గిరిజన చట్టాల అమలుతోనే సుపరిపాలన
భద్రాచలం, న్యూస్‌లైన్: గిరిజన చట్టాల అమలుతోనే ఏజెన్సీలో సుపరిపాలన సాధ్యమవుతుందని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. ‘మన చట్టాలు-మన కోసం’ అనే అంశంపై భద్రాచలంలోని గిరిజన బీఈడీ కళాశాలలో ఆదివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచులు, అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో వెనుకబడిన గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన చట్టాలను పకడ్బందీ గా అమలుచేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నా రు. పీసా చట్టం అమలులో గ్రామసభకు సర్వాధికారాలు ఉంటాయన్నారు. గిరిజన చట్టాలపై పూర్తిగా అవగాహన పెంచుకుని, వాటిని ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజానీకానికి ఉపయోగపడేలా అమలు చేయాలని కోరారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా గిరిజన ప్రాంతా ల్లో చేపట్టే పనులపై ఇంజనీరింగ్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఐటీడీఏ పీఓ వీరపాండియన్ మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కును గిరిజనులు వినియోగించుకునేందుకు వీలుగా అధికారులు కృషి చేయాలన్నారు. గిరిజన చట్టాలపై ఏజెన్సీలోని అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. పీసా చట్టం గురించి అందరికీ తెలీకపోవడంతో దాని అమలుకు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు.
జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ మాట్లాడుతూ... నూతన సర్పంచులకు చట్టాలపై అవగాహనకు సదస్సుల ఏర్పాటు అభినందనీయమన్నారు. గ్రామాల్లో ఎల్టీఆర్ కేసుల సత్వర పరిష్కారానికి తహశీల్దారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ సదస్సులో భద్రాచలం ఆర్డీఓ కాసా వెంకటేశ్వర్లు, జిల్లాపరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.