్, ఎస్సీ విభాగం నగర కన్వీనర్ విజయ్‌కిషోర్, పార్టీ నాయకులు జూలూరి హేమంగద గుప్తా, శ్రీకాంత్‌యాదవ్, తిరుపతి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం డీటీసీ సుందర్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ట్రావెల్స్ బస్సులు ఆపడంతో కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. నగరంలోనే వందల కుటుంబాలు దీనిపై జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిల మధ్య నెలకొన్న వివాదాలకు కార్మికులు, నిర్వాహకులు బలవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. డీటీసీ సుందర్ మాట్లాడుతూ కార్మిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని, మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఈనెల 27న మళ్లీ ఆందోళన చేపడతామని నాయకులు తెలిపారు.


