అదంతా కొడుకు మహిమేనట...
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ క్యాపిటల్ అధిపతి అనిల్ అంబానీ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో తన కుమారుడు, బోర్డ్ లో కొత్త డైరెక్టర్ అన్మోల్ అంబానీ (24) పరిచయం చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన రాక కంపెనీకి "అద్భుతమైన అదృష్టం" తెచ్చిపెట్టిందని అనిల్ పొంగిపోయారు. అన్మోల్ నియామకం తరువాత షేర్ ధర 40 శాతం పెరిగిందనీ, భవిష్యత్తులో కూడా ఆ ప్రభావం కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన వాటాదారుల సమావేశంలో ఫుల్ టైం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ నియామకానికి ఆమోదం లభించింది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అన్మోల్ యొక్క నియామకానికి ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చెప్పిన వాటాదారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశ జనాభాలో 30 సంవత్సరాల సగటు వయస్సు గా ఉంటే, తమ రిలయన్స్ క్యాపిటల్ ఉద్యోగుల సగటు వయస్సు 34 సంవత్సరాలని అనిల్ పేర్కొన్నారు. అన్మోల్ రాక సంస్థకు అదృష్టం తెచ్చిపెట్టిందనీ, మెరుగైన పనితీరు, టీమ్ వర్క్ ఆధారంగా సంస్థ అభివృద్ధిలో 'అన్మోల్ ప్రభావం' ఇక ముందు కూడా కొనసాగుతుందని విశ్వసిస్తున్నానని చైర్మన్ చెప్పారు.
కాగా లండన్ వార్విక్ బిజినెస్ స్కూల్ నుండి డిగ్రీ పొందిన అన్మోల్, రిలయన్స్ కాపిటల్ మండలిలో పూర్తి కాలపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియామకమైన సంగతి తెలిసిందే. సుమారు రూ .4,000 కోట్ల ఆదాయంతో, రిలయన్స్ క్యాపిటల్ జీవిత భీమా, వాణిజ్య ఆర్ధిక, సెక్యూరిటీలు, సాధారణ ఫైనాన్స్ , మ్యూచువల్ ఫండ్స్ సేవలను అందిస్తోంది. కాగా అన్మోల్ నియామకానికి ముందు రూ.467 గా వున్న షేర్ ధర రూ.575 వద్ద ట్రేడవుతోంది. గత నెలలో సంభవించిన షార్ప్ ర్యాలీ ద్వారా గత ఏడాదిగా దాదాపు 70 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2014నుంచి సంస్థకు సేవలందిస్తున్న అన్మోల్ .. రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో ఛైర్మన్ అనిల్ అంబానీ తర్వాత ఆయన పెద్ద కుమారుడుగా ఏకైక ఇతర కుటుంబ సభ్యుడు కావడం విశేషం.