ఎఫ్ఐఐలు, రూపాయే కీలకం..
ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల విశ్లేషణ
విదేశీ అంశాలపైనే ఇన్వెస్టర్ల దృష్టి...
తదుపరి ట్రిగ్గర్ క్యూ2 ఆర్థిక ఫలితాలే...
న్యూఢిల్లీ: దేశీయంగా తక్షణం ఎలాంటి కీలకాంశాలూ(ట్రిగ్గర్స్) లేకపోవడంతో స్టాక్ మార్కెట్లకు విదేశీ పరిణామాలే ఈ వారం కీలకంగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అదేవిధంగా విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) ధోరణి, రూపాయి కదలికలు కూడా మార్కెట్లకు దిక్సూచిగా పనిచేస్తాయని చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి అంతకంతకూ తీవ్రం అవుతున్న నేపథ్యంలో దేశీ మార్కెట్లలో సానుకూల ధోరణి నెమ్మదించే అవకాశం ఉందని కూడా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సమీప భవిష్యత్తులో దేశీయంగా చెప్పుకోదగిన పెద్ద పరిణామాలేవీ కనబడటం లేదు. రెండో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్) ఆర్థిక ఫలితాల సీజన్ కూడా అక్టోబర్ మధ్య నుంచి ఆరంభం కానుంది. అందువల్ల ఈ వారం అంతర్జాతీయ అంశాలపైనే ప్రధానంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించే అవకాశం ఉంది’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ వ్యవస్థాపక డెరైక్టర్ విజయ్ సింఘానియా వ్యాఖ్యానించారు. రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇంకా రేట్ల కోత మూడ్‌లోనే...
ఆర్బీఐ అర శాతం రెపో రేటు తగ్గింపు ప్రభావంతో పలు బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు బాట పట్టిన సంగతి తెలిసిందే. మార్కెట్లు ఇంకొన్ని రోజులు ఈ సానుకూల మూడ్‌లోనే ఉండొచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు తదుపరి ట్రిగ్గర్‌గా పనిచేస్తాయన్నారు. మార్కెట్లు ఈ ఫలితాల ధోరణిని నిశితంగా గమనించనున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12న ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలను ప్రకటించనుంది. కాగా, స్థూల ఆర్థిక గణాంకాలు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర వంటివన్నీ సమీప కాలంలో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్(రీసెర్చ్) వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు.
అమెరికా జాబ్ డేటా ప్రభావం...
అమెరికాలో ఉద్యోగ గణాంకాల ప్రభావం సోమవారం మన స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో అమెరికాలో కొత్తగా 1,42,000 ఉద్యోగాలు నమోదయ్యాయి. ఆగస్టుతో పోలిస్తే(1,73,000) భారీగా తగ్గడంతో పాటు అంచనాలకు(2.1 లక్షలు) ఆమడదూరంలో నిలవడం గమనార్హం. అయితే, నిరుద్యోగ రేటు మాత్రం ఏడేళ్ల కనిష్టస్థాయి అయిన 5.1 శాతంగానే కొనసాగుతోంది. జాబ్ మార్కెట్ మందగమనం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ఈ ఏడాది ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలు బలపడుతున్నాయి. గత నెలలో జరిగిన సమీక్షలో ఫెడ్ వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించిన విషయం తెలిసిందే. ఫెడ్ రేట్ల పెంపు భయాలతోనే వర్ధమాన దేశాల్లో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. కాగా, తదుపరి ఫెడ్ సమావేశం ఈ నెల 27-28 తేదీల్లో జరగనుంది.
గత వారం మార్కెట్...
ఆర్బీఐ అనూహ్యంగా పాలసీ వడ్డీ రేటు(రెపో)ను అర శాతం కోత విధించడంతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1.38 శాతం లాభపడి 26,221 పాయింట్ల వద్ద ముగిసింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 83 పాయింట్లు ఎగబాకి 7,951 వద్ద స్థిరపడింది.
సెప్టెంబర్‌లో రూ.6,500 కోట్లు వెనక్కి..
విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ఉపసంహరణ వరుసగా రెండో నెలలోనూ కొనసాగింది. సెప్టెంబర్‌లో దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ.6,475 కోట్ల మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. డెట్ మార్కెట్లో మాత్రం గత నెలలో రూ.692 కోట్లను నికరంగా వెచ్చించారు. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, ఫెడ్ వడ్డీరేట్ల పెంపుపై అనిశ్చితి, చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గింపు వంటి అంశాలు ఎఫ్‌పీఐల తిరోగమనానికి ప్రధాన కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ఆగస్ట్‌లో రికార్డు స్థాయిలో ఎఫ్‌పీఐలు నికరంగా 17,428 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్‌లో రూ.21,047 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.39,395 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు.